హుజూరాబాద్ లో కేసీఆర్ స్కెచ్! ఈటలకు అగ్ని పరీక్షే?
posted on May 5, 2021 @ 11:09AM
భూకబ్జా ఆరోపణలతో సీనియర్ నేత ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి తప్పించారు సీఎం కేసీఆర్. ఈటలను పదవి నుంచి అవమానకరంగా తొలగించారనే ఆరోపణలు వస్తున్నాయి. తనపై వస్తున్న భూకబ్జా ఆరోపణలు, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంపై సీరియస్ గానే స్పందించారు ఈటల రాజేందర్. పక్కా ప్లాన్ ప్రకారమే తనపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేసులు, అరెస్టులకు భయపడేది లేదన్న ఈటల.. టీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే పదవి తనకు అవసరం లేదని చెప్పారు. తన నియోజకవర్గ ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. దీంతో ఎమ్మెల్యే పదవికి రాజేందర్ రాజీనామా చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈటల రాజేందర్ రాజీనామా చేస్తే తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు జరిగే అవకాశం ఉంది. ఆయన సొంతంగానే పోటీ చేస్తారా లేక కొత్త పార్టీ పెట్టి .. ఆ పార్టీ తరపున బరిలో ఉంటారా లేక ఇప్పుడున్న పార్టీల్లోనే ఏదో ఒక దాంట్లో చేరతారా అన్నదానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈటల రాజీనామాతో జరిగే హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక మాత్రం తెలంగాణ రాజకీయాల్లో కాక రేపనుంది. అయితే ఈటలను తొలగించాలని ముందే డిసైడ్ అయిన కేసీఆర్... తర్వాత జరగబోయే పరిణామాలపైనే క్లారిటీగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈటల ఏం చేస్తారు.. ఎలా చేస్తారన్న దానిపై గులాబీ బాస్ అంచనాతో పక్కా వ్యూహాలు సిద్ధం చేశారని అంటున్నారు. ఈటల రాజీనామాతో జరగబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికపైనా కేసీఆర్ అప్పుడే ఫోకస్ చేశారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఈటలపై కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారని సమాచారం.
హుజురాబాద్ నియోజకవర్గంలో చాలా యాక్టివ్ గా ఉన్నారు పాడి కౌశిక్ రెడ్డి. ఈటల రాజేందర్ అవినీతికి పాల్పడ్డారని కూడా ఆయన పోరాటం చేస్తున్నారు. ఈటల ఆస్తులకు సంబంధించిన సమాచారమంతా కౌశిక్ రెడ్డి దగ్గర ఉందంటున్నారు. గత ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి గెలుస్తారనే ప్రచారం కూడా జరిగింది. అందుకే ఈటలకు బలమైన ప్రత్యర్థిగా కౌశిక్ రెడ్డి ఉంటారని భావిస్తున్న కేసీఆర్.. అతన్ని పార్టీలోకి తీసుకురావాలని స్థానిక నేతలను ఆదేశించినట్లు తెలిసింది. ఈ మేరకు జిల్లాకు చెందిన ఒక మంత్రి కౌశిక్ రెడ్డి తో మంతనాలు జరిపినట్లు సమాచారం.
నియోజక వర్గంలో ఈటెలను డీ కొట్టాలంటే కౌశిక్ రెడ్డి తప్ప మరో మార్గం లేదని కెసిఆర్ కు సదరు మంత్రి తెలిపినట్లు సమాచారం. దీంతో కౌశిక్ రెడ్డి ని పార్టీ లోకి చేర్చుకునేందుకు సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. ఈటెల తేరుకుని పార్టీ కి నష్టం చేసే లోపే ఇంఛార్జి ని నియమించి క్యాడర్ ను కాపాడుకోవాలని భావిస్తూ పావులు కదుపుతున్నారు.నియోజకవర్గంలో ఈటెలకు సన్నిహితంగా ఉన్న నేతలతోనూ టీఆర్ఎస్ పెద్దలు మాట్లాడుతున్నారని అంటున్నారు. బీసీ నేతలు రాజేందర్ తో వెళ్లకుండా చూసేందుకు బీసీ సంఘం నాయకుడు వకుళాభరణం కృష్ణ మోహనరావు ను రంగం లోకి దించారని చెబుతున్నారు. కేసీఆర్ డైరెక్షన్ లోనే ఈటెల కు వ్యతిరేకంగా టీవీ డిబేట్లలో వకుళాభరం మాట్లాడుతున్నారని అంటున్నారు.
మరోవైపు టీఆర్ఎస్ అధిష్టానం ఈటల విషయంలో తీసు కుంటున్న చర్యలను జాగ్రత్తగా పరిశీలిస్తున్న ఇతర పార్టీల నేతలు ఆయనతో టచ్ లో ఉన్నారని తెలుస్తోంది . కాంగ్రెస్ నుండి బట్టి, రేవంత్ రెడ్డి, దాసోజు శ్రవణ్ కుమార్, బీజేపీ నుండి ఎంపీ అరవింద్, ఆయనను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు ఈటల సన్నిహిత వర్గాలు చెపుతున్నాయి . తాను తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి తన తో కలిసి వచ్చేవారెవరు ? టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటామని పక్కకు తప్పుకునే వారెవరు ? అనే అంశంపై ఈటల సుదీర్ఘంగా చర్చిస్తున్నట్టు తెలిసింది. కెసిఆర్ వ్యూ హం ఫలించి కౌశిక్ తెరాస తీర్థం పుచ్చుకుంటే నియోజక వర్గ రాజకీయాలు రసవత్తరం అవుతాయని భావిస్తున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం తమ నాయకుడు కౌశిక్ పార్టీ వీడడని చెబుతున్నారు