బీజేపీ అందుకే సవరణలు కోరుతోందా?
posted on Feb 11, 2014 @ 12:37PM
రాష్ట్ర విభజన బిల్లు రాష్ట్ర శాసనసభ నుండి డిల్లీకి చేరుకోగానే అంతవరకు బిల్లుకి బేషరతుగా మద్దతు ఇస్తానని చెపుతూ వచ్చిన బీజేపీ ముందు సమన్యాయం పల్లవి ఎత్తుకొంది. ఆ తరువాత సీమాంధ్రకు అన్ని విధాల న్యాయం జరిగేలా ఉంటేనే తాము బిల్లుకి మద్దతు ఇస్తామని చెప్పడమే గాక, అందుకోసం తాము కొన్ని సవరణలు, ప్రతిపాదనలు సూచిస్తామని వాటిని కాంగ్రెస్ అంగీకరిస్తేనే మద్దతు అని మరో కొత్త మెలిక కూడా పెట్టారు. రాష్ట్ర విభజన బిల్లుకి మద్దతు ఈయడం వలన తమకు ఎటువంటి రాజకీయ ప్రయోజనమూ కలుగాకపోగా తన రాజకీయ ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీని తెలంగాణాలో బలపరిచినట్లవుతుందని బీజేపీకి జ్ఞానోదయం కలగడమే ఒక కారణమయితే, బిల్లుని వ్యతిరేఖిస్తున్న తెదేపాతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవాలనే ఆలోచన మరో కారణంగా కనిపిస్తోంది. అదీగాక కాంగ్రెస్ అధిష్టానం బిల్లు ఆమోదం కొరకు ఒకవైపు తన మద్దతు కోరుతూనే మరో వైపు అదే బిల్లుతో తనను రాజకీయంగా దెబ్బతీయాలని చూడటం బీజేపీకి ఆగ్రహం కలిగిస్తోంది.
అందుకే బీజేపీ కూడా అందుకు పైఎత్తుగా సవరణలు సూచించింది. సీమాంధ్రకు ఎంత ఆర్ధిక ప్యాకేజీ ఏవిధంగా ఇవ్వబోతోందో రాష్ట్ర విభజన బిల్లులో స్పష్టంగా పేర్కొనాలని బీజేపీ డిమాండ్ చేయడమే కాకుండా తను స్వయంగా నిర్దిష్టంగా కొన్ని సూచనలు కూడా చేసింది. ఒకవేళ బీజేపీ సూచించినట్లు సీమాంధ్రకు ఇవ్వదలచిన ఆర్ధిక ప్యాకేజీ వివరాలను బిల్లులో పొందుపరిస్తే, దానిపై లోక్ సభలో చర్చించి, ఆమోదం పొందకుండా నేరుగా రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి వీలు లేదు. అందుకే కాంగ్రెస్ అధిష్టానం బీజేపీ సూచనలను, పట్టించుకోకుండా బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెట్టబోయి సరిగ్గా అదే కారణంతో రాజ్యసభ చైర్మన్ చేతిలో భంగపడింది.
ఇప్పుడు బిల్లుని లోక్ సభలో ప్రవేశపెడితే ఇంత తక్కువ వ్యవధిలో ఆర్ధిక అంశాలపై చర్చ ముగిసే అవకాశం లేదు. చర్చ జరగకుండా బిల్లు ఆమోదించడము కష్టమే. పైగా స్వయంగా సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలే సభ జరగకుండా అడ్డుపడుతున్నారు. సీమాంధ్రలో తన పార్టీని పణంగా పెట్టి కాంగ్రెస్ అధిష్టానం ఆడుతున్న ఈ రాజకీయ చదరంగంలో, ఒకవేళ బిల్లుని ఆమోదింపజేయలేకపోతే తెలంగాణా లో కూడా పూర్తిగా తుడిచిపెట్టుకు పోవడంఖాయం.
ప్రధానమంత్రి డా.మన్మోహన్ సింగ్ స్వయంగా బీజేపీ సీనియర్ నేత అద్వానీకి ఫోన్ చేసి బీజేపీ మద్దతు కోరేందుకు రేపు విందుకు రమ్మని ఆహ్వానించారు. అయితే బీజేపీ సూచిస్తున్న సవరణలను బిల్లులో చేర్చకపోతే మద్దతు ఇచ్చే అవకాశం లేదు. చేర్చితే ఈ వారం రోజులలో వివిధ ఇతర బిల్లులతో పాటు రాష్ట్ర విభజన బిల్లుపై లోక్ సభలో చర్చించి, ఆమోదించడం కష్టమే. బీజేపీ వేలుతో బీజేపీ కళ్ళు పొడవాలని కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తే, బీజేపీ కూడా సరిగ్గా కాంగ్రెస్ తన కళ్ళు తాను పొడుచుకొనేలా ఎత్తులు వేసింది.