రాజకీయ పార్టీలతో తెలంగాణ సీఈవో సమావేశం
posted on Aug 18, 2022 @ 12:04AM
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ వికాస్ రాజ్ గురువారం(ఆగస్టు 18) తన కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎనిమిది రాజకీయ పార్టీలు హాజరయ్యాయి.
భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) ఆదేశాల మేరకు రాష్ట్రంలో చేపడుతున్న ఈ క్రింది కార్యకలాపాలపై సీఈఓ వివరణాత్మక ప్రదర్శన ఇచ్చారు.
1. స్పెషల్ సమ్మరీ రివిజన్
2. ఓటర్లు స్వచ్ఛందంగా ఆధార్‌ను లింక్ చేయడం
3. ఎన్నికల ఫారాలలో మార్పులు
అలాగే 18 ఏళ్లు నిండిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి నాలుగు అర్హత తేదీలలో (జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1 మరియు అక్టోబరు 1) ఇటీవల జరిగిన సవరణల గురించి కూడా సీఈవో రాజకీయ పార్టీలకు తెలియజేశారు.
ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు, ముందుగా అవసరమైన నాణ్యమైన ఓటర్ల జాబితాను నిర్ధారించేందుకు క్షేత్రస్థాయిలో బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలని రాజకీయ పార్టీలను సీఈవో కోరారు.
భారత ఎన్నికల సంఘం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటామని, అవసరమైన సహకారం అందిస్తామని రాజకీయ పార్టీల ప్రతినిధులు తెలిపారు.
కొన్ని రాజకీయ పార్టీలు రాబోయే మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి మరియు ఫోటో సిమిలర్ ఎంట్రీల(PSEs) గురించి వివరణలు కోరాయి. అదేవిధంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని బూత్ లెవల్ అధికారులు చురుగ్గా పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.
అలాగే నివాస మార్పు ఆధారంగా ఓటర్లను ఒక నియోజకవర్గం నుండి మరొక నియోజకవర్గానికి మార్చడానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయాలని రాజకీయ పార్టీలు కోరాయి.