బీఎస్పీ అభ్యర్థికి కూటమి మద్దతు..
posted on Nov 22, 2018 @ 10:02AM
కూటమిలోని కాంగ్రెస్ పార్టీ టీడీపీకి షాక్ ఇచ్చింది. ఇబ్రహీంపట్నం స్థానాన్ని పొత్తులో భాగంగా టీడీపీకి దక్కింది. సామ రంగారెడ్డికి టీడీపీ టికెట్ కేటాయించింది. రంగారెడ్డి మొదటి నుంచి ఎల్బీనగర్ నుంచి పోటీ చేయాలని ఆశించారు. కానీ ఎల్బీనగర్ స్థానాన్ని కూటమి పొత్తుల్లో కాంగ్రెస్ నేత సుధీర్‌రెడ్డికి కేటాయించారు. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన రంగారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యి తనకి ఎల్బీనగర్ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారు. చంద్రబాబు పొత్తులో భాగంగా ఆ స్థానం కాంగ్రెస్ కి కేటాయించామని ఈసారికి సర్దుకుపొమ్మనటంతో ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేసేందుకు ముందుకొచ్చారు. టీడీపీ తరుపున నామినేషన్ దాఖలు చేశారు. కానీ ఇబ్రహీంపట్నం టికెట్ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ నేత మల్ రెడ్డి రంగారెడ్డి బీఎస్పీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అలాగే ఆయన సోదరుడు మల్‌రెడ్డి రామిరెడ్డి ఎన్సీపీ నుంచి నామినేషన్ వేశారు. కాంగ్రెస్ కి చెందిన వీరిద్దరూ అనూహ్యంగా బీఎస్సీ, ఎన్సీపీల నుంచి నామినేషన్లు దాఖలు చేయడంతో కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో పడింది.
అయిష్టంగానే ఇబ్రహీంపట్నంలో నామినేషన్ వేసిన సామ రంగారెడ్డి తనకు పోటీగా మల్‌రెడ్డి రంగారెడ్డి నామినేషన్ వేయడంతో విజయావకాశాలపై అనుమానాలు మొదలయ్యాయి. అందుకే, ఎల్బీనగర్ నుంచి స్వతంత్రుడిగా నామినేషన్ వేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా మల్రెడ్డికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా మల్రెడ్డి సోదరులతో సమావేశమయ్యారు. ఇద్దరు నేతల మధ్య రాజీ కుదిర్చారు. మల్‌రెడ్డి రామిరెడ్డి పోటీ నుంచి తప్పుకోవడానికి అంగీకరించారు. దాంతో మల్‌రెడ్డి రంగారెడ్డికి మార్గం సుగమం అయ్యింది. మల్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడంపై టీడీపీ ఎలా స్పందిస్తుందో ? అసలే గెలుపై అనుమానం వ్యక్తం చేస్తున్న రంగారెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అని ఆసక్తి నెలకొంది.