వైయస్స్ కోసం కాంగ్రెస్, వైకాపాలు మళ్ళీ పోటీ?
posted on Jul 22, 2015 @ 5:04PM
సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్, వైకాపాల మధ్య లోపాయికారిగా ఒప్పందం కుదిరినందునే, జగన్ అక్రమాస్తుల కేసులలో ఏకంగా 11 చార్జ్ షీట్లు దాఖలు చేసిన సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మి నారాయణ హటాత్తుగా మహారాష్ట్రాకి బదిలీ అయిపోవడం, వెంటనే జగన్మోహన్ రెడ్డి జైలు నుండి విడుదలవడం జరిగిందని చాలా మంది దృడంగా నమ్ముతున్నారు. ఒకవేళ కేంద్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా ఎన్నికలలో గెలిచి ఉండి ఉంటే బహుశః ఆ రెండు పార్టీలు మళ్ళీ అంటు కట్టి ఉండేవేమో? అందుకే తెదేపా నేతలు కాంగ్రెస్, వైకాపా తల్లి పిల్లా కాంగ్రెస్ పార్టీలని అభివర్ణిస్తుంటారు.
తమ పార్టీల పట్ల ప్రజలకున్న ఈ బలమయిన నమ్మకాన్ని వమ్ము చేయడం ఇష్టంలేకనో లేక మున్ముందు అవసరాలను దృష్టిలో పెట్టుకోనో ఆ రెండు పార్టీలు ఎన్నడూ కూడా ఒకదాని జోలికి మరొకటి పోకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. అవి ప్రతిపక్షంలో ఉన్నందున ఒకదానినొకటి విమర్శించుకోకపోయినా ప్రజలు కూడా వాటిని పెద్దగా పట్టించుకోలేదు. మళ్ళీ చాలా రోజుల తరువాత వైకాపా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తోంది. కానీ దానికి కారణం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఈనెల 24వ తేదీన అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటించినప్పుడు దారిలో రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఆయన పూలమాల వేస్తారని కాంగ్రెస్ నేతలు ప్రకటించగానే కాంగ్రెస్ పార్టీపై వైకాపా విమర్శలు గుప్పిస్తోంది. జగన్ పై అక్రమాస్తుల కేసులు పెట్టి వేధించుతూ, వైయస్స్ రాజశేఖర్ రెడ్డి పేరుని యఫ్.ఐ.ఆర్.లో చేర్చి కాంగ్రెస్ పార్టీ అవమానించిందని వైకాపా అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. మరిప్పుడు రాహుల్ గాంధీ ఏ మొహం పెట్టుకొని మళ్ళీ ఆయన విగ్రహానికి పూలదండ వేస్తారని ఆమె ప్రశ్నించారు.
ఆమె ప్రశ్న ఆలోచించదగ్గదే! ఎందుకంటే వైయస్స్ నేరం చేసారని కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మినందునే ఆయన పేరును యఫ్.ఐ.ఆర్.లో చేర్చినట్లయితే, ఇప్పుడు అదే వ్యక్తి విగ్రహానికి రాహుల్ గాంధీ పూలమాల ఎందుకు వేయాలనుకొంటున్నట్లు? మళ్ళీ వైకాపాకి దగ్గరయ్యేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నమా అది? లేకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా వైకాపాలాగే రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకొని మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బ్రతికించుకోవాలనే ఆలోచన చేస్తోందా? అనే అనుమానాలు కలగడం సహజం. బహుశః అందుకే ఆమె ముందు జాగ్రత్తగా రాజశేఖర్ రెడ్డి తమ పార్టీకే స్వంతమని ప్రకటించుకొంటున్నారేమో?
రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత ఆయనపై హక్కుల కోసం ఆ రెండు పార్టీల నేతలు వాదోపవాదాలు చేసుకొన్న సందర్భాలు ఉన్నాయి. కానీ తెలంగాణా అంశంతో తెలంగాణాలో లబ్ది పొందలని కాంగ్రెస్ పార్టీ నిశ్చయించుకొన్న తరువాత ఆయనని వైకాపాకే విడిచిపెట్టేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు సైతం ఆయన పేరును వాడుకొనేందుకు జంకారు. కారణం అందరికీ తెలిసిందే. కానీ మళ్ళీ ఇన్నాళ్ళ తరువాత రాహుల్ గాంధీ ఆయన విగ్రహానికి దండ వేయాలనుకొంటే వైకాపాకి అటువంటి అనుమానాలు కలగడం సహజమే. అందుకే ఈ విషయంపై వైకాపా ఇంత చురుకుగా స్పందించినట్లుంది.