తమ్ముడికి అన్న చిరు అండ
posted on Jan 2, 2023 @ 10:55AM
ఇంత కాలం తటస్థంగా ఉన్న మెగా స్టార్ చిరంజీవి కొత్త సంవత్సరంలో తన తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు బహిరంగ మద్దతు ప్రకటించేశారు. ఇంత కాలం కారణాలేమైతేనేం.. ఏ పార్టీకి అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు అంటూ వచ్చిన చిరంజీవి.. పరోక్షంగానైనా విస్పష్టంగా తేల్చేశారు. తన తమ్ముడిని ఇష్టారీతిగా తిడుతూ తన వద్దకు వచ్చేవారిని ఉద్దేశించి చిరంజీవి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తన తమ్ముడు, జనసేనాని పవన్ కల్యాణ్ ను విమర్శించే వారు తన వద్దకు రావద్దని కుండ బద్దలు కొట్టేసారు. ఒక వైపు పవన్ ను బండ బూతులు తిడుతూ తన వద్దకు వచ్చి వారి ఇళ్లల్లో శుభకార్యాలకు ఆహ్వానించే వారిని ఇక దూరం పెట్టనున్నట్లు చెప్పిన చిరంజీవి.. అలాంటి వారు ఆహ్వానించినా వారి ఇళ్లల్లో కార్యక్రమాలకు తాను వెళ్లననీ, అలాగే అటువంటి వారిని తాను పిలవననీ చెప్పారు. అయితే చిరు మాటల, వ్యాఖ్యలు వైసీపీని ఉద్దేశించి చేసినవేనని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.
ఎందుకంటే.. జనసేనాని పై అనుచి వ్యాఖ్యలు, విమర్శలు చేసేది కేవలం వైసీపీ వాళ్లే. రాజకీయ విమర్శలు కాకుండా వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చూస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడే వైసీపీ నేతలను ఉద్దేశించే చిరంజీవి ఈ కామెంట్స్ చేశారని అంటున్నారు. ఎందుకంటే పవన్ కల్యాణ్ వివాహాల విషయంలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ సహా పలువురు వైసీపీ మంత్రులు, నాయకులు తరచూ విమర్శలు గుప్పిస్తుంటారు. జనసేనాని వైసీపీ ప్రభుత్వ విధానాలపై విమర్శ చేయడం తరువాయి.. వైసీపీ నాయకులు తమ గొంతులు సవరించుకుని మరీ పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత దూషణలకు దిగుతారు. పేర్ని నానితో సహా అనేక మంది వైసీపీ లో ఉన్న కాపు నేతలు పవన్ కల్యాణ్ వ్యక్తిగత దూషణే తమ బాధ్యత అనుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వీరంతా కూడా అదే సమయంలో చిరంజీవిని తమ వాడుగా చెప్పుకుంటుంటారు.
చిరు నోట ఏ మాటా రాకపోయినా.. చిరంజీవికి జగన్ అంటే అభిమానమని చెప్పుకుంటుంటారు. సినిమా టికెట్ల వ్యవహారంలో చిరంజీవి జగన్ వద్దకు రాయబారానికి వెళ్లడం.. ఆ సందర్భంగా దణ్ణాలు పెడుతూ బతిమలాడుతున్నట్లు మాట్లాడటాన్ని పదే పదే ప్రస్తావిస్తూ మెగా స్టార్ కు జగన్ అంటే అంతులేని గౌరవమనీ చెప్పుకుంటారు. ఇప్పుడు చిరంజీవి తన వ్యాఖ్యల ద్వారా అటువంటి నేతలందరికీ చెక్ పెట్టారనే చెప్పాలి. పవన్ పై విమర్శలు గుప్పించి, వ్యక్తిగత దూషణలకు దిగే వారిని చూడటానికే తనకు ఇష్టం ఉండదని చిరు కుండబద్దలు కొట్టేశారు. వైసీపీ నేతలను ఉద్దేశించే చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారన్నది కేవలం రాజకీయ విశ్లేషకులే కాదు సామాన్య జనం కూడా చెబుతున్నారు.
