తెలంగాణాలో కాంగ్రెస్- టీడీపీ పొత్తు.. టీ-టీడీపీకి స్వేచ్ఛ..!!
posted on Sep 7, 2018 @ 10:59AM
తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది.. ఇప్పటికే అధికార పార్టీ తెరాస అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు సిద్ధమైంది.. అంతేకాదు తొలివిడతగా 105 మంది అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించింది.. ప్రతిపక్ష పార్టీలు కూడా ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేము కూడా సిద్దమే అంటూ ఓ వైపు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉంటూ మరోవైపు ఇతర పార్టీలతో పొత్తులకు ప్రణాళికలు వేస్తున్నాయి.. ప్రధానంగా కాంగ్రెస్- టీడీపీ ల పొత్తు గురించి అందరూ ఎక్కువగా చర్చించుకుంటున్నారు.. కొందరు పొత్తు ఉండదంటే కొందరు మాత్రం పొత్తు ఖచ్చితంగా ఉంటుంది అంటున్నారు.
ఏపీలో అయితే ఈ రెండు పార్టీల మధ్య పొత్తుకు ఆస్కారం లేదు కానీ తెలంగాణలో మాత్రం అవకాశం ఉండనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.. ఈ పార్టీల మధ్య పొత్తు గురించి ఇంకా చర్చ జరగలేదు కానీ రెండు పార్టీలు విడివిడిగా అంతరంగంగా చర్చించుకుంటున్నాయి.. తెలంగాణలో అయితే ఈ పార్టీల మధ్య పొత్తు కుదిరేలాగానే ఉంది.. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు కూడా పొత్తు గురించి పార్టీ నేతలతో చర్చించినట్టు సమాచారం.. తెలంగాణలో ఒకవేళ కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాల్సి వస్తే దానివల్ల ఏపీలో ఇబ్బంది వస్తుందేమోనని కొందరు నేతలు సందేహం వ్యక్తం చేయగా.. ‘ఇవి రెండు వేర్వేరు రాష్ట్రాలు.. ఎక్కడి పార్టీలు అక్కడ ఉన్నాయి.. అక్కడి రాజకీయ పరిస్థితులను బట్టి అక్కడ ఏం చేయాలో నిర్ణయించుకొనే స్వేచ్ఛ తెలంగాణ టీడీపీ రాష్ట్ర కమిటీకి ఇద్దాం.. నేను శనివారం అక్కడకు వెళ్తున్నాను.. అక్కడి నేతలతో మాట్లాడతాను.. వారి అభిప్రాయాలు కూడా తెలుసుకొంటాను.. అక్కడైనా ఇక్కడైనా ఒకటి మాత్రం స్పష్టం.. మోదీ మళ్లీ రావడం దేశానికి నష్టం.. దాని ప్రాతిపదికపైనే పార్టీ నడుస్తుంది’ అని చంద్రబాబు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.