తీరప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించండి : సీఎం చంద్రబాబు

 

మొంథా తుఫాన్ ముప్పు ఉన్న తీరప్రాంత ప్రజలను తక్షణం పునరావాస కేంద్రాలకు తరలించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం నుంచి తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండటంతో ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పారు. పునరావాస కేంద్రాల్లో నాణ్యమైన ఆహారాన్ని అందించడంతో పాటు, మెడికల్ క్యాంపులు నిర్వహించాలని సూచించారు. పునరావాస కేంద్రాలకు ప్రత్యేకంగా ఇన్‌ఛార్జ్‌లను నియమించాలని ఆదేశించారు. 

సోమవారం ఉదయం సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి మొంథా తుఫాన్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి, మధ్యాహ్నం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో టెలీకాన్ఫరెన్స్ చేపట్టారు. తాగునీటి సమస్య తలెత్తకుండా, ఎక్కడా కలుషితం కాకుండా చూసుకోవాలని చెప్పిన సీఎం అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. 

తుఫాను ప్రభావిత జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని స్పష్టం చేశారు. ఎక్కడా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకుండా అధికారులు బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు నిర్దేశించారు. జిల్లాల్లో తుఫాను రక్షణ చర్యలను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని, వాలంటరీగా వచ్చేవారిని తుఫాన్ సహాయక కార్యక్రమాలకు వినియోగించుకోవాలని చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగమంతా నిబద్ధతతో పనిచేసి మొంథా తుఫాన్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోవాలని అన్నారు. 

కొండచరియలు జారిపడకుండా జాగ్రత్తలు

మానవ ప్రయత్నంలో ఎటువంటి అలసత్వం కనిపించకూడదని చెప్పిన ముఖ్యమంత్రి... వివిధ జిల్లాల కలెక్టర్లతో అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయని... అన్ని రక్షణ చర్యలు తీసుకున్నామని ఆ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సీఎంకు వివరించారు. ఆర్టీజీఎస్ నుంచి సమాచారం ఎప్పటికప్పుడు అందుతుందని... ఎక్కడా చెరువులు, కాలువ గట్లు తెగకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. 

భారీ వర్షాలతో నీరు ఎక్కడా నిలిచిపోకుండా డ్రైనేజీ వ్యవస్థను పర్యవేక్షించాలన్నారు. తుఫాను సమయంలో ప్రజలు ఎవరూ బయటకు రాకుండా చూసుకోవాలని చెప్పారు. విజయవాడ, మంగళగిరి, విశాఖ వంటి కొండ ప్రాంతాల్లో కొండచరియలు జారిపడి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. మొంథా తుఫాన్ కార్యాచరణ భవిష్యత్‌లో వచ్చే తుఫాన్లను ఎదుర్కొనేందుకు ఒక మోడల్ కావాలని సీఎం చంద్రబాబు తెలిపారు
 

కల్తీ మద్యం కేసులో జోగి రమేష్‌ సోదరులకు దక్కని ఊరట

  ఏపీ నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత జోగి రమేష్‌ సోదరులకు విజయవాడ ఎక్సైజ్ కోర్టులో ఊరట దక్కలేదు. ఏ2 జగన్‌మోహన్‌రావు, ఏ18 జోగి రమేశ్‌, ఏ19 జోగి రాము బెయిల్‌ పిటిషన్లను విజయవాడలోని ఎక్సైజ్‌ కోర్టు తిరస్కరించింది. కొంతమంది నిందితులకు బెయిల్‌ మంజూరు చేసింది. నేటితో రిమాండ్‌ ముగియనుండటంతో జోగి రమేశ్‌, జోగి రాము సహా 13 మంది నిందితులను అధికారులు న్యాయస్థానంలో హాజరు పర్చారు.   ఈనెల 31 వరకు నిందితులకు న్యాయస్థానం రిమాండ్‌ పొడిగించింది. నకిలీ మ‌ద్యం కేసులో తంబ‌ళ్ల‌ప‌ల్లె టీడీపీ ఇన్‌చార్జ్ జ‌య‌చంద్రారెడ్డి, ఆయ‌న పీఏ, అలాగే అదే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన టీడీపీ నాయ‌కుడు సురేంద్ర‌నాయుడి ప్ర‌మేయాన్ని ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. దీంతో తంబ‌ళ్ల‌ప‌ల్లె ఇన్‌చార్జ్‌గా జ‌య‌చంద్రారెడ్డి, సురేంద్ర‌నాయుడిని టీడీపీ పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు. ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడైన జ‌గ‌న్మోహ‌న్‌రావుతో పాటు మ‌రికొంద‌రిని అరెస్ట్ చేశారు. 

