ప్లేటు ఫిరాయించిన చేగొండి!
posted on Jun 5, 2024 @ 4:11PM
మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించేశారు. కాపులకు అన్యాయం చేశారంటూ జనసేనాని పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించి, పవన్ ఓటమి ఖాయం అంటూ వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలూ చేసిన ఆయన ఇప్పుడు ఒఖ్కసారిగా యూటర్న్ తీసుకున్నారు.
తెలుగుదుశంతో పొత్తులో భాగంగా ఇన్ని జనసేన ఇన్ని సీట్లు తీసుకోవాలి, అన్ని సీట్లు తీసుకోవాలి, అస్సలు తగ్గొద్దు అంటూ లేఖాస్త్రాలు సంధించిన చేగొండి హరిరామ జోగయ్య, తీరా జనసేనకు 21 స్థానాలలో పోటీకి అంగీకరించడంతో హరిరామజోగయ్య పవన్ కల్యాణ్ పై తీవర విమర్శలు గుప్పించారు. కాపుల ఆత్మగౌరవాన్ని తెలుగుదేశం పాదాల దగ్గర పెట్టేశారంటూ లేఖాస్త్రం కూడా సంధించారు. కూటమి ఓటమి ఖాయం, జనసేన ఓటమి తప్పదు అంటూ శాపనార్ధాలు కూడా పెట్టారు. అయితే తెలుగుదేశం కూటమి ఘన విజయంతో ఆయన ఒక్కసారిగా మాట మార్చేశారు. పవన్ కల్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
వైసీపీ ఓటమికి జగన్ ప్రజా వ్యతిరేక విధానాలు కారణం అన్న చేగొడి హరిరామ జోగయ్య, తెలుగుదేశం కూటమి విజయానికి జనసేన అధినేత పవన్ కల్యాణే కారణమంటూ ప్రశంసలతో ముంచెత్తారు. ఈ ఎన్నికల పోటీలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కల్యాణే అంటూ ఆకాశానికెత్తేశారు. కేవలం పవన్ కల్యాణ్ వల్లే తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించిందంటూ పొగడ్తల్లో ముంచెత్తారు.
ఇప్పుడు ఇలా యూటర్న్ తీసుకున్నంత మాత్రాన గతంలో చేసిన వ్యాఖ్యలు, విమర్శల పాపం కడిగేసుకోవడం అంత తేలిక కాదని పవన్ అభిమానులు అంటున్నారు. గతంలో చేగొండి తన లేఖలతో కాపు పెద్దగా, సీనియర్ రాజకీయనాయకుడిగా చేగొండికి ఉన్న గౌరవాన్ని మంటగలుపుకున్నారనీ, ఇప్పుడు ఇలా యూటర్న్ తీసుకుని పవన్ కల్యాణ్ పై పొగడ్తల వర్షం కురిపించినంత మాత్రాన పోయిన గౌరవం తిరిగిరాదని అంటున్నారు.