ఉచిత విద్యుత్ పై పేటెంట్ ఒక్క వైఎస్సార్ కే ఉంది: సీఎం జగన్
posted on Sep 3, 2020 @ 2:12PM
సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్ భేటీలో 'ఉచిత విద్యుత్ పథకం- నగదు బదిలీ'కి రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రైతుకు అందే విద్యుత్తు ఎప్పటికీ ఉచితమేనని, ఒక్క కనెక్షన్ కూడా తొలగించబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల వల్ల రైతులపై ఒక్క పైసా కూడా భారం పడదని హామీ ఇచ్చారు. అమల్లో ఉన్న పథకాన్ని మరింత మెరుగుపరుస్తున్నామని, వచ్చే 30-35ఏళ్లపాటు ఉచిత విద్యుత్ పథకానికి ఢోకా ఉండబోదని వెల్లడించారు.
కనెక్షన్ ఉన్న రైతు పేరు మీద బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసి, ఆ ఖాతాలోకి నేరుగా నగదు జమ చేస్తామని, ఆ డబ్బునే డిస్కంలకు చెల్లించడం జరుగుతుందని, దీని వల్ల రైతుపై ఎలాంటి భారం ఉండదని స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్‌పై పేటెంట్ ఒక్క వైఎస్సార్ కే ఉంది. అందుకే పథకానికి ఆయన పేరు అని సీఎం జగన్ తెలిపారు. మొదట శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా పథకం అమలు చేస్తామని వెల్లడించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు సీఎం జగన్ పేర్కొన్నారు.
కాగా, ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంపై విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. రైతుల నుంచి కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పటిలాగా ఉంటే తమకు ఏ సమస్య ఉండదని.. కొత్తగా ఈ బిల్లులు, నగదు జమ, బిల్లు చెల్లింపులు వల్ల అనవసరపు శ్రమ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, ఒకవేళ ప్రభుత్వం నగదు జమ ఆలస్యం చేస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం.. కేంద్ర ప్రభుత్వం తెస్తున్న సంస్కరణలకు అనుగుణంగానే వ్యవసాయ విద్యుత్తు వినియోగదారులకు నగదు బదిలీ పథకాన్ని చేపట్టాల్సి వచ్చిందని చెబుతోంది.