సింగపూర్ లో పీఏపీ విజయం, టీడీపీ హ్యాపీ
posted on Sep 12, 2015 @ 12:15PM
సింగపూర్ సాధారణ ఎన్నికల్లో పీపుల్స్ యాక్షన్ పార్టీ మళ్లీ ఘనవిజయం సాధించింది. 1965 నుంచి 50ఏళ్లుగా ఏకచత్రాధిపత్యంగా సింగపూర్ ను ఏలుతున్న పీఏపీ...మరోసారి తన అధికారాన్ని నిలబెట్టుకుంది.ప్రధాని లూంగ్ ఆధ్వర్యంలో మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించిన పీపుల్స్ యాక్షన్ పార్టీ...89 సీట్లకు గానూ, 60 స్థానాలను కైవసం చేసుకుంది. ఈసారైనా పీఏపీను ఓడించాలనుకున్న ప్రతిపక్షం కలలు మాత్రం కలలుగానే మిగిలిపోయాయి. అయితే సింగపూర్ లో అధికార పార్టీ గెలిస్తే, ఆంధ్రప్రదేశ్ కి లింకేంటి అనుకుంటున్నారా?, నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం...మళ్లీ అక్కడ లూంగ్ సర్కారే రావడంతో ఊపిరిపీల్చుకుంది. పాత ప్రభుత్వమే మళ్లీ పవర్ లోకి రావడం వల్ల...ఏపీ రాజధాని నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులూ రావని భావిస్తున్నారు, అందుకే సింగపూర్ లో అధికార పార్టీ ఘనవిజయం సాధించడంతో, ఇక్కడ టీడీపీ శ్రేణులు కూడా సంతోషం వ్యక్తంచేస్తున్నారు.మరోవైపు ఆంధ్రప్రదేశ్ తో కలిసి పనిచేస్తామంటూ సీఎం చంద్రబాబుకు సింగపూర్ ప్రధాని లూంగ్ లేఖ రాయడం...తెలుగుదేశం పార్టీకి సంతోషాన్నిచ్చింది.