ఆంధ్ర సి ఎం ఓ కాల్ సెంటర్ ను కడిగిపారేసిన కామన్ మ్యాన్!
posted on Apr 2, 2020 @ 11:18AM
* గుంటూరు కలెక్టర్ ఉపయోగించిన భాషపై అభ్యంతరం ...
* అసమర్ధ అధికారుల తీరుపై కామన్ మ్యాన్ అసహనం .....
* తండ్రి పేరుకూ, హెల్ప్ లైన్ ఫిర్యాదుకూ సంబంధమేమిటని ప్రశ్న
* కాలం చెల్లిన 'కాలమ్స్' ను తొలగించాలని సూచన
* వార్డు నెంబర్ చెపితే కానీ, ఫిర్యాదు తీసుకోలేమని చెప్పిన సి ఎం ఓ కాల్ సెంటర్
ఆంధ్ర సి ఎం ఓ కాల్ సెంటర్ ను కడిగిపారేసిన కామన్ మ్యాన్. ఏపీలో ప్రారంభమైన రేషన్ సరుకుల పంపిణీ, కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో పేద ప్రజలకు రేషన్ డీలర్ల వద్దే సరుకులు ఇవ్వడంపై మాత్రం విమర్శలు వస్తున్నాయి. వాటి గురించే ఈ కామన్ మ్యాన్ ఆంధ్ర ప్రదేశ్ సి ఎం ఓ కాల్ సెంటర్ ను ఎక్కి దిగారు. గతంలో అడక్కముందే పింఛన్లను ఇంటివద్దకే పంపిన ప్రభుత్వం ఇప్పుడు రేషన్ ను మాత్రం షాపులకు వచ్చి తీసుకోవాలనడం సరికాదని తన వాదన.
గతంలో నెలవారీ పెన్షన్ ను ఇంటివద్దే అందించాలని నిర్ణయించిన ఏపీ సర్కార్.. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో అదే వాలంటీర్లను వాడుకుని ఇంటివద్దకే రేషన్ పంపుతుందని అంతా ఆశించారు. కానీ అలా జరగలేదు. వాలంటీర్ల ద్వారా ఇళ్లకు పంపాల్సిన రేషన్ సరుకులను షాపుల వద్దే తీసుకోవాలని అధికారులు సూచించడంతో ఇవాళ పేద ప్రజలు డీలర్ల వద్ద క్యూలో కనిపించారు. అసలే కరోనా భయాలు, సామాజిక దూరం పాటించాలన్న హెచ్చరికలు, అలాగని ఇంటివద్దే ఉండిపోతే రేషన్ దొరకదేమో అన్న భయం, ఒక్క రోజులో సరుకులు దొరుకుతాయో లేదో అన్న ఆందోళన.. ఇలా అనేక భయాలతో ప్రజలు ఇవాళ రేషన్ డీలర్ షాపుల వద్దకు చేరుకుని సరుకులు తీసుకోవడం కనిపించింది.
గతంలో నెలవారీ సామాజిక పెన్షన్లను ఇంటివద్దే ఇవ్వాలని ఎవరూ కోరలేదు. ఒకటో తేదీ ఆదివారం వచ్చినా అదే రోజు ఇవ్వాలని ఎవరూ అడగలేదు. కానీ ప్రభుత్వం మాత్రం లక్షలాది వాలంటీర్లను మోహరించి ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం ఒకే రోజు రికార్డు స్దాయిలో పెన్షన్లను ఇంటివద్దకే పంపింది. కానీ ఇప్పుడు కరోనా పరిస్ధితుల్లో ప్రజలు ఇంటి నుంచి బయటికి వచ్చే పరిస్దితి లేదు. లాక్ డౌన్ కొనసాగుతోంది. తప్పనిసరైతే తప్ప బయటికి వచ్చే పరిస్దితి లేదు. అయినా వాలంటీర్లను వాడుకోకుండా ప్రజలను రేషన్ కోసం షాపుల వద్ద క్యూ కట్టాలని ప్రభుత్వం సూచించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రజలు సామాజిక దూరం పాటించడం లేదన్న కారణంతో ఉదయం షాపింగ్ సమయాలను కూడా తగ్గించిన ప్రభుత్వం, రేషన్ కోసం మధ్యాహ్నం ఒంటిగంట వరకూ వారిని రేషన్ దుకాణాల వద్ద క్యూల్లో ఉండాలనడం సరికాదనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇదే విషయాన్ని కామన్ మ్యాన్ సి ఎం ఓ కాల్ సెంటర్ కి వివరించే ప్రయత్నం చేస్తే, ఆయనకు ఎదురైనా చేదు అనుభవం ఇది. ఇంతే కాదు, కిక్కిరిసిన ప్రాంతం లోని ఒక షెడ్ లో పిల్లలకు ట్యూషన్ నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన గుంటూరు కలెక్టర్ కు విన్నవిస్తే, మీకు రూల్స్ తెలుసా అంటూ చాలా దురుసుగా కలెక్టర్ అడిగిన తీరును కూడా ఆయన వివరించారు. ఇదండీ, మొత్తానికి కరోనా కంట్రోల్ విషయం లో మన కలెక్టర్ గారి వైఖరి.