ఫిబ్రవరి 12న కిరణ్ రాజీనామా?
posted on Feb 9, 2014 @ 7:00PM
అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా డిల్లీలో ధర్నా చేసినప్పటికీ అది ఆయన అభిప్రాయ ప్రకటనగానే భావిస్తున్నందున ఆయనపై ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోనవసరం లేదని పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ చెప్పడం ద్వారా కిరణ్ కుమార్ రెడ్డి పదవిలో కొనసాగాలనుకొంటే కొనసాగవచ్చని పరోక్షంగా సూచించారు. కానీ అదేసమయంలో, రాష్ట్ర శాసనసభ తిరస్కరించిన బిల్లునే యధాతధంగా పార్లమెంటులో ప్రకటించి, ఆయన కళ్ళను ఆయన వేలుతోనే పొడిచే ప్రయత్నం చేసింది. తామందరం కలిసి బిల్లుని ఇంత తీవ్రంగా వ్యతిరేఖించినా కూడా తమ అధిష్టానం ముందుకే సాగుతుండటంతో, పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టిన రోజు (12) నే రాజీనామా చేద్దామని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లు ఆయన సన్నిహితుడయిన లగడపాటి చెప్పారు. మరో కాంగ్రెస్ యంపీ రాయపాటి సాంబశివరావు కూడా ఈ విషయాన్ని దృవీకరించారు. కానీ, ఆ సమయంలో శాసనసభ సమావేశాలు జరుగుతుంటాయి గనుక అవి ముగిసిన తరువాతనే ఆయన గవర్నర్ ను కలిసి తన రాజీనామ పత్రం అందజేసి, శాసనసభ రద్దుకు సిఫారసు చేయవచ్చును. అయితే ఈ విషయం ముందే ఊహించి కాంగ్రెస్ అధిష్టానం ఆయన స్థానంలో వేరే ఎవరినయినా నియమిస్తుందా? లేక రాష్ట్రపతి పాలనకు మొగ్గు చూపుతుందా? అనేది తేలవలసి ఉంటుంది.
ఇంత కాలంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవికి, పార్టీకి కూడా రాజీనామా చేసి కొత్త పార్టీ స్థాపిస్తారని మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ, లగడపాటి తదితరులు ఆయన రాజీనామా చేయబోతున్నారనే వార్తలను ద్రువీకరిస్తున్న ఈసమయంలో, ముఖ్యమంత్రి సన్నిహితులయిన మంత్రులు శైలజానాథ్, గంటా శ్రీనివాసరావు ఆయన కొత్త పార్టీ స్థాపించకపోవచ్చని చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. మరో యంపీ సబ్బంహరి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ కొత్తపార్టీ గురించి చాలా ఆసక్తికరమయిన వ్యాఖ్యలు చేసారు. ఒకవేళ రాష్ట్రవిభజన జరిగితే ముఖ్యమంత్రి కొత్త పార్టీ స్థాపించవచ్చని, విభజన జరుగకపోయినట్లయితే స్థాపించకపోవచ్చని తను భావిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ కొత్త పార్టీ స్థాపించకపోతే అధిష్టానం దృష్టిలో చులకనయిఅపోయిన తరువాత కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా? కొనసాగదలిస్తే ప్రజలకు ఏమని సంజాయిషీ ఇచ్చుకొంటారు? ఏవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని కోరగలరు?