అమరావతిపై అదే స్టాండ్.. మూడు రాజధానులకే జగన్‌రెడ్డి జై..!
posted on Nov 22, 2021 @ 2:22PM
తేలిపోయింది. మేకవన్నె పులి ఎవరో తెలిసిపోయింది. సదుద్దేశమేమీ లేదు. అదే ఉద్దేశ్యం. అమరావతిపై ప్రేమ ఏమాత్రం లేదు. అదే ధ్వేషం. మూడు రాజధానులపై వెనకడుగేమీ లేదు. మరింత దూకుడుగా దాడి చేసేందుకే.. వెనక్కి తగ్గి ముందుకు దూసుకొస్తామని సీఎం జగన్‌రెడ్డి తేల్చేశారు. అసెంబ్లీ వేదికగా వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పారు.
జగన్‌రెడ్డి క్లియర్‌గా చెప్పేశారు. చట్టపరంగా, న్యాయపరంగా చిక్కులు తొలగించుకునేందుకు.. వికేంద్రీకరణపై మరింత సమగ్ర సమాచారాన్ని పొందుపరిచేందుకు.. ప్రజలకు మూడు రాజధానుల అవసరాన్ని మరింత వివరంగా చెప్పేందుకు.. బిల్లును మరింత పటిష్టం చేసేందుకు.. అవసరమైతే మరిన్ని మార్పులు చేసేందుకు.. మాత్రమే మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నామని సీఎం జగన్ ప్రకటించారు.
మళ్లీ... పూర్తి, సమగ్రమైన, మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తామని జగన్‌రెడ్డి స్పష్టం చేశారు. విస్తృత, విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
మళ్లీ పాత చరిత్రంతా తవ్వుకొచ్చారు. అరిగిపోయిన క్యాసెట్ మళ్లీ వేశారు. ఆంధ్ర ప్రాంతం తమిళనాడుతో కలిసున్నప్పటి నుంచీ పాత చింతకాయ పచ్చడంతా చెప్పుకొచ్చారు. తెలంగాణ ఉద్యమం, హైదరాబాద్ మహా నగరం, వెనకబడిన ఉత్తరాంధ్ర, శ్రీబాగ్ ఒప్పందం, శ్రీకృష్ణ కమిషన్, శివరామకృష్ణన్ కమిటీ.. ఇలా అదిచెప్పి, ఇదిచెప్పి.. అటుతిప్పి ఇటుతిప్పి.. హైదరాబాద్‌ను బూచిగా చూపించి.. వికేంద్రీకరణ కోసమే అమరావతి వద్దంటూ.. అన్ని ప్రాంతాల కోసమే మూడు రాజధానులంటూ.. చెప్పిందే చెప్పుకొచ్చారు. చివరాఖరికి చెప్పాల్సింది చెప్పారు. వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నట్టు.. మరింత బలమైన బిల్లు తీసుకొస్తామని ప్రకటించారు.