అనుచరుల వరుస అరెస్టులు.. ఫ్రస్ట్రేషన్‌లో చెవిరెడ్డి
posted on Jul 2, 2025 @ 12:32PM
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి.. ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్‌లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారణ కొనసాగుతున్నకొద్ది.. ఆయన మరింత కూరుకు పోతున్నా రనిపిస్తోంది. ఈ స్కామ్‌లోని సొమ్ము తరలింపులో చెవిరెడ్డి భాస్కరరెడ్డి క్రియాశీలకంగా వ్యవహరిం చారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడీ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఈ కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరిద్దరు చెవిరెడ్డి అనుచరులే. బాలాజీ కుమార్ యాదవ్, నవీన్‌కృష్ణను సిట్ అధికారులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్ ఇండోర్ లో వీరిని అదుపులోకి తీసుకున్నారు.
చెవిరెడ్డి అరెస్ట్‌కంటే ముందే వీరిద్దరూ అజ్ఞాతంలోకి జారుకున్నారు. వీరికి కొందరు బడా నేతలు డబ్బులు సమకూర్చి ఇతర రాష్ట్రాలకు పంపించినట్టు తెలుస్తోంది. అప్పటి నుంచి వీరిద్దరూ పరారీలోనే ఉన్నారు. ఎట్టకేలకు ఇప్పుడు పట్టుబడ్డారు. ఇప్పుడు వీరిద్దరితో కలుపుకుంటే ఈ కేసులో అరెస్ట్‌ల సంఖ్య 11కు చేరుకుంది. ఇప్పుడీ కేసులో వీరిద్దరు నోరు తెరిస్తే చెవిరెడ్డి మరింత ఇరుక్కుంటారనే చర్చ నడుస్తోంది.
రాజ్ కెసిరెడ్డి బృందం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి వసూలు చేసిన మద్యం ముడుపుల సొమ్మును చెవిరెడ్డి చెప్పిన చోటకు చేర్చేవారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సొమ్మును గత ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థులకు చేర్చడంలో వీరిద్దరిదీ కీలక పాత్ర అంటున్నారు. దానికి సంబంధించి ఆధారాలు దొరకడం వల్లే సిట్ అధికారులు వారిని అరెస్టు చేశారు.
ఇలా రోజురోజుకు లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కుపోవడంతో చెవిరెడ్డిలో ఫ్రస్టేషన్ పెరుగుతోందనే చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో జైలు వద్ద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోసారి హల్ చల్ చేశారు. సిట్ కార్యాలయానికి తరలించే సమయంలో.. తనపై తప్పుడు కేసులు పెట్టారని అరుస్తూ బయటకు వచ్చారు చెవిరెడ్డి. ఎవ్వరినీ వదిలేది లేదంటూ హెచ్చరించారు. చెయ్యని తప్పునకు శిక్ష అనుభ విస్తున్నా అంటూ ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇవేవీ అధికారులు పట్టించుకునే పరిస్థితుల్లో ఉన్నట్లు కనిపించడం లేదు. చెవిరెడ్డి అంతలా ఊగిపోతున్నా పోలీసులు ఆయన్ని బలవంతంగా వ్యానులోకి ఎక్కించి తరలించారు. తన కీలక అనుచరులు వరుసగా దొరికి పోతుండటంతో చెవిరెడ్డి ఫ్రస్ట్రేషన్‌తో ఉన్నారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఆ క్రమంలో త్వరలో ఈ కేసులో ఎవరెవరున్నారో.. డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించారు? చెవిరెడ్డికి ఆదేశాలు ఇచ్చింది ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో ఉన్నారు పోలీసులు.