తెలుగుదేశం కూటమికే ప్రజలు పట్టం.. చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్
posted on Jun 1, 2024 @ 6:26PM
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి దాదాపు ఇరవై రోజులు కావొస్తున్నది. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి మేమే అధికారంలోకి వస్తున్నామని తెలుగుదేశం, వైసీపీ నేతలు చెబుతున్నారు. మరోసారి జగన్ సీఎం అవుతారని వైసీపీ నేతలు చెబుతున్నప్పటికీ.. పోలింగ్ సరళిని చూస్తే అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. జగన్ ఐదేళ్ల పాలనలో అభివృద్ధిని మరిచి కేవలం కక్షపూరిత రాజకీయాలకే పరిమితం కావటంతో ప్రజలు విసిగిపోయారు. దీంతో గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో ఓటర్లు భారీగా తరలి వచ్చితమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రభుత్వంపై తమ వ్యతిరేకతను స్పష్టం చేశారు. అర్ధరాత్రి 2గంటల వరకు దాదాపు 300 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగిందంటే వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. సర్వే సంస్థలు సైతం అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో చాణక్య స్ట్రాటజీస్ సర్వే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసింది. ఆ ఎగ్జిట్ పోల్ సర్వే స్పష్టమైన మెజార్టీతో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుందని తేల్చింది.
ఏపీలోని 175 నియోజకవర్గాల్లోనూ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ను చాణక్య స్ట్రాటజీస్ సర్వే సంస్థ శనివారం సాయంత్రం విడుదల చేసింది. ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధిస్తుంది. తెలుగుదేశం కూటమికి కూటమికి 52శాతం ఓట్లు, వైసీపీకి 43శాతం ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 2.50శాతం, ఇతరులకు 2.50 శాతం ఓట్లు వస్తాయని చాణక్య స్ట్రటజీస్ ఎగ్జిట్ పోల్ తేల్చింది. ఏపీలోని 13 ఉమ్మడి జిల్లాల్లో తెలుగుదేశం కూటమికే అత్యధిక సీట్లు వస్తాయని తేలింది. మొత్తం 175 స్థానాల్లో తెలుగుదేశం కూటమికి 114 నుంచి 125 సీట్లు, వైసీపీకి 39 నుంచి 49 స్థానాలు, ఇతరులకు ఒక స్థానం వస్తుందని పేర్కొంది. లోక్‌సభ స్థానాల్లో తెలుగుదేశం కూటమికి 17 నుంచి 18 , వైసీపీకి 6 నుంచి 7 స్థానాలు వస్తాయని తేల్చింది. అరకు, నంద్యాల, కడప, తిరుపతి, రాజంపేట, చిత్తూరు నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులే విజయం సాధిస్తారని, విజయనగరం పార్లమెంట్ స్థానంలో ఇరు పార్టీల మధ్య హోరాహరీ పోరు జరిగిందనీ చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్ తేల్చింది.
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ వారి ఓటు బ్యాంకు కేవలం 3శాతంలోపే ఉంటుందని, అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ షర్మిల ప్రభావం పెద్దగా లేనప్పటికీ.. కడప పార్లమెంట్ స్థానంలో మాత్రం గట్టి పోటీ ఇచ్చారని చాణక్య స్ట్రాటజీస్ పేర్కొంది. 2019 ఎన్నికల్లో టీడీపీకి 40శాతం ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీకి 47శాతం ఓట్లు పోలయ్యాయి. 2019 ఎన్నికల్లో వైసీపీకి 50శాతం ఓట్లు పోలవగా.. ప్రస్తుతం 43శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి. తెలుగుదేశం పార్టీకి జనసేన, బీజేపీకూడా తోడుకావడంతో కూటమికి 52శాతం పోలయినట్లు చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్ పేర్కొంది. ప్రస్తుత ఎన్నికల్లో కీలకంగా భావిస్తున్న కుప్పం, పిఠాపురం, హిందపూరం, మంగళగిరి నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కల్యాన్, బాలకృష్ణ, నారా లోకేశ్ భారీ మెజారిటీతో విజయం సాధించడం తధ్యమని ఈ ఎగ్జిట్ పోల్ తేల్చి చెప్పింది.
