రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై మరొక సర్వే నివేదిక సిద్దం
posted on Mar 6, 2014 @ 10:08AM
రాష్ట్రం రెండుగా విడిపోతున్న ఈ తరుణంలో వస్తున్నమున్సిపల్, సార్వత్రిక ఎన్నికలు రాజకీయ పార్టీలకి పిల్లికి చెలగాటం ఎలుకకి ప్రాణ సంకటం అన్నట్లుగా తయారయ్యాయి. ఈ ఎన్నికల ఫలితాల గురించి రాజకీయ పార్టీలకే కాకుండా ప్రజలలో కూడా తీవ్ర ఉత్కంట నెలకొంది. ఇది గమనించిన మీడియా-సర్వేసంస్థలు నిత్యం ఒక కొత్త నివేదిక ప్రజల ముందు ఉంచుతున్నాయి.
అయితే ఇటీవల ఇండియా టుడే కోసం సి-ఓటర్ అనే సర్వేసంస్థ నిర్వహించిన సర్వే నివేదికలో ఎంత నిబద్దత ఉందో తెలుసుకొనేందుకు ఒక ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ చానల్ సదరు సి-ఓటర్ సంస్థకు చెందిన 11ఏజన్సీలకు డబ్బులు ఎరగా చూపితే తాము ప్రజల నుండి సేకరించిన సమాచారంలో మార్పులు చేసి నివేదిక ఫలితాలను మార్చేందుకు కూడా వారు వెనుకాడలేదని బయటపెట్టడంతో ఇండియా టుడే పత్రిక యాజమాన్యం ఆ సర్వే నివేదికను వెంటనే రద్దు చేయడమే గాకుండా, తమ ప్రతిష్టకు భంగం కలిగిన్చినందున సి-ఓటర్ సంస్థపై కోర్టులో కేసు వేయబోతున్నట్లు ప్రకటించింది. అందువలన ఇప్పుడు సర్వే నివేదికలను సైతం నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇది సర్వేలను మాత్రం ఆపలేకపోయింది, వాటి ప్రమాణాలను, నిబద్దతని ద్రువీకరించే ఎటువంటి ప్రత్యేక అధికారిక సంస్థలు లేనందున సదరు మీడియా లేదా సర్వే సంస్థకున్న పేరుని బట్టి ప్రజలు వాటి నివేదికలను విశ్వసించవలసి వస్తోంది.
తాజాగా, ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ చానల్స్-సి.యన్.యన్.; ఐ.బీ.యన్. మరియు లోక్ నీతి మరియు సీ.యస్.డీ.యస్. అనే నాలుగు సంస్థలు ఆంధ్ర, తెలంగాణాలలో సంయుక్తంగా ఒక సర్వే నిర్వహించి నివేదికలు ప్రకటించాయి. ఆ సర్వే ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైకాపాకు 11-17 లోక్ సభ సీట్లు, తేదేపాకు 10-16 రావచ్చని సమాచారం. ఇక తెలంగాణాలో కాంగ్రెస్-తెరాసలు సరిసమానంగా 6 నుండి 12 లోక్ సభ స్థానాలు కైవసం చేసుకోవచ్చని ప్రకటించింది. కానీ తెరాస అత్యధిక శాసనసభ స్థానాలు కైవసం చేసుకొంటుందని ప్రకటించింది.
ఈ ప్రకారం చూసినట్లయితే కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనతో సాధించాలనుకొన్న ప్రయోజనం నెరవేరినట్లే భావించవచ్చును. ఎందుకంటే ఆ పార్టీకి తెలంగాణాలో ఉన్న 15 లోక్ సభ స్థానాలలో తెరాసతో కలిపి కనీసం 12 స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అదేవిధంగా ఆ పార్టీకి మద్దతు ఇస్తాడన్ని భావిస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రలో కనీసం 11-17 లోక్ సభ స్థానాలు గెలుచుకొనే అవకాశం ఉంది. గనుక రెండు రాష్ట్రాలలో కలిపి కాంగ్రెస్ ఖాతాలో ఎంతలేదనుకొన్నా కనీసం 25-30 సీట్లు పడతాయి.
కానీ ఎప్పటికప్పుడు వేగంగా మారిపోతున్నరాజకీయ పరిణామాలను బట్టి ఈ అంచనాలు, సర్వే నివేదికలు, రాజకీయ పార్టీల భవిష్యత్తు అన్నీ కూడా మారుతుంటాయి గనుక మున్ముందు మరింత ఆసక్తికరంగా ఉంటాయని చెప్పవచ్చును.