శిశువుల విక్రయ ముఠా అరెస్టు

బెజవాడలో  ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చిన పసిపిల్లలను బెజవాడలో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.  ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి నెలల వయస్సు చిన్నారులను తీసుకువచ్చి ఈ ముఠా విజయవాడ కేంద్రంగా విక్రయాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా ఒక్కో శిశువునూ మూడున్నర నుంచి ఐదులక్షల రూపాయలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠాకు చెందిన ఆరుగురు మహిళలు, ఏడుగురు పురుషులను  ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న ఐదుగురు శిశువులను ఐసీడీఎస్‌కు తరచి ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

నీరో చక్రవర్తిలా ఎఫ్బీఐ డైరెక్టర్

అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో గతవారం కాల్పుల ఘటన చోటుచేసుకోగా.. ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. కాల్పులకు తెగబడిన నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి పాడ్‌కాస్ట్‌లో పాల్గొనడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అతడిని రోమ్ నగరం కాలిపోతుంటే ఫిడేల్ వాయిస్తూ కూర్చున్న నీరో చక్రవర్తితో పోలుస్తూ చట్టసభ సభ్యులు, ఎఫ్బీఐ మాజీ ఏజెంట్లు దుమ్మెత్తి పోస్తున్నారు. దేశం జరిగిన ఘోరంపై పోరాడుతుంటే, వ్యక్తిగత బలహీనతలకు ప్రాధాన్యత ఇస్తూ ఎఫ్బీఐ డైరెక్టర్ బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్‌పై గతంలోనూ వనరుల దుర్వినియోగం సహా పలు ఆరోపణలు ఉన్నాయి.    ఇటీవల బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పుల ఘటన చోటుచేసుకోగా.. నిందితుడి కోసం దేశవ్యాప్తంగా గాలింపు కొనసాగుతోంది. ఈ క్రమంలో కాష్ పటేల్  తన గర్ల్‌ఫ్రెండ్ అలెక్సిస్ విల్కిన్స్‌తో కలిసి ఒక పాడ్‌కాస్ట్‌‌కు కాష్ హాజరుకావడంపై  తీవ్ర చర్చ జరుగుతోంది.  వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ..  అత్యవసర బాధ్యతలను కాష్ పటేల్ విస్మరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాష్ పటేల్, తన ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్‌తో కలిసి కన్జర్వేటివ్ పాడ్‌కాస్టర్ కేటీ మిల్లర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. బ్రౌన్స్ యూనివర్సిటీలో కాల్పులకు పాల్పడిన దుండగుడి కోసం స్థానిక పోలీసులు గాలిస్తున్న సమయంలో ఆయన పాడ్‌కాస్టర్‌లో పాల్గొనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశం తీవ్రమైన నేరంతో పోరాడుతుంటే ఆయనకు విలాసాలకు సమయం దొరికిందా? అని దుమ్మెత్తిపోస్తున్నారు. తన గర్ల్‌ఫ్రెండ్ కోసం గతంలో కూడా పటేల్ ఎఫ్‌బీఐ వనరులను దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. విల్కిన్స్ ప్రదర్శనలకు ఎఫ్‌బీఐ విమానంలో వెళ్లడం, ఆమెకు ఎఫ్బీఐ రక్షణ కల్పించడం, మత్తులో ఉన్న ఆమె స్నేహితుడిని   ఇంటికి  తీసుకెళ్లాలని ఏజెంట్లను ఆదేశించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలను అప్పట్లో కాష్ పటేల్ ఖండించినప్పటికీ, బ్రౌన్ షూటింగ్ దర్యాప్తు సమయంలో ప్రియురాలితో చెట్టపట్టాలేసుకుని తిరగడంతో అవి  మళ్లీ తెరపైకి వచ్చాయి. కేటీ మిల్లర్ విడుదల చేసిన టీజర్‌లో పటేల్, విల్కిన్స్ నవ్వుతూ తమ సంబంధం గురించి బహిరంగంగా మాట్లాడుకున్నారు. ఈ క్లిప్ వైరల్ అవ్వడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పాడ్‌కాస్ట్‌లో విల్కిన్స్ తనపై వచ్చిన ‘మొసాద్ హనీపాట్’ ఆరోపణలను ఖండించారు. తాను యూదు, ఇజ్రాయెల్‌కు చెందినదాన్ని కాదని ఆమె స్పష్టం చేశారు. ఈ ఆరోపణలు తన భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని పేర్కొంటూ  లీగల్ కన్సల్టెంట్ సాయంతో ఆమె దావా వేశారు. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ ఈ క్లిప్‌ను రీపోస్ట్ చేస్తూ.. బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పులకు తెగబడిన దుండగుడు ఇంకా స్వేచ్ఛగా తప్పించుకుని తిరుగుతుంటే.. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌కు తన గర్ల్‌ఫ్రెండ్‌తో తిరగడానికి, పాడ్‌కాస్ట్‌లో పాల్గొనడానికి ప్రజలు చెల్లించే పన్నులతో నడిచే ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించడానికి సమయం దొరికిందని విమర్శించారు. ఎఫ్‌బీఐ మాజీ  ఏజెంట్ కైల్ సెరాఫిన్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ.. మనం ఏ కాలంలో జీవిస్తున్నాం? ఇలాంటి వాళ్లను ఏం చేయాలని ప్రశ్నించారు. కాగా, బ్రౌన్ యూనివర్సిటీ కాల్పుల కేసులో అనుమానితుడి కొత్త ఫోటోలను ఎఫ్‌బీఐ విడుదల చేసింది. దుండగుడిని పట్టుకోవడానికి సమాచారం అందించిన వారికి 50,000 డాలర్లు రివార్డు ప్రకటించింది.

నాంపల్లి కోర్టుకు బాంబు బెదరింపు

హైదరాబాద్  నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది.  కోర్టు భవనంలో బాంబు అమ ర్చామనీ,  మధ్యాహ్నం 2 గంటలకు పేలిపోతుందంటూ గుర్తు తెలియని వ్యక్తి  నుంచి ఈమెయిల్ రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు.  వెంటనే కోర్టు వద్దకు చేరుకున్న పోలీసులు భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. అలాగే న్యాయమూర్తులు సహా  కోర్టులో ఉన్న న్యాయవాదులు, సిబ్బంది, ప్రజలను బయటకు పంపించి, కోర్టు భవనాన్ని, ప్రాంగణాన్ని  పూర్తిగా ఖాళీ చేయించారు.   బాంబు బెదరింపుతో కోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్త వతావారణం నెలకొంది.  బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగి కోర్టు లోపలా, వెలుపలా కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.  కొర్టులోని ప్రతి గది, కారిడార్, కోర్ట్ హాల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పద వస్తువుల కోసం ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.అకస్మాత్తుగా కోర్టు ఖాళీ చేయడంతో న్యాయవాదులు, కేసుల కోసం వచ్చిన జనం భయాందోళనలకు గుర య్యారు.   కోర్టు పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేసి, తనిఖీలు పూర్తయ్యే వరకు ఎవరినీ లోపలికి అనుమతించ లేదు. అదే సమయంలో ఈ బాంబు బెదిరింపు నిజమా లేక తప్పుడు సమాచారమా అన్న కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. అదే విధంగా  ఈమెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ విభాగం రంగంలోకి దిగింది. 