రాష్ట్ర జనాభాలో 15 శాతం పైగా ఉన్న కాపు సామాజిక వర్గం ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే, ఆ పార్టీ విజయావకాశాలు మెరుగవుతాయి. అందుకే, ‘కాపు’ఓటు ఏ పార్టీని కాపు కాస్తే, ఆపార్టీ అధికారంలోకి వస్తుందనే రాజకీయ విశ్వాసం బలంగా స్థిరపదిండి. ఆ కారణంగానే కాపు జనాభా అధికంగా ఉన్న ఉమ్మడి ఉభయ గోదావరి జల్లాలలో ఏ పార్టీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంటే, అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని, ఒక నమ్మకమూ ఏర్పడింది. ఆ కారణంగానే వైసీపీ కాపు ఓటు కోసం చిరంజీవిని ఆకాశానికి ఎత్తేస్తూ.. అదే సమయంలో ఆయన సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. అలా విమర్శించడానికి ప్రధానంగా పార్టీలోని కాపు నేతలనే నియోగిస్తోంది. ఒక వైపు మెగాస్టార్ ను ప్రశంసలతో ముంచెత్తేస్తూ, మరో వైపు పవన్ కల్యాణ్ వ్యక్తిత్వంపై విమర్శలు గుప్పిస్తూ కాపులలో చీలికను తెచ్చి లబ్ధి పొందాలన్న ఆరాటం ప్రదర్శిస్తోంది.
ఈ నేపథ్యంలోనే స్వాంత్య్ర స్వర్ణోత్సవాలలో భాగంగా భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించింది. అయితే.. జగన్ సర్కార్ పై కాపు సామాజిక వర్గంలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. గత ఎన్నికలలో నమ్మి జగన్ కుమద్దతుగా నిలబడిన తమను జగన్ నిలువునా ముంచేశారన్న భావన ఆ సామాజిక వర్గంలో వ్యక్తం అవుతోంది. కాపు రిజర్వేషన్ మాట దేవుడెరుగు కాపుల సంక్షేమం ఊసే లేకుండా జగన్ ఈ మూడున్నరేళ్లూ గడిపేశారని గుర్రుగా ఉంది. దీనిని గమనించే జగన్ కాపు సామాజిక వర్గంలో బలమైన గుర్తింపు, అభిమానం ఉన్న మెగాస్టార్ ను తనకు అనుకూలుడని చిత్రీస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రజలలో అటువంటి అభిప్రాయం కలిగించడంలో సక్సెస్ అవుతూ వచ్చింది. ఓ వైపు పవన్ కల్యాణ్ పై విమర్శలు, మరో వైపు చిరంజీవిపై ప్రశంసలలో కాపు సామాజిక వర్గంలో అయోమయాన్ని సృష్టించడమే కాకుండా.. చిరు పవన్ అభిమానులలో వైరుధ్యాన్ని వైషమ్యం ఏర్పడేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచ్చింది.
ఇప్పుడు చిరు మాటలతో వైసీపీ పరిస్థితి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డ చందంగా మారింది. వైసీపీ పేరు ప్రస్తావించకపోయినా.. పవన్ కల్యాణ్ ను దూషించే వ్యక్తులతో మాట్లాడటానికే ఇష్టపడనని చిరంజీవి చెప్పిన మాటలు ఆ పార్టీని ఉద్దేశించినవేనని ఎవరికైనా ఇట్టే అవగతమైపోయింది. ఈ మాటల ద్వారా చిరంజీవి అటు వైపీసీ వ్యూహాలకు చెక్ పెట్టడమే కాకుండా.. ఇటు జనసేనకే తన మద్దతు అని చెప్పకనే చెప్పేశారు. ఈ మాటలు జనసేనకు ఎంత మేరకు బలంగా మారుతాయన్నది చూడాల్సిందే.