అప్పుడు అలా ..ఇప్పుడు ఇలా .. ఇదేంది సీఎం సారూ ..
posted on Jul 10, 2021 9:12AM
ఏమి జరుగుతోంది, కొద్ది రోజుల క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్, కరోనాను చాలా తేలిగ్గా కొట్టేసారు. రెండు గోలీలు వేసుకుంటే చాలు పక్కా లేకుండా పరుగులు తీస్తుందని, చలోక్తులు విసిరారు. అయితే, ఇంతలోనే మళ్ళీ కరోనా ముప్పు ఇంకా తొలిగి పోలేదని అంటున్నారు. థర్డ్ వేవ్ వస్తుందంటున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖను ఆదేశించారు. కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపధ్యంలో, రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, నియంత్రణ, వైద్య, ఆరోగ్య పరిస్థితులపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కొవిడ్ వైరస్ వ్యాప్తి, ఆయా జిల్లాల్లో పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. థర్డ్ వేవ్ ఎదుర్కునేందుకు అధికార యంత్రాంగం సన్నద్దత, పడకలు, మందులు, ఆక్సిజన్ లభ్యత తదితర అంశాలను సమీక్షించి సూచనలు చేశారు.
నిజమే కరోనా ముప్పు తొలిగి పోలేదు. ఇప్పట్లో తొలిగిపోయే సూచనలు కూడా కనిపించడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తికి సరైన కారణాలను ఎవరూ గుర్తించలేకపోతున్నారన్న ముఖ్యమంత్రి మాటల్లో నిజముంది. ఇంతవరకు కరోనా ఎట్టా పుట్టింది, ఎక్కడ పుట్టింది అనే విషయంలోనే స్పష్టత రాలేదు. పుట్టుక విషయంలోనే స్పష్ట్టత లేని కరోనాని కట్టడి చేయడం చిక్కుముడిగా పరిణమిస్తోందని, ప్రపంచ శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు. అందుకే, ముఖ్యమంత్రి కారణం తెలిస్తేనే నివారణకు మార్గం సుగమం అవుతుందని అన్నారు. నిజమే, ఏ వేవ్ ఎప్పుడు ఎందుకు వస్తుందో... ఏ మేరకు విస్తరిస్తుందో, ఎలా రూపాంతరం చెందుతుందో, ఇంకెన్ని రకాలుగా వేదిస్తుందో తెలియడం లేదు. ఇలాంటి పరిస్థితిలో బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారు మరింత బాధ్యతగా వ్యవహరిస్తే బాగుటుంది. ఒక్క ముఖ్యమంత్రి అనే కాదు, ఎవరైనా, ఏ పార్టీ వారైనా, ఎప్పటికప్పుడు, అప్పటి అవసరాలకు అనుగుణంగా మాట్లాడడం మంచిది కాదు. ఆయినా,కరోనా ఉదృతి కాస్త తగ్గింది, అనగానే రాష్ట్రంలో రాజకీయ జాతర్లు మొదలయ్యాయి. కరోనా ఉపద్రవాన్ని చాలా వరకు రాజకీయ నాయకులు తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగా వాడుకుంటున్నారు. ఏ పార్టీ నాయకులూ దీనికి అతీతం కాదు.
రాష్ట్రంలో ప్రస్తుతం వరుసగా పార్టీల కార్యకలాపాలు జరుగుతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు హరితహారం, వివిధ అభివృద్థి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొంటున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరవుతుండటంతో కార్యకర్తలు, అధికారులు పాల్గొనక తప్పడం లేదు. ఏ చిన్న కార్యక్రమమైనా వందల సంఖ్యలో హాజరు ఉంటోంది. ఈ సందర్భంగా మాస్‌్,లు ధరించడం మినహా ఏ ఒక్క నిబంధన పాటించడం లేదు. భౌతిక దూరం అనే నిబంధనను మరిచే పోయారు.
ఇలా భారీ ఎన్నికల సభలు రాజకీయ జాతరలు జరపడం వల్లనే, దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరించిందని, కోర్టులు సైతం చీవాట్లు పెట్టాయి.అయినా, రాజకీయుల ధోరణి మారడం లేదు. కరోనా వ్యాప్తి నిరోధ నిబంధనలు పాటిస్తూ.. నలుగురికీ చెప్పాల్సిన ప్రజాప్రతినిధలు, నేతలే వాటిని విస్మరిస్తున్నారు. అదే విధంగా ప్రజలలో కూడా వచ్చినప్పుడు చూద్దాంలే అనే ధోరణి పెరుగు తోంది. అందుకే ముఖ్యంత్రి కరోనా కట్టడి కోసం ప్రజలు ప్రభుత్వంతో కలిసి రావాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించడంతో పాటు స్వీయనియంత్రణ, కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా అనుసరించాలని పిలుపునిచ్చారు. పిలుపు అయితే ఇచ్చరు. కానీ, ఆచరింఛి చూపి ఆదర్శంగానిలిస్తే కదా,ప్రయోజనం ఉండేది. చిత్తశుద్ధి లేని శివ పూజల వలన ప్రయోజనం ఉంటుందా?