చింతమనేని వర్సెస్ పోలీస్.. ఏలూరులో హైటెన్షన్..
posted on Dec 17, 2021 @ 9:33AM
పోలీసులకు అత్యంత ఫేవరేట్ లీడర్. చింతమనేని ప్రభాకర్ పేరు వినిపిస్తే చాలు.. టక్కున వాలిపోతారు. అడ్డుకుంటారు. కేసులు పెడతారు. అరెస్ట్ చేస్తారు. చింతమనేనిపై ఎన్ని కేసులు పెడితే అంత క్రెడిట్ అన్నట్టు యాక్షన్ చేస్తుంటారు. పోలీస్ పవర్ అంతా ప్రభాకర్‌పైనే చూపిస్తుంటారు. ఇప్పటికే చింతమనేనిని ఎన్నో ఇబ్బందులు పెట్టిన ఖాకీలు.. శుక్రవారం మరోసారి ఆయనపై పోలీస్ యాక్షన్ చేపట్టారు. కట్‌చేస్తే.. ఎప్పటిలానే ఏలూరులో మరోసారి ఉద్రిక్తత నెలకొంది.
టీడీపీ పోలవరం యాత్రను అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. టీడీపీ నేతలను ఎక్కిడికక్కడ పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అడ్డుకున్నారు.
ఏలూరు సమీపంలోని దుగ్గిరాల దెందులూరులో ఇంటి నుంచి బయటకు వస్తున్న చింతమనేనిని పోలీసులు అడ్డుకున్నారు. తాను పోలవరం వెళ్లడం లేదని.. పెళ్ళికి వెళ్తున్నానని మాజీ ఎమ్మెల్యే చెప్పినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. ఇరువురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అది మరింత ముదిరింది. తీవ్ర వాదోపవాదాల తరువాత చింతమనేనిని పోలీసులు వదిలిపెట్టారు.
అయితే, అసలే పోలీసులు కదా. అందులోనూ వాళ్లకు ఫేవరేట్ నాయకుడాయె. అందుకే, ఇంటి నుంచి బయటకు వెళుతున్న చింతమనేనిని పోలీసులు అనుసరిస్తున్నారు. ఎలాగంటే.. ఓ ఎమ్మెల్యేకు ఎస్కార్ట్ ఇచ్చిన లెక్కన. అంటే, మనోడు మాజీ అయినా.. తాజాలానే పోలీస్ బందోబస్తుతో ఏలూరులో తిరుగుతున్నారంటూ టీడీపీ శ్రేణులు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు.