కేసీఆర్ కు క్రొకొడైల్ ఫెస్టివల్!
posted on Feb 12, 2021 @ 2:53PM
గులాబీ పార్టీలో ఎన్నికల గుబులు. వరుస ఓటమిలతో కారు పార్టీలో కలకలం. దుబ్బాకలో అధికార పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ ప్రభావం గ్రేటర్ పై స్పష్టంగా కనిపించింది. బల్డియా బరిలో గెలిచినా.. ఓడినంత పనైంది. అధికారికంగా మేయర్ పీఠం దక్కినా.. 47 మంది కార్పొరేటర్లతో బీజేపీదే అసలైన బలం. ఎంఐఎం సపోర్టుతో గ్రేటర్ పై గులాబీ జెండా ఎగరేసినా.. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకోవడానికి లేకుండా పోయింది. అధికార పార్టీని నాగార్జున సాగర్ బై పోల్ టెన్షన్ కు గురి చేస్తుంటే.. ఆ ఎన్నిక కంటే ముందే వస్తున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మరింత కలవరపాటు కలిగిస్తోంది.
రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్ పట్టభధ్రుల నియోజకవర్గంతో పాటు వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానాలకు ఎమ్మెల్సీ నగారా మోగింది. ప్రచారంలో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు జోరు మీదుంటే.. టీఆర్ఎస్ కేండిడేట్స్ ఓటర్ల నుంచి వ్యతిరేకతతో బేజారు అవుతున్నారు. ఉద్యోగులు, నిరుద్యోగులే ప్రధాన ఓటర్లు కావడం అధికారిక పార్టీకి మైనస్. పీఆర్సీ విషయంలో ఎంప్లాయిస్ ప్రభుత్వంపై ఫుల్ సీరియస్ గా ఉన్నారు. ఎన్నికలకు ముందే ఎంతో కొంత ఫిట్ మెంట్ ప్రకటించి వారిని ప్రసన్నం చేసుకుందామనుకున్న ప్రభుత్వ ఆలోచన బూమరాంగ్ లా బెడిసికొట్టింది. పీఆర్సీ పర్సెంటేజ్ పై సర్కారుపై గుర్రుగా ఉన్న ఉద్యోగులు.. ఎమ్మెల్యే ఎన్నికల్లో గులాబీ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమంటున్నాయి విపక్షాలు.
నిరుద్యోగులదీ అదే తీరు. ప్రత్యేక తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలు ఏవంటూ ఏళ్లుగా నిరుద్యోగులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఎన్నికల హామీ అయినా నిరుద్యోగ భృతి ఏదంటూ.. ఇంకెప్పుడు ఇస్తారంటూ నిలదీస్తున్నారు. సర్కారుపై ఉన్న కసిని.. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో చూపిస్తామని నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు. అందుకే కీలక సమయంలో జరుగుతున్న రెండు ఎమ్మెల్సీ ఎన్నికలతో అధికార పార్టీలో అంతులేని హైరానా. ఒకవేళ రెండిటికి రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఓడిపోతే.. ఆ ఎఫెక్ట్ నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై తప్పకుండా పడుతుంది. అందుకే హాలియా బహిరంగ సభలో .. కేసీఆర్ లో ఓటమి భయం కొట్టొచ్చినట్టు కనిపించిందని చెబుతున్నారు.
ఉప ఎన్నికల్లో ప్రచారం చేసే అలవాటు గులాబీ బాస్ కు లేదు. అది తన స్థాయి కాదనుకుంటారు. హోరాహోరీగా సాగిన దుబ్బాక బై పోల్ లోనూ కేసీఆర్ ప్రచారానికి వెళ్లలేదు. అలాంటిది.. ఇంకా నొటిషికేషనే రాలేదు.. అభ్యర్థులు ఎవరో తేలలేదు.. అంతలోనే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో సభ పెట్టడం కేసీఆర్ లోని అభద్రతా భావానికి నిదర్శనమంటున్నారు. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ లో పరువు పోయాక.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి టీఆర్ఎస్ ది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో గులాబీ పార్టీకి గెలుపు అంత సులువేమీ కాదు. బలమైన నాయకుడు జానారెడ్డిని ఢీ కొట్టడం కష్టమే. దుబ్బాక జోష్ తో బీజేపీ సైతం సాగర్ లో సత్తా చాటేందుకు సై సై అంటోంది.
దుబ్బాక, గ్రేటర్ ఎలక్షన్స్ తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీ బండి యమ వేగంగా దూసుకుపోతోంది. అటు, రేవంత్ రెడ్డి సైతం పాదయాత్రతో దుమ్మురేపుతున్నారు. ఇలాంటి రాజకీయ విపత్కర సమయంలో జరగనున్న రెండు ఎమ్మెల్సీ, ఒక అసెంబ్లీ ఎన్నికలతో గులాబీ పార్టీ బలమెంతో తేలిపోనుంది. మునసటిలా కారు జోరు మీదుందా? లేక, డొక్కు, తుక్కు కారుగా మారిందా? అనే దానిపై ఈ ఎన్నికలతో ఓ క్లారిటీ వచ్చేస్తోంది. అందుకే, కేసీఆర్ ఈ ఎలక్షన్ ను ఛాలెంజ్ గా తీసుకున్నారు. గతానికి భిన్నంగా ఉప ఎన్నికల ప్రచారంలోనూ ప్రతిపక్షాలను ఉతికి ఆరేస్తున్నారు. ఇదంతా ఆయనలోని అసహనమేనని.. ఓటమి భయమేనని అంటున్నాయి విపక్షాలు. ముందుముందు అధికార పార్టీకి ముసళ్ల పండుగే అంటున్నారు.