రండి బాబు రండి..టికెట్లిస్తాం బాబూ.. రండి బాబు రండి....
posted on Mar 8, 2014 6:19AM
తూర్పుగోదావరి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంది. కానీ అభ్యర్థులు దొరక్క పార్టీలు తల పట్టుకుంటున్నాయి. కోనసీమలోని ఏకైక మున్సిపాలిటీ అమలాపురంలో తెలుగుదేశం అభ్యర్థి ఎంపికలో మాజీ మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావుకు తలబొప్పి కడుతోంది. తన అనుచరులే ఇద్దరు పోటీపడుతుండటంతో ఎవరికి బొట్టు పెట్టాలో తెలియని అయోమయంలో ఆయన ఉన్నారు. కాంగ్రెస్‌లో అయితే పార్టీ తరఫున పోటీ చేయమని బతిమలాడుతున్నారు. అవసరమైతే ఇండిపెండెంట్ అభ్యర్థులుగానైనా బరిలోకి దిగుతాము తప్పితే కాంగ్రెస్ నుంచి పోటీచేసేది లేదని చాలామంది తెగేసి చెబుతున్నారు.
తుని, పెద్దాపురంలలో టీడీపీ, తునిలో చైర్మన్ అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించాయి. పెద్దాపురం నియోజకవర్గంలోని పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారు. తన రాజకీయ భవితవ్యంపై ఎటూ తేల్చుకోలేకపోతున్న తరుణంలో పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్ మున్సిపల్ ఎన్నికల ఊసే ఎత్తడం లేదు. మండపేట మున్సిపాలిటీలో 29 వార్డులుండగా ఇంతవరకూ ఏ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేయలేకపోయింది. పార్టీ నాయకులతో వార్డు స్థాయిలో రోజుకు నాలుగైదు ప్రాంతాల్లో భేటీలు జరుగుతున్నాయి. ఈ రకంగా దాదాపు అన్ని మున్సిపాలిటీలలోను అభ్యర్థుల ఎంపిక కోసం నేతలు తలలు పట్టుకుంటున్నారు.