మంత్రి రజనీకి రిటర్ గిఫ్ట్ ఇవ్వడానికి చిలకలూరి పేట రెడీ అయ్యిందా?
posted on Oct 19, 2022 @ 11:20AM
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలు రెడిగా ఉన్నారన్న టాక్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఓ రేంజ్ లో వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అంటూ ఓ వైపు రాష్ట్ర ప్రజలంతా ముక్తకంఠంతో నినదిస్తుంటే.. రాజధాని అమరావతికి ఆనుకుని ఉన్న నియోజకవర్గానికి చెందిన విడదల రజని మాత్రం.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం అంటూ ఇటీవల విశాఖలో జరిగిన గర్జన సభలో మాట్లాడడం పట్ల.. జిల్లా వ్యాప్తంగా మరీ ముఖ్యంగా చిలకలూరి పేట నియోజకవర్గంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతోంది. చిలకలూరిపేటకు కూతవేటు దూరంలో ఉండే అమరావతిని కాదని.. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉండాలని ఆమె పేర్కొనడంపై జనంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతోంది.
ఎంత విశాఖపట్నం జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా ఉంటే మాత్రం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్.. అంటూ మాట్లాడడమేమిటని వారంతా మంత్రి రజినీని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్.. ఏం చెబితే దానికి తాన తందానా.. అంటూ తల ఊపడమేనా.. అని ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలు మంత్రి రజనిని నిలదీస్తున్నారు.
రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు... చేస్తున్న ఆందోళనలు, ధర్నాలు, పాదయాత్రలు కనబడడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విడుదల రజినీకి ఓటమిని ఆమెకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు.
అయినా.. ఏ రొటి దగ్గర ఆ పాట అదీ ఎం ఎం కీరవాణి సంగీత దర్శకత్వంలో ట్యూన్ కట్టినట్లుగా పాడాలంటే మాత్రం ఈ చిలకలూరిపేట ఎమ్మెల్యేగారికే చెల్లుతోందంటూవ్యంగ్యంగా పేర్కొంటున్నారు. మంత్రిగారి గత చరిత్ర తాలుక ప్రతిభాపాటవాలను ఈ సందర్భంగా ఏకరువు పెడుతున్నారు.
2014 ఎన్నికల వేళ.. యూఎస్ నుంచి వచ్చి.. తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేశారని.... ఆ క్రమంలో 2017లో విశాఖలో నిర్వహించిన టీడీపీ మహానాడు వేదిక పైనుంచి నరకాసురులంటూ వైయస్ రాజశేఖరరెడ్డిని, వైయస్ జగన్ మోహన్ రెడ్డిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన రజనీ.. 2019 ఎన్నికల వేళ.. చిలకలూరిపేట టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి... భంగపడి, నాటి ప్రతిపక్ష నేత, వైయస్ జగన్ సమక్షంలో ఆమె వైసీపీలో చేరి.. ఆ పార్టీ అభ్యర్థిగా చిలకలూరిపేట నుంచి విజయం సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
ఇలా రాజకీయంగా ఆమె ఎదిగే క్రమంలో... టీడీపీలో రాజకీయ ఓనమాలు నేర్పించిన ప్రత్తిపాటి పుల్లారావుపై రాజకీయ ప్రత్యర్థిగా పోటీ చేసి గెలిపొందిందని.. అలాగే జగన్ పార్టీలో కీలక నేత, సదరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ మర్రి రాజశేఖర్ రాజకీయ భవిష్యత్తను విశాఖలో రిషికొండను గుండు కొట్టినట్లు కొట్టేసిందని ఉమ్మడి గుంటూరు జిల్లా వాసులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మర్రి రాజశేఖర్ అనుచర గణం... విడదల రజినీపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారని అంటున్నారు.
చిలకలూరిపేటలో స్థానిక స్వాతంత్ర్య సమరయోధుడు చంద్రమౌళి పేరుతో ఉన్న కూరగాయల మార్కెట్ పేరును వైయస్ రాజశేఖరరెడ్డి కూరగాయల మార్కెట్‌గా మార్చడంపై కూడా నియోజవకర్గ ప్రజలలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
అలాగే నరసారావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయులను సైతం... ఈ రజినీ అండ్ గ్యాంగ్.. ఐ డొంటే కేర్ అన్నట్లు వ్యవహరిస్తోందని ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ఆ క్రమంలో ఈ పంచాయతీని ఎంపీ.. తాడేపల్లి ప్యాలెస్‌కు తీసుకు వెళ్లినా.. ప్రయోజనం లేకుండా పోయిందని సమాచారం. మొత్తం మీద విశాఖ గర్జనతో చిలకలూరి పేట నియోజకవర్గంలో మంత్రి విడదల రజనీపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయన్నది మాత్రం వాస్తవమని పరిశీలకుల విశ్లేషిస్తున్నారు.