కాంగ్రెస్ వెర్సెస్ కాంగ్రెస్
posted on Mar 7, 2014 @ 3:33PM
కాంగ్రెస్ నేతలు చాలా మంది తమ పార్టీని దేశంలో ఏ ఇతర పార్టీ ఓడించలేదని, కేవలం తమని తాము ఓడించుకొన్నపుడే ఇతరులు విజయం సాధిస్తుంటారని చాలా గర్వంగా చెప్పుకొంటుంటారు. వారి మాట అక్షరాల నిజమని అనేక సార్లు నిరూపించబడింది. మళ్ళీ రేపు ఎన్నికలలో మరోమారు నిరూపింప బడబోతోంది. అయితే, ఈసారి కాంగ్రెస్ పార్టీ తనని తాను ఓడించుకోవడానికి గతంలో లాగ గ్రూపులుగా విడిపోయి కొట్టుకోకుండా, ఈసారి మరి కొంచెం ఆధునిక పద్దతిలో పార్టీలుగా విడిపోయి కొట్టుకోబోతోంది. అయితే ఈసారి ఓడిపోయేందుకు గాక గెలిచేందుకే అలా విడిపోయి తనలో తాను పోరాడుకొంటున్నట్లు నటిస్తోంది. కానీ కాంగ్రెస్ నేతల మాట ఎన్నడూ వమ్ము కాలేదు. కనుక ఈసారి కూడా కాంగ్రెస్ తనని తాను ఓడించుకొని రాష్ట్రంలో, దేశంలో ప్రతిపక్షాలను గెలిపించబోతోంది.
రాష్ట్ర విభజన చేసినందుకు ఆగ్రహంతో ఉన్న సీమాంధ్ర ప్రజలు, ఇంకా పార్టీని పట్టుకొని వ్రేలాడుతున్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు, రాష్ట్ర విభజనను సమర్ధిస్తూ, ప్యాకేజీల గురించి మాట్లాడటం చూసి కాంగ్రెస్ పార్టీపై మరింత రగిలిపోతున్నారు. బహుశః ఈ కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ వ్యతిరేఖతను మరింత పెంచి పోషించి, కొత్తగా పార్టీ పెడుతున్న కిరణ్ కుమార్ రెడ్డికి, కాంగ్రెస్ తో రహస్య ఒప్పందం కుదుర్చుకొన్న జగన్మోహన్ రెడ్డి కి కాంగ్రెస్ వ్యతిరేఖ ఓట్లు దండిగా పడాలని ఉద్దేశ్యపూర్వకంగానే వారు ఆవిధంగా మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దానివలన వారాశించిన ఫలితం రాకపోగా, పూర్తి వ్యతిరేఖ ఫలితాలు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎందువలన అంటే, లగడపాటి, పురందేశ్వరి, హర్ష కుమార్, ఉండవల్లి, కిరణ్ కుమార్ రెడ్డి వంటి కరడు గట్టిన కాంగ్రెస్ వాదులే తమ పార్టీ జగన్మోహన్ రెడ్డితో రహస్య ఒప్పందం కుదుర్చుకొందని చెపుతున్నారు. మళ్ళీ వారిపై ఇప్పుడు కాంగ్రెస్ లో మిగిలిన బొత్స, డొక్కా,కొండ్రు, రఘువీరా వంటి నేతలు కిరణ్, జగన్ ఇద్దరూ అవకాశ వాదులని, వారిరువురూ ప్రజలను వంచిస్తున్నారని పదేపదే గట్టిగా వాదిస్తున్నారు.
ఈవిధంగా కాంగ్రెస్ నేతలు పార్టీలుగా విడిపోయినప్పటికీ, అలా ఎందుకు విడిపోయారో మరచి పోయి, ఒకరి చరిత్రలు మరొకరు బయటపెట్టుకొని, ప్రజలకి వారి నాటకం కళ్ళకు గట్టేవిధంగా వారే ప్రదర్శించుకొని వారిని వారే ఓడించుకొబోతున్నారు. కొందరు మనుషులు జీవితంలో త్వరగా పైకి ఎదగడానికి అడ్డు దారులు త్రొక్కి అదః పాతాళానికి పడిపోతుంటారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ అధికారంలోకి రావడానికి ఒక వినాశాకరమయిన ప్రయోగం చేస్తోందిపుడు. దాని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పటికే స్పష్టంగా కనబడుతున్నాయి. తమని తామే ఓడించుకొంటామనే కాంగ్రెస్ నేతల మాట ఎన్నడూ వమ్ము కాదని ఎన్నికల తరువాత వారే నిరూపిస్తారు.