ఎన్నికల వేళ పీఓకే విలీనం మాట.. ఎన్డీయే కూటమిలో తగ్గిన ధీమాకు తార్కాణం?
posted on May 22, 2024 @ 2:45PM
సార్వత్రిక ఎన్నికలు ఇప్పటివరకూ ఐదు విడతలు పూర్తి అయ్యాయి. జూన్ 1వతేదీతో ఎన్నికలు పూర్తి అవుతాయి. మూడోసారి తమకు అధికారం రావడం గ్యారంటీ అని బీజేపీ ఘంటాపథంగా చెబుతున్నది. అయితే క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సమాచారం మేరకు తొలి ఐది విడతలలో బీజేపీ భారీగా నష్టపోతున్నది. చివరి రెండు విడతలలో కూడా ఆ పార్టీ పెద్దగా పుంజుకుంటుందన్న నమ్మకం లేదని అంటున్నారు. ఎందుకంటే చివరి రెండు విడతలలో ఎన్నికలు జరిగే లోక్ సభ నియోజకవర్గాలలో రైతుల ప్రాబల్యం అధికంగా ఉంటుంది. దీంతో బీజేపీకి ఇక్కడ పెద్దగా సీట్లు వచ్చే అవకాశం లేదని అంటున్నారు. మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా రైతుల ఆగ్రహం ప్రస్ఫుటమే.
ఈ కారణంగానే ఒక్కో విడత పోలింగ్ పూర్తి అవుతున్న కొద్దీ బీజేపీ నేతలు సమాజంలో విద్వేషాలు రగిలేలా ప్రచారంలో స్వరం మార్చారు. తాజాగా అమిత్ షా మోడీ సర్కార్ మూడో సారి అధికారంలోకి రావడం తరువాయి.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో విలీనం చేస్తామని ఒక ఎన్నికల సభలో ప్రతిన చేశారు. ఇక ఆ క్షణం నుంచీ బీజేపీ నేతలందరూ పీవోకే విలీనం అంటూ కోరస్ పాడుతున్నారు. నిజమే పీవోకేలో ఇప్పుడు పరిస్థితులు అంత సవ్యంగా లేవు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి అంటాయి.పెట్రోలు ధరలు కూడా ఐదు రెట్లు పెరిగాయి. ప్రజల నిరసనలు వెల్లువెత్తు తున్నాయి.ఇటీవల భారత్ కు అనుకూలంగా పీవోకేలో నిరసనకారులు నినాదాలు చేసినట్లు వార్తలు వచ్చాయి. పీవోకే లో కొన్ని పార్టీలు భారత్ లో విలీనం చేయాలన్న డిమాండ్ ను కూడా తెరమీదకు తీసుకుచ్చాయి.
సరిగ్గా దీనినే ఎన్నికలలో తనకు అనుకూలంగా మార్చుకుని లబ్ధి పొందాలన్న వ్యూహానికి బీజేపీ తెరతీసింది. ఈసారి తాము 400 కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకుంటామన్న ధీమా వ్యక్తం చేస్తున్న బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఊదరగొడుతూ, ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే వాస్తవంగా బీజేపీకి విజయంపై నమ్మకం ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతి ఎన్నికల ముందూ ఏదో ఒక ప్రజాకర్షక నినాదంతో ఒడ్డెక్కుతున్న బీజేపీ ఈ సారి భారత ప్రత్యేకత అయిన భిన్నత్వంలో ఏకత్వాన్ని దెబ్బతీసేందుకు కూడా వెనుకాడకపోవడం ఆ పార్టీలో నెలకొన్న ఓటమి భయమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇక ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తలైతే మూడో సారి బీజేపీ అధికారంలోకి వస్తుందని చెబుతూనే.. ఆ పార్టీ ఊదరగొడుతున్న సంఖ్య మాత్రం చేరుకునే అవకాశం ఇసుమంతైనా లేదని ఢంకా బజాయించి చెబుతున్నారు. మ్యాజిక్ ఫిగర్ ను చేరుకున్నా అధికారం చేపట్టవచ్చని గుర్తు చేస్తున్నారు. మరో వైపు అనూహ్యంగా ఈ సార్వత్రిక ఎన్నికలలో అనూహ్యంగా పుంజుకున్న ఇండియా కూటమి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి గట్టిపోటీ ఇస్తున్నది. తొలి ఐదు విడతల పోలింగ్ సరళిని బట్టి చూస్తుంటే ఎన్డీయే, ఇండియా కూటముల్లో దేనికీ పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదని అంటున్నారు. మొత్తం మీద ఎన్డీయే కూటమికి 400 ప్లస్ స్థానాలు అంటూ మోడీ అండ్ కో చేస్తున్న ప్రచారం కేవలం ఆర్భాటం మాత్రమేననీ, క్షేత్రస్థాయిలో అంత సీన్ కనిపించడం లేదనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.