ఉమ్మడి జిల్లాల వారిగా తెలుగుదేశం, వైసీపీ లు గెలుచుకునే సీట్ల చాణక్య ఎగ్జిట్ పోల్ ప్రకారం ఇలా ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం కూటమి -7, వైసీపీ -2, టఫ్ ఫైట్ -1
విజయనగరం జిల్లాలో కూటమి-4, వైసీపీ-3, టఫ్ ఫైట్ - 2
విశాఖపట్టణం జిల్లాలో కూటమి- -11, వైసీపీ -2, టఫ్ ఫైట్ -2
పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి -11, వైసీపీ - 2, టఫ్ ఫైట్ - 2
ఈస్ట్ గోదావరి జిల్లాలో కూటమి - 15, వైసీపీ - 3, టఫ్ ఫైట్ -1
కృష్ణా జిల్లాలో కూటమి - 13, వైసీపీ - 2, టఫ్ ఫైట్ -1
గుంటూరు జిల్లాలో కూటమి - 13, వైసీపీ -3, టప్ ఫైట్-1
నెల్లూరు జిల్లాలో కూటమి - 07, వైసీపీ - 2, టఫ్ ఫైట్ -1
కడప జిల్లాలో కూటమి - 2, వైసీపీ - 4, టఫ్ ఫైట్ - 4
కర్నూల్ జిల్లాలో కూటమి - 6, వైసీపీ - 6, టఫ్ ఫైట్ - 2.
అనంతపురం జిల్లాలో కూటమి -9, వైసీపీ - 3, టఫ్ ఫైట్ - 2
చిత్తూరు జిల్లాలో కూటమి - 7, వైసీపీ - 4, టఫ్ ఫైట్ - 3
వైసీపీ ఓటమికి, తెలుగుదేశం కూటమి విజయానికి కారణాలేమిటన్నది పరిశీలిస్తే..
- వైసీపీ ఓటమికి ప్రధాన కారణం ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారనే అపవాదు. గత ఎన్నికల సమయంలో అమరావతిని రాజధానిగా కొనసాగిస్తానని ప్రతిపక్షం నేత హోదాలో జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చిన తరువాత అమరాతి రాజధానిని విస్మరించి మూడు రాజధానుల పేరుతో ఐదేళ్లు కాలం గడిపేశారు. విశాఖ కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ.. విశాఖ నగరంతో పాటు జిల్లాలో భూ కబ్జాలు పెరిగిపోయాయి. దీంతో ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకతతో ఉన్నారు.
- పట్టణ ప్రాంతాల్లో మెజార్టీ ఓటర్లు తెలుగుదేశం కూటమికి, గ్రామీణ ప్రాంతాల్లో మెజార్టీ ఓటర్లు వైసీపీకి ఓట్లు వేసినట్లు సర్వేలో తేలింది.
- పట్టణ ప్రాంతాల్లో ప్రజలు తెలుగుదేశం కూటమికి అనుకూలంగా మారడానికి జగన్ హయాంలో జీరో అభివృద్ధి ఒకటి. ఏపీలో ఎలాంటి పరిశ్రమలు రాకపోవటంతో ఉపాధికోసం ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారు.
- పోలింగ్ కు రెండు రోజుల ముందే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు సహా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్లు ఏపీకి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో 80శాతంకుపైగా తెలుగుదేశం అనుకూల ఓటర్లే.
- వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు కేవలం దిగువ మధ్య తరగతి ప్రజలపై మాత్రమే ప్రభావితం చూపిస్తున్నాయి. ఈ వర్గం ఓట్లు ఎక్కువగా రూరల్ ప్రాంతాల్లోనే ఉన్నాయి. పల్లెల్లో వృద్ధులు, పెన్షన్ దారులు ఎక్కువగా వైసీపