కాంగ్రెస్ నయా ప్లాన్.. లోక్‌సభ పోరులో బీఆర్ ఎస్‌కు చుక్కలే!
posted on Feb 3, 2024 @ 4:12PM
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ జోరు కొనసాగిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలుచేస్తూ రేవంత్ సర్కార్ ప్రజల్లో ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఆరు గ్యారెంటీలకు ప్రాధాన్యతనిస్తూ విడతల వారిగా అమలు చేస్తోంది. మరోవైపు రైతు బంధు, రుణమాఫీపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే ముప్పావుశాతం రైతులకు రైతు బంధు నిధులను ప్రభుత్వం జమ చేసింది. రుణమాఫీ అమలుపై దృష్టిపెట్టింది.. లోక్‌సభ ఎన్నికల కోడ్ వచ్చేలోపు రుణమాఫీని అమలు చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ యోచిస్తున్నట్లు సమాచారం.
మొత్తానికి రేవంత్ సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి పేద బడుగు వర్గాల్లో మంచి పేరును సంపాదించుకుందనే చెప్పాలి. మరో వైపు తెలంగాణ ఉద్యమ కారులపై రేవంత్ దృష్టి సారించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించి బీఆర్ ఎస్ పదేళ్ల కాలంలో ఆదరణకు నోచుకోని వారికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రాధాన్యత దక్కేలా దృష్టిసారించారు.
ఎమ్మెల్సీ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం పేరును ప్రతిపాదించడం ద్వారా తెలంగాణ ఉద్యమకారుల్లో రేవంత్ సర్కార్ పై మరింత నమ్మకం ఏర్పడింది. అంతేకాక. తాజాగా, ప్రతీయేడాది సినీ కళాకారులకు అందించే నంది అవార్డుల పేరును మార్పు చేస్తూ గద్దర్ అవార్డులుగా నామకరం చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఫలితంగా. తెలంగాణలోని గద్దర్ అభిమానులకు ఓ తీపికబురు చెప్పారు. తెలంగాణలో గద్దర్‌కు అభిమాన ఘనం ఎక్కువే. సీఎం రేవంత్ రెడ్డి తాజా నిర్ణయంతో గద్దర్ ను అభిమానించే వారు రేవంత్ సర్కార్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాక, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా ప్రభుత్వం పథకాలు అందించడంలో సీఎం రేవంత్ తో పాటు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రత్యేక దృష్టిసారించారు. ఫలితంగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల నాటితో పోలిస్తే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి మరింత ఆదరణ పెరిగిందని సర్వేలు తేటతెల్లం చేస్తున్నాయి. రేవంత్ సర్కార్ తాజా నిర్ణయాలన్నీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకును పెంచేలా ఉపయోగపడతాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.
రేవంత్ రెడ్డి ముందున్న బిగ్ టార్గెట్ లోక్‌సభ ఎన్నికలు. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాల్లో కనీసం 12 నుంచి 15 వరకు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి అండ్ కో వ్యూహాలు రచిస్తోంది. ఈ వ్యూహాల్లో భాగంగా కాంగ్రెస్ అధిష్టానం నయా ప్లాన్ కు తెరలేపింది. లోక్‌సభ ఎన్నికల నాటికి సాధ్యమైనంత మందిని బీఆర్ ఎస్ లోని మాజీ ఎమ్మెల్యేలు, అసంతృప్తులు, ద్వితీయ శ్రేణి నేతలను కాంగ్రెస్ లోకి తీసుకు రావడమే ఆ ప్లాన్ గా కనిపిస్తోంది. ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలను అవిశ్వాసాల ద్వారా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటున్నది. అలాగే నియోజకవర్గంలో ప్రజా ఆదరణ ఉండి, బీఆర్ ఎస్ పార్టీలో ఆదరణ నోచుకోని నేతలను టార్గెట్ చేస్తున్నకాంగ్రెస్ అధిష్టానం.. వారిని పార్టీలోకి తీసుకొచ్చేలా ప్రయత్నాలు మొదలు పెట్టింది.
కాంగ్రెస్ అధిష్టానం వ్యూహంలో భాగంగా మంత్రి పొంగులేటితో పాటు పలువురు మంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. బీఆర్ ఎస్ లో అసంతృప్తిగా ఉంటూ ప్రజాదరణ కలిగిన నేతలను కాంగ్రెస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. బీఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈ నెల 10న ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం. మరోవైపు మాజీ మంత్రి, హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే జనగాల పెద్దిరెడ్డి సైతం త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ఇలా ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో నలుగురైదుగురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ ముఖ్యనేతలు, ద్వితీయ శ్రేణి నేతలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించినట్లు తెలుస్తోంది. వారిని కాంగ్రెస్ లోకి తీసుకురావడం ద్వారా రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీకి గట్టి షాకిచ్చేలా కాంగ్రెస్ వ్యూహాలను సిద్ధం చేస్తోంది. మొత్తానికి 17 పార్లమెంట్ స్థానాల్లో 12 నుంచి 15 నియోజకవర్గాల్లో పాగా వేసేలా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఆ వ్యూహాలు ఫలిస్తే బీఆర్ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.