చంద్రబాబు రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని ప్రతిష్ఘాత్మక అవార్డు వరించింది. ప్రముఖ దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ ఏటా ప్రదానం చేసే  బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం ఈ సారి చంద్రబాబుకు దక్కింది.  ఆంధ్రప్రదేశ్ లో ఆయన అమలు చేస్తున్న  వ్యాపార అనుకూల విధానాలు, పారిశ్రామిక సంస్కరణలు,  అలాగే పెట్టుబడుల ఆకర్షణకు గానూ ఆయనకీ అవార్డు ప్రదానం చేస్తున్నట్లు ఎకనామిక్ టైమ్స్ గురువారం (డిసెంబర్ 18) ప్రకటించింది.   వచ్చే ఏడాది మార్చిలో  నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా చంద్రబాబు ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.  రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన 18 నెలల స్వల్ప కాలంలోనే రాష్ట్రానికి 10.7 లక్షల కోట్ల రూపాయల భారీ పెట్టుబడులను ఆకర్షించి, రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి బాటలు వేసిన చంద్రబాబును ఎకనామిక్ టైమ్స్ ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. ఈ అవార్డుకు చంద్రబాబును  దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, న్యాయవేత్తలతో కూడిన అత్యున్నత స్థాయి జ్యూరీ ఎంపిక చేసింది. ఈ జ్యూరీలో భర్తీ గ్రూప్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్,  జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్, నారాయణ హెల్త్ వ్యవస్థాపకుడు డాక్టర్ దేవిశెట్టి, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా వంటి ప్రముఖులు   ఉన్నారు. జ్యూరీకి డెలాయిట్ సంస్థ సలహాదారుగా వ్యవహరిస్తోంది. ఈ అవార్డును గతంలో కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్, ఎస్. జైశంకర్ , నిర్మలా సీతారామన్, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవిస్, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ, పీయూష్ గోయల్ వంటి వారు అందుకున్నారు. ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడంపై ప్రముఖులు, మంత్రి వర్గ సహచరులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.

కింజరాపు రామ్మోహన్ నాయుడికి మోడీ, చంద్రబాబు బర్త్ డే విషెస్

కేంద్ర మంత్రి, శ్రీకాకుళం ఎంపీ, తెలుగుదేశం సీనియర్ నాయకుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ, ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు కేంద్ర మంత్రులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా రామ్మోహన్ నాయుడికి బర్త్ డే విషెస్ తెలుపుతూ..    పౌర విమానయాన రంగంలో సంస్కరణల కోసం రామ్మోహన్ నాయుడు విస్తృతంగా కృషి చేస్తున్నారంటూ  ప్రశంసల వర్షం కురిపించారు.  రామ్మోహన్ నాయుడు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.   రామ్మోహన్ నాయుడికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రిగా ఆయన ఏపీలో విమానయానరంగం అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నారని కొనియాడారు. రామ్మోహన్ నాయుడు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.  కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా రామ్మోహన్ నాయుడు సంపూర్ణ ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  కాగా ఏపీ మంత్రి నారా లోకేశ్‌ రామ్మోహన్ నాయుడికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రియ సోదరుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు అని ట్వీట్ చేస్తూ రామ్మోహన్ నాయుడి నిబద్ధత, పనితీరును దగ్గర నుంచి చూశాననీ,  భారత విమానయాన రంగాన్ని తీర్చిదిద్దుతున్న తీరు అద్భుతమనీ పేర్కొన్నారు.  

ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోలు మృతి

ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మావోయిస్టుల లొంగుబాట్లు, ఎన్ కౌంటర్లూ కొనసాగుతున్నాయి. తాజాగా గురువారం (డిసెంబర్ 18) తెల్లవారు జామున ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. మరణించిన మావోయిస్టులను గుర్తించాల్సి ఉంది. ఛత్తీస్ గఢ్ సుక్మా జిల్లా గొల్లపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టు కదలికలకు సంబంధించిన విశ్వసనీయ సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టాయి. అటవీ ప్రాంతంలోని పల్లెపల్లెనూ జల్లెడపట్టారు. ఈ క్రమంలో ఎదురుపడ్డ నక్సలైట్లు పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు జరిపిన ఎదురు కాల్పులలో ముగ్గురు మరణించారు. కూంబింగ్ ఇంకా కొనసాగుతోందని పోలీసు వర్గాలు తెలిపాయి.  

