సాగర్ తో పాటు మరో అసెంబ్లీకి ఉప ఎన్నిక? హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ
posted on Dec 10, 2020 @ 10:36AM
తెలంగాణలో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యో నోముల నర్సింహయ్య అకాల మరణంతో ఉప ఎన్నిక జరగనుంది. నాగార్జున సాగర్ తో తెలంగాణలో మరో అసెంబ్లీకి కూడా ఉప ఎన్నిక వస్తుందనే ప్రచారం జరుగుతోంది. సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పై అనర్హత వేటు పడబోతుందని, అక్కడ కూడా ఉప ఎన్నిక ఖాయమనే ప్రచారం కొన్ని రోజులుగా జోరుగా సాగుతోంది. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ భారతీయ పౌరసత్వం విషయంలో ఈ నెల 16న హైకోర్టులో విచారణ జరుగనుంది. చెన్నమనేని రమేష్ కు ఇంకా జర్మనీ పౌరసత్వమే ఉందని, ఆ దేశ పాస్‌పోర్టుపైనే ప్రయాణాలు కొనసాగిస్తున్నారని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ గత నెల 18న స్వయంగా హైకోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ చెన్నమనేని రమేశ్ అనర్హుడని హైకోర్టు తీర్పు వస్తే వేములవాడలో ఉప ఎన్నిక జరగనుంది.
చెన్నమనేని రమేశ్ కేసు గతంలో సుప్రింకోర్టు వరకూ వెళ్లింది. కేంద్ర హోం శాఖ కూడా పూర్తిస్థాయి వివరాలను కోర్టుకు సమర్పించింది. చెన్నమనేని రమేశ్‌కు ఇప్పటికీ జర్మనీ పౌరసత్వం, పాస్‌పోర్టు ఉన్నాయని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. గతేడాది డిసెంబరు 16వ తేదీన చెన్నయ్ విమానాశ్రయం నుంచి ఆయన జర్మన్ వెళ్లింది కూడా ఆ దేశానికి చెందిన పాస్‌పోర్టు మీదనే అని వివరించింది. భారత పౌరసత్వం కలిగి ఉన్నా అది చెల్లదని కేంద్ర హోంశాఖ అండర్ సెక్రెటరీ గతేడాది నవంబరు 20న లిఖితపూర్వకంగా నివేదించారు. అయితే తనకు జర్మన్ పౌరసత్వం, పాస్‌పోర్టు ఉందని కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని చెన్నమనేని రమేష్ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర హోం శాఖ ఇచ్చిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమైనవని, చట్టవిరుద్ధమైనవని అందులో పేర్కొన్నారు. 1955 నాటి సిటిజన్‌షిప్ యాక్ట్ సెక్షన్ 10(3)కు కూడా విరుద్ధమైనవని వివరించారు. దీని మీద గత నెల 18న జస్టిస్ చల్లా కోదండరెడ్డి విచారణ జరిపారు. రమేష్ కు జర్మనీ పౌరసత్వం, పాస్‌పోర్టు ఇప్పటికీ ఉన్నాయో లేదో ఆ దేశం నుంచి వివరాలను తీసుకోవాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించారు. ఆ దేశంలో ఉన్న భారత రాయబార కార్యాలయం నుంచి సైతం వివరాలను సేకరించి తదుపరి విచారణ సమయానికి కోర్టుకు సమర్పించాలని సూచించారు.
చెన్నమేనేనికి జర్మని పాస్ పోర్టు ఉందని గతంలో నివేదించిన కేంద్ర హోంశాఖ.. ఇప్పుడు కూడా హైకోర్టుకు అలాంటి నివేదికే ఇస్తుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. వేములవాడ రమేష్ కు హైకోర్టులో వ్యతిరేక తీర్పు రావడం ఖాయమని, వేములవాడలో కచ్చితంగా ఉప ఎన్నిక వస్తుందని వారు భావిస్తున్నారు. అందుకే ఉప ఎన్నిక కోసం కసరత్తు కూడా మొదలు పెట్టిందట కమలదళం. వేములవాడలో బీజేపీ కొంత బలంగానే ఉంది. దుబ్బాక బైపోల్ విజయం, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలో మరింత జోష్ వచ్చింది . దీంతో వేములవాడలో ఉప ఎన్నిక జరిగితే తమదే విజయమనే ధీమాలో ఉన్నారు కాషాయ నేతలు. చెన్నమనేని రమేష్ పౌరసత్వం విషయంలో మొదటి నుంచి పోరాడుతున్న ఆది శ్రీనివాస్ ..2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. తర్వాత బీజేపీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరిగి కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటి చేశారు. మరోవైపు చెన్నమనేని రమేశ్‌కు భారత పౌరసత్వం, పాస్‌పోర్టు కూడా ఉన్నాయని, హైకోర్టులో ఆయనకు అనుకూలంగా తీర్పు వస్తుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.