ఏపీలో రివర్స్ పాలన.. కేసీఆర్ కామెంట్లతో రచ్చ
posted on Mar 27, 2021 8:29AM
ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు మొదటి నుంచి వివాదాస్పదమే అవుతున్నాయి. జగన్ సర్కార్ తీసుకున్న చాలా నిర్ణయాలను కోర్టులు రద్దు చేశాయి. మరికొన్ని పథకాలను ప్రభుత్వమే వెనక్కి తీసుకుంది. జగన్ సర్కార్ కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా రివర్స్ టెండరింగ్ విధానం తీసుకొచ్చింది. దీనిపైనా చాలా విమర్శలు వచ్చాయి. దీంతో
ఆంధ్రప్రదేశ్ లో రివర్స్ పాలన సాగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. జగన్ రెడ్డిది రివర్స్ పాలనంటూ ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తుంటాయి. అయితే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఏపీ ప్రభుత్వంపై రివర్స్ వ్యాఖ్యలే చేశారు.
తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిన కేసీఆర్... ఏపీ పేరు ప్రస్తావించారు. గతంలో రాష్ట్ర విభజన సమయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోతుందని చాలామంది శాపాలు పెట్టారని, ఇప్పుడా శాపాలు వాళ్లకే రివర్స్ అయ్యాయని అన్నారు. ఇవాళ తెలంగాణలో ఎకరం భూమి రూ.30 లక్షలకు అమ్మి, ఏపీలో ఎకరం పదిహేను లక్షల రూపాయల చొప్పున కొంటున్నారని వివరించారు. గతంతో పోలిస్తే ఏపీలో అంతా రివర్స్ గా ఉందనే కామెంట్లు చేశారు కేసీఆర్.
ఏపీ సీఎం జగన్ కు తనకు అత్యంత సన్నిహితుడని కేసీఆర్ చెబుతుంటారు. అలాంటి కేసీఆర్.. జగన్ పాలనపై రివర్స్ కామెంట్లు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. కేసీఆర్ వ్యాఖ్యలను కోట్ చేస్తూ సీఎం జగన్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు ఏపీ టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ. "రావాలి కావాలి అని ఊదరగొట్టారు. వచ్చాక ఏంచేశారో, రాష్ట్రాన్ని ఏ స్థితికి తీసుకెళ్లారో" అంటూ వ్యాఖ్యానించారు. అక్కడ ఎకరం అమ్మి ఏపీలో రెండెకరాలు కొంటున్నారని మీ రివర్స్ పాలనపై పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి శాసనసభలో చెప్పిన మాటలు వినపడుతున్నాయా? అంటూ ప్రశ్నించారు. దేశం మొత్తం మనవైపు చూసేలా చేయడం అంటే ఇదేనా? అని జగన్ పై సెటైర్లు వేశారు దేవినేని ఉమ.