తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి నాయకత్వం మార్పు
posted on Feb 5, 2020 @ 10:31AM
మున్సిపల్ ఎన్నికల్లో పరాజయంతో తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి నాయకత్వం మార్పు డిమాండ్ తెరపైకి వచ్చింది. తెలంగాణలో పార్టీ బతికి బట్టకట్టాలంటే టీపీసీసీ చీఫ్ ని వెంటనే మార్చాలంటూ హైకమాండ్ ను కోరుతున్నారు. అయితే అసలు సమస్యల్ని పక్కన పెట్టేసి నాయకత్వ మార్పు చేస్తే కాంగ్రెస్ కు పునర్ వైభవం వస్తుందా.. వరుస ఎన్నికల్లో ఓటమితో మరోసారి పాత రాగమే అందుకున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. టీపీసీసీ చీఫ్ ను వెంటనే మార్చాలంటూ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణనిచ్చామని పదేపదే చెప్పుకునే కాంగ్రెస్ నేతలు ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చినప్పటికీ వరుస ఓటములు పలకరించడంతో ఆ నెపాన్ని నాయకత్వంపై తోసేసి చేతులు దులుపుకునే పని చేస్తున్నారు. అసలు పార్టీ ఎందుకు వైఫల్యం చెందుతుందని ఎన్నడూ రివ్యూల జోలికి వెళ్లకుండా అంతర్గత కుమ్ములాటల్లో బిజీ అయిపోయారు. నాయకత్వం మార్పు అనేది సర్వసాధారణం కానీ, కేసీఆర్ ను ఎదుర్కొనగలిగే నాయకుడికి పగ్గాలు అప్పగించాలని కొందరు, లేదు లేదు పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి పీసీసీ ఇవ్వొద్దని ఇంకొందరు అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకున్నారు.
లాయల్ గా ఉండే వారికే పదవి ఇవ్వాలని డిమాండ్ చేసినవాళ్లు మరికొందరు. అయితే పార్టీ నాయకులు అసలు లాజిక్ మిస్ అవుతున్నట్లు కనిపిస్తోంది. అధికారంలోకి రావాలంటే కేవలం నాయకత్వ మార్పు ఒక్కటే మాత్రం కాదని, అంతర్గత సమన్వయం కూడా అవసరం అంటున్నారు విశ్లేషకులు. గడచిన ఆరేళ్ళలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెప్పుకోదగ్గ ప్రజా ఆందోళనలు చేసిన దాఖలాలు లేవు. ప్రజల పక్షాన రోడ్డెక్కిన నాయకులు లేరు. దీంతో జనంలోకి వెళ్లడమే మానేసి కుమ్ములాటలు పెట్టుకుంటే అధికారం ఎలా దక్కుతుంది అని ప్రశ్నిస్తున్నారు. పార్టీ అధిష్టానం కూడా ఇలాంటి అంశాలను వదిలేసినట్టు కనిపిస్తుంది. నాయకుల మధ్య పోటీ అంతర్గత విభేధాలు పక్కనపెట్టేలా చేసి అందరినీ ఏకతాటి పైకి తీసుకొచ్చే ప్రయత్నాన్ని అధిష్టానం ఇప్పటికీ చెయ్యటం లేదు. పిసిసి నాయకత్వం అప్పటివరకు జిల్లా స్థాయిలో పర్యటన చేసింది కూడా అంతంత మాత్రమే. పార్టీలో సమస్యలు పరిష్కారం చేస్తూనే నాయకత్వాన్ని మార్చితే పార్టీకీ బెనిఫిట్ కానీ, సమస్యలు పక్కన పెట్టి జాతీయ నాయకుడిని పెట్టినా ప్రయోజనం ఆశించలేం అనేది అధిష్టానం ఎప్పుడు ఆలోచిస్తుందో చూడాలి.