కరోనా వైరస్ పుట్టుక పై సంచలన నిజాలు బయటపెట్టిన చైనా వైరాలజిస్ట్..
posted on Sep 14, 2020 @ 10:03AM
చైనాలోని వూహాన్ లో మొదలైన కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసందే. అయితే ఈ వైరస్ ల్యాబ్ లో పుట్టిందా లేక జంతువుల నుండి మనుషులకు సోకిందా అనే విషయం పై ఇప్పటికి క్లారిటీ రాలేదు. అయితే తాజాగా దీని పై చైనాకు చెందిన వైరాలజిస్ట్ డాక్టర్ లీ మెగ్ యాన్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ ప్రాణాంతక వైరస్ చైనా ప్రభుత్వ ఆధీనంలోని వూహాన్ ల్యాబ్‌లోనే తయారు చేసారని ఆమె పేర్కొన్నారు. హాంకాంగ్ లోని స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో పనిచేస్తున్న లీ కరోనా వైరస్‌పై పరిశోధన చేస్తున్నారు. తాను న్యూమోనియాపై పరిశోధనలు చేస్తున్న సమయంలోనే ఈ వైరస్ చైనాలోని ఓ ల్యాబ్‌లో తయారైనట్టు గుర్తించినట్టు చెప్పారు. దీనికి సంబంధించి తన దగ్గర సైన్టిఫిక్ ఆధారాలు ఉన్నాయని ఆమె తెలిపారు.
అయితే కరోనా వైరస్‌పై తాను చేసిన హెచ్చరికలను అటు చైనా కానీ, ఇటు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) కానీ ఏమాత్రం పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన హెచ్చరికలను నిర్లక్ష్యం చేయడం వల్లే ప్రపంచానికి ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ విషయం పై తాను బయటపెట్టగానే చైనా అధికారుల నుంచి తనకు బెదిరింపులు వచ్చాయని, అంతేకాకుండా తనపై దుష్ప్రచారం మొదలుపెట్టారని లీ మెగ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తన ప్రాణాలకు ముప్పు ఏర్పడడంతో తాను పారిపోయి అమెరికాకు వచ్చేసినట్టు ఆమె చెప్పారు. ఈ వైరస్ ప్రకృతి సిద్ధంగా వచ్చిన వైరస్ కాదని.. కొన్ని పాత వైరస్ లపై రీసెర్చ్ చేసి నావెల్ కరోనా వైరస్ ను వూహన్ ల్యాబ్ లో డెవలప్ చేసారని ఆమె పేర్కొన్నారు. దీనికి సంబంధించి తాను మరికొద్ది మంది సైంటిస్టుల తో కలిసి జనవరి నుండి చేస్తున్న పరిశోధనల వివరాలు త్వరలో పబ్లిష్ చేస్తానని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ఈ వైరస్ పుట్టుక వెనుక దాగి ఉన్న నిజాల్ని ప్రపంచం మొత్తానికి సైన్టిఫిక్ ఆధారాలతో సహా తెలిసేలా చేస్తానని ఆమె ప్రకటించారు.