నేడు తల్లి కాంగ్రెస్ రేపు....
posted on Jan 13, 2013 @ 9:00PM
ఎప్పుడు ఏశాసనసభ్యుడు ఏపార్టీలోకి కప్పలా గెంతుతాడో ఊహించలేని సంధి కాలం ఇది. నిన్నటివరకు ఏపార్టీ తరపున వఖల్తా పుచ్చుకొని మాట్లాడాడో, మరో పార్టీలోకి మారగానే ఆపార్టీనే ఒక పనికిరాని చెత్త పార్టీగా మీడియా ముందు నిర్లజ్జగా మాట్లాడుతూ ప్రజలని కూడా మభ్యపెట్టాలని చూస్తారు. కాకినాడ కాంగ్రెస్ శాసన సభ్యుడు ద్వారపూడి చంద్రశేకర్ రెడ్డి కాంగ్రెస్ నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి మారగా, రెండవ వ్యక్తి కృష్ణా జిల్లా పెడన శాసనసభ్యుడు జోగి రమేష్ నేడో రేపో అదే పార్టీలోకి జంపింగ్ కోసం సిద్దంగా ఉన్నారు. తనను శాసనసభ్యుని చేసిన కాంగ్రెస్ పార్టీని వదిలిపెడతాను, గానీ తన శాసనసభ్యత్వం మాత్రం వదలబోనని చంద్రశేకర్ రెడ్డి నిసిగ్గుగా తెలియజేయడం వర్తమాన రాజకీయ ప్రమాణాలకు అద్దం పడుతోంది. జోగి రమేష్ కూడా పార్టీ నుంచి బయటపడే ప్రయత్నంలో భాగంగా ‘తాను గత ఎన్నికలలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి బొమ్మతోనే ఎన్నికయ్యానని, వచ్చే ఎన్నికలలో కూడా రాజశేఖరరెడ్డి బొమ్మతోనే ప్రజల దగ్గరకు వెళతానని’ లాంచనంగా ప్రకటన కూడా చేసేసి మూటా ముల్లె సర్దుకోవడం ప్రారంబిచేరు.
ఎన్నికలు దగ్గిర పడుతున్న కొద్దీ, ఇటువంటి కప్ప గంతుల కబుర్లు మనం చాలానే వినవలసి ఉంటుంది. ప్రజలు ఒక పార్టీని అభిమానించి ఆ పార్టీకి చెందినా వ్యక్తికి ఓటేసి గెలిపిస్తే అతను ఈ విదంగా తనకు రాజకీయ ప్రయోజనం చేకూర్చే మరో పార్టీలోకి మారడం ప్రజల ఓటుని అపహాస్యం చేయడమే అవుతుంది.