సీఎం చంద్రబాబు చేసే మొదటి మూడు సంతకాలు ఇవే!
posted on Jun 13, 2024 @ 12:14PM
నారా చంద్రబాబునాయుడు అనే నేను.. అంటే ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి రాష్ట్రంలో అభివృద్ధి వేవ్స్ కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం ఏర్పడింది. ఐదేళ్ల నరకాసుర పాలన అంతమైందన్న ఆనందం సర్వత్రా కనిపిస్తోంది. జగన్ పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల వారూ ఇబ్బందులకు గురయ్యారు. సమస్యలు పరిష్కారం కావడం అటుంచి.. అవి పెచ్చరిల్లి నానా యాతనలూ పడ్డారు. సమస్యల పరిష్కారం కోసం గొంతెత్తే స్వేచ్ఛ సైతం లేకండా పేదవాడి ఆగ్రహం పెదవికి చేటు అన్న చందంగా తమ ఆగ్రహజ్వాలలు బయటకి కనిపించకుండా మౌనాన్నాశ్రయించారు. రాష్ట్రం ఇప్పుడు జగన్ బందిఖానా నుంచి విముక్తి పొందింది. ప్రజాస్వామ్య విలువలకు పెద్ద పీట వేసే చంద్రబాబునాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు అందుకున్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన వాగ్దానాలను వరుస క్రమంలో నెరవేరుస్తారన్న విశ్వాసంతో పాటు.. సంక్షేమం, అభివృద్ధి జోడు గుర్రాల్లా దౌడుతీస్తాయన్ నమ్మకం కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రజలలో బలంగా వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యలోనే ఆయన సచివాలయంలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సంతకం చేసే ఫైళ్లు ఏమిటి అన్నదానిపైనే అందరి ఆసక్తీ నెలకొని ఉంది.
అందుకు తగ్గట్టుగానే బుధవారం (జూన్ 12) సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన తన కేబినెట్ సహచరులతో భేటీ అయ్యారు. ఆ భేటీలో తన ప్రాధాన్యతలు, ప్రాధమ్యాల గురించి వారికి విశదీకరించారు. ఆ తరువాత ఆయన కుటుంబ సమేతంగా తిరుమలకు బయలుదేరి వెళ్లారు. గురువారం (జూన్ 13)న ఆయన సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలి సంతకం మెగా డీఎస్సీపై చేయనున్నారు.
అది కాకుండా ఆయన మరో రెండు దస్త్రాలపై కూడా సంతకం చేయనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలుస్తోంది. అవేమిటంటే.. జగన్ సర్కార్ తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ ఆయన తన రెండు సంతకం చేస్తారని చెబుతున్నారు. అదే విధంగా సామాజిక పెన్షన్ల ను నాలుగు వేల రూపాయలకు పెంచే ఫైలుపై మూడో సంతకం చేస్తారని చెబుతున్నారు.