మెగా సమస్యకు పరిష్కారం ఉందా?
posted on Mar 7, 2014 @ 8:13PM
పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశంతో మెగా కుటుంబంలో, మెగాభిమానులలో చీలికలు రానున్నాయి. ఇటువంటి పరిస్థితులని నివారించడానికి నేటికీ రెండు మార్గాలున్నాయి. పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రవేశం ఆలోచన విరమించుకోవాలి లేదా చిరంజీవి తన పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తమ్ముడుకి అండగా నిలబడాలి. ఈ రెంటిలో రెండవ ఆలోచనే ఇద్దరికీ శ్రేయస్కరం. వారిరువురూ చేతులు కలిపితే రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా అవతరించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ వంటి నిజాయితీపరుడు, రాజకీయాలలోకి రావాలనుకొన్నపుడు, చిరంజీవి కుటుంబ సభ్యులు అతనిని వారించే ప్రయత్నాలు చేసే బదులు, అతనికి అండగా నిలబడితే ప్రజలందరూ హర్షిస్తారు.
చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో చేరి కేంద్రమంత్రి అయి ఉండవచ్చు గాక, కానీ ఆయన నాలుగు దశాబ్దాలుగా రేయింబవళ్ళు కష్టపడి సంపాదించుకొన్న పరువు ప్రతిష్టలు, సమాజంలో గౌరవం అన్నీకూడా కేవలం రెండేళ్ళలోనే పూర్తిగా మసకబారిపోయాయి. అవినీతిమయమయిన కాంగ్రెస్ పార్టీలో చేరడం ఒక తప్పయితే, రాహుల్ గాంధీ కోసం రాష్ట్రాన్ని విడదీస్తున్నపటికీ, తమ అభిప్రాయాలకు పూచికపులెత్తు విలువీయకపోయినప్పటికీ, తన స్వంత పార్టీ నేతల రాజకీయ జీవితాలని, భవిష్యత్తుని సర్వనాశనం చేసినప్పటికీ, ముఖ్యమంత్రి పదవి కోసం ఆత్మాభిమానం, ఆత్మగౌరవం చంపుకొని కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం మరో పెద్ద తప్పు. కాంగ్రెస్ పార్టీలో తెలుగు వాళ్ళకు ఎంత గౌరవ మర్యాదలున్నాయో ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకొన్న తరువాత కూడా ఇంకా ఆ పార్టీ అధిష్టానానికి సలాములు చేస్తూ గులాములా ఎందుకు కొనసాగాలి? అని ప్రశ్నించుకోవాలి.
ఒక పరాయి (దేశ) వ్యక్తి అయిన సోనియాగాంధీ ముందు తలవంచగా లేనిదీ రక్తం పంచుకొని పుట్టిన తమ్ముడు కోసం తన అహం, బేషజం పక్కనబెట్టడం పెద్ద కష్టమయిన పనేమీ కాదు. పైగా దానివలన ప్రజల దృష్టిలో అయన గౌరవం పెరుగుతుందే తప్ప తరగదు. అందువల్ల ఇప్పటికయినా చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కి అండగా నిలబడితే ప్రజలు, అభిమానులు కూడా హర్షిస్తారు. తమ్ముడు రూపంలో వచ్చిన ఈ అపూర్వ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనే బదులు అతనికి అడ్డంకులు సృష్టిస్తే, దానివలన ఆయనే ప్రజల దృష్టిలో మరింత పలుచన అవుతారు. ఇటువంటి పరిస్థితిని నివారించడం ఇప్పుడు ఆయన చేతిలోనే ఉంది.
ఆయనకంటే కాంగ్రెస్ అధిష్టానానికి వీరవిధేయులు, తలపండిన నేతలే పార్టీ తమకు ద్రోహం చేసిందని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అటువంటప్పుడు నిన్నగాక మొన్న పార్టీలో చేరిన చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి, దాని అధిష్టానానికి ఆత్మాభిమానం వదులుకొని ఊడిగం చేయనవసరం లేదు. నిజం చెప్పాలంటే ఆయన ఎంత ఊడిగం చేసినా ఆయన ఎన్నడూ ముఖ్యమంత్రి కాలేరు. ఆవిషయం మొన్ననే ఆయనకి అనుభవం అయింది కూడా. ఇక అటువంటప్పుడు మునిగిపోయే టైటానిక్ షిప్ వంటి కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఎందుకు కొనసాగాలో ఆయనే ఆలోచించుకోవాలి.
ఆయన కాంగ్రెస్ లో ఉన్నంత మాత్రాన్నఆ టైటానిక్ షిప్ మల్లెపూల నావలా ఎన్నికలలో తేలుతూ సాగిపోదు. అలాగని వదిలిపెట్టినా అది మునిగిపోకా మానదు. ఆ టైటానిక్ షిప్పుని పట్టుకొని వ్రేలాడితే దానితో బాటు ఆయన కూడా మునగడం ఖాయం. దేశముదురు కాంగ్రెస్ నేతలందరికీ తమ షిప్ మునిగితే ఈదుకొని క్షేమంగా ఏవిధంగా ఒడ్డున పడాలో బాగా తెలుసు. కానీ, అది తెలీని చిరంజీవి వంటి వారే ఆ టైటానిక్ క్రింద మునిగిపోయే ప్రమాదం ఉంది. గనుక అది ఇంకా మునగక ముందే మళ్ళీ లైఫ్ (బోట్) ఇస్తున్న పవన్ చెంతకి చేరి క్షేమంగా బయటపడటం మేలేమో ఆయనే ఆలోచించుకోవాలి.