తన విగ్రహాన్ని తానే ఆవిష్కరించనున్న రైతు బిడ్డ

ఉన్న ఊరు కన్న తల్లి అంటారు. అందులోనూ రైతుకు అయితే ఉన్న ఊరే కాదు.. తాను సాగు చేసే భూమి కన్నతల్లి కంటే ఎక్కువే. రైతుకు భూమితో ఉన్న అనుబంధాన్ని పోల్చడానికి ఏ బంధమూ సరిపోదు.  రైతు బిడ్డ ఏ దేశమేగిగా, ఎందు కాలిడినా సొంత గడ్డ, తాను సాగు చేసిన పొలం మీదే ధ్యాస ఉంటుంది. ఎక్కడా ఇమడ లేడు. ఎప్పుడెప్పుడు వచ్చి సొంత ఊర్లో, సొంత భూమిలో సాగు చేసుకుందామా అని తహతహలాడుతుంటాడు. అదిగో అచ్చం అలాంటి పదహారణాల రైతు ఉదంతమిది. భూమితో ఉన్న అనుబంధానికి తార్కానంగా తన సొంత భూమిలో తాను బతికుండగానే తన విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. వివరాల్లోకి వెడితే.. కళ్లెం నరసింహారెడ్డి పదహారణాల రైతు. ప్రస్తుతం ఆయన వయస్సు 89 ఏళ్లు.  ఈ వయసులోనూ వ్యవసాయం మీద మమకారం పోలేదు. భూమిపై అనురక్తి తగ్గలేదు. సొంత ఊరు, దేశం వదిలి మూడు దశాబ్దాల పాటు అమెరికాలో ఉన్నా.. ఆయన వ్యాపకం వ్యవసాయమే.  అమెరికాలో ఐదువేల ఎకరాలు లీజుకు తీసుకుని రకరకాల పంటలు సాగు చేసి రికార్డు సృష్టించారు. అమెరికా ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ నుంచి  ఉత్తమ రైతు అవార్డు  కూడా అందుకున్నారు. అయితే మాతృభూమిపై మమకారం తీరలేదు. అందుకే స్వదేశానికి, అందులోనూ సొంతగడ్డ తెలంగాణకు వచ్చేశారు.  చిలుకూరు సమీ పంలో తన పేరుమీద అంటే కళ్లెం నర్సింహా రెడ్డి పేరుతో వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసుకున్నారు.  ఎన్నో సాగు పద్దతులతో  పేరు గడించిన కళ్లెం ఇప్పుడు తన సొంత ఫామ్ లో మొక్కలు...చెట్లు పెంచిప్రకృతి లోనే జీవితం గడుపుతున్నారు. నిత్యం తన వ్యవసాయ క్షేత్రంలో కలియదిరగందే, ఆయనకు రోజు గడవదు, నిద్రపట్టదు. తొమ్మది పదులకు చేరువ అవుతున్న ఈ వయస్సులోనూ ఆయన పనులు ఆయనే చేసుకుంటారు.   తెలంగాణ పల్లె నుంచి అమెరికా దాకా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న కళ్లెం నర్సింహా రెడ్డి ఇప్పుడు నేల తల్లితో తన మమకారాన్ని వినూత్నంగా చాటి వార్తల్లోకి ఎక్కారు. ఇంతకీ ఆయన ఏం చేశారంటే.. తన వ్యవసాయ క్షేత్రంలో తన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరణించిన తన భార్య విగ్రహం పక్కనే తన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకుని మరణించిన తరువాత తాను తన భూమాతతో అనుబంధం కొనసాగుతుందని చాటారు.   తన భార్య ప్రథమ వర్ధంతి సందర్భంగా శుక్రవారం (డిసెంబర్ 19)న ఈ విగ్రహాలను ఆవిష్కరిం చనున్నారు. అంతే కాకుండా భార్య మరణానంతరం కూడా ఆమెకు తోడుగా తాను ఉన్నానని కూడా ఈ విగ్రహాల ఏర్నాటు చేసినట్లు ఆయన చెబుతారు. ఈ విగ్రహాలను కళ్లెం నరసింహారెడ్డి స్వయంగా శుక్రవారం (డిసెంబర్ 19) ఆవిష్కరించనున్నారు.  ఆమె  ఓంటరిగా ఉండొద్దు అనే ఉద్దేశంతో తన విగ్రహాన్ని కూడా పక్కనే పెట్టుకుంటున్నారు. ఈ విగ్రహాలు స్వయంగా ఆయనే ఆవిష్కరిస్తారు.

వల్లభనేని వంశీ.. వెంటాడుతున్న గత పాపాలు.. తాజాగా మరో కేసు

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని కేసులు వదలడం లేదు. ఇప్పటికే ఆయనపై దాడి, దౌర్జన్యం, భూ కబ్జా ఇలా పలు కేసులు నమోదై ఉన్నాయి. గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి బెదరించిన కేసులో జైలుకు వెళ్లి బెయిలుపై బయటకు వచ్చారు.   వల్లభనేని వంశీ దాదాపు 140 రోజులు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పటికే వంశీ  మొత్తం 11 కేసులలో నిందితుడిగా ఉన్నారు.   ఈ నేపథ్యంలో ఆయనపై తాజాగా మరో కేసు నమోదైంది. విజయవాడ మాచవరం పోలీసు స్టేషన్ లో ఈ కేసు నమోదైంది. వంశీ తన అనుచరులతో కలిసి తనపై గత ఏడాది జులైలో దాడికి పాల్పడ్డారంటూ సునీల్ అను వ్యక్తి ఫిర్యాదు మేరకు వల్లభనేని వంశీపై తాజాగా మాచవరం పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది.    జగన్ హయాంలో   దాడులు, దౌర్జన్యాల, కబ్జాలు, అనుచిత వ్యాఖ్యలతో దూషణలతో చెలరేగిపోయిన వల్లభనేని వంశీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సైలెంటైపోయారు. కేసుల భయంతో వణికిపోయి దాదాపుగా అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టేందుకు కూడా జంకుతున్న పరిస్థితి.  గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంకా వైసీపీలో ఉన్నారా? అసలు రాజకీయాలలో ఉన్నారా? అంటూ వైసీపీ శ్రేణులే సందిగ్ధంలో ఉన్న పరిస్థితి.  కోర్టు ఆదేశాల మేరకు వల్లభనేని వంశీ గన్నవరం సమీపంలోనే నివాసం ఉంటున్నా  వైసీపీ నేతలను, కార్యకర్తలను కలవడం లేదు. వారిని కనీసం తన ఇంటి ఛాయలకు కూడా రానీయడం లేదంటున్నారు.  కానీ ఇదే వంశీ.. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం కబ్జాలు, దాడులు, దౌర్జన్యాలతో చెలరేగిపోయారు. తెలుగుదేశం అగ్రనాయకులు, వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయారు.  ఇప్పుడు సైలెంటైపోయినంత మాత్రాన కర్మ వదులుతుందా?  అంటే వదలదని ఆయనపై నమోదైన కేసులు చెబుతున్నాయి. తాజాగా  వంశీపై మరో కేసు నమోదైంది.   

అనాధ బాలల నైపుణ్యాభివృద్దికి సహకారం : ఎంఈఐఎల్ ఫౌండేషన్

  అనాధ బాలల్లో నైపుణ్యాభివృద్దితో పాటు, ఎం ఎన్ జె కాన్సర్ ఆసుపత్రి  అభివృద్దికి సంపూర్ణ సహకారం అందిస్తామని మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్ ) డైరెక్టర్ సుధా రెడ్డి అన్నారు. తమ సంస్థ పది సంవత్సరాల నుంచి యువతలో నైపుణ్యాలను పెంచి వారు సొంత కాళ్లపై నిలబడేలా శిక్షణనిస్తున్నదని,  అనాధ బాలలు కూడా అలా తమ కాళ్లపై తాము  నిలబడేలా చర్యలు తీసుకుంటామన్నారు.  నిమ్స్ ఆసుపత్రిలో  క్యాన్సర్ బ్లాక్ ను ఎలా అయితే అభివృద్ధి చేసామో అలానే ఎం ఎన్ జె క్యాన్సర్ ఆసుపత్రిని కూడా అభివృద్ధి చేస్తామని అన్నారు.   ముందుగా ఇక్కడి వైద్యులతో మాట్లాడి ఏమి అవసరమో తెలుసుకుని  ఆ అవసరాలను తీరుస్తామన్నారు. ఎం ఈ ఐ ఎల్, ఎస్ ఆర్ ఫౌండేషన్ ల ఆధ్వర్యంలో   బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో అనాధలకు చలి నుంచి రక్షణ పొందేందుకు ఉన్ని  బ్లాంకెట్లను పంపిణీ చేశారు. ఎమ్ ఎన్ జె కాన్సర్ ఆసుపత్రిలో చిన్న పిల్లలకు బ్లాంకెట్స్, పండ్లు,   , మూసాపేటలోని సాయి  సేవా సంఘ్ లో  విద్యను అభ్యసించే వారికి  బ్లాంకెట్స్ ను సుధా రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో, ఆ తరువాత విలేకరులతో సుధా రెడ్డి మాట్లాడారు.  నగరంలోని సాయి సేవా సంఘ్   విద్యా మందిర్ లో   ఆనాధలు, తల్లి లేదా తండ్రిని కోల్పోయిన వారు విద్యనభ్యసిస్తున్నారు. వారు పదో తరగతి లేదా ఆ  పై చదువుల తరువాత  తమ కాళ్లపై తాము నిలబడి స్వశక్తితో జీవించేందుకు తమ సంస్థ సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు.   ఈ సంస్థ కొన్ని వృత్తి విద్యా కోర్సులు నిర్వహిస్తోందని, వాటికి అదనంగా తమ సంస్థ తరపున అదనపు  కోర్సులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు.  చిన్న పిల్లలతో గడపడం వల్ల వచ్చే సంతోషం వేరే కార్యక్రమాల వల్ల తనకు రాదన్నారు. అందుకే తాను చిన్న పిల్లల కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు.  తనకు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ స్ఫూర్తి అని అన్నారు. తానూ చిన్నగా ఉన్నపుడు కొన్ని అంశాలను ఆమె ద్వారా  స్ఫూర్తిగా తీసుకుని నిర్ణయాలు తీసుకున్నానని అన్నారు.  చిన్నపుడు తీసుకునే సరైన నిర్ణయాలు అందరి జీవితాలను ఒక మలుపు తిప్పుతాయని, అందువల్లే ప్రతి ఒక్కరు చిన్న వయస్సులో సరైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు.   ప్రస్తుతం ప్రతి ఒక్కరు చలికాలంలో ఇబ్బందులు పడుతున్నారని, ఆ ఇబ్బందుల నుంచి బైట పడేసేందుకు తమ  ఫౌండేషన్ల తరఫున సాయం చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం తెలంగాణాలో ఈ కార్యక్రమం ప్రారంభమైందని, దీన్ని విస్తరిస్తామని తెలిపారు   చలికాలంలో  అంటువ్యాధులు, జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యతను ఇవ్వాలని అన్నారు.  ఎం ఎన్ జె క్యాన్సర్ ఆసుపత్రిలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను ముద్దాడిన సుధా రెడ్డి వారికి  బ్లాంకెట్స్,   పండ్లు పంపిణీ చేశారు. తాము అక్షయ పాత్ర ద్వారా క్యాన్సర్ రోగులకు కొని సంవత్సరాల నుంచి ఆహారం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. తమ ఫౌండేషన్ కార్యక్రమాలు మరింత విస్తృత పరుస్తామన్నారు.  ఈ కార్యక్రమంలో సాయి సేవా సంఘ్ ప్రతినిధులు, ఎం ఎన్  జె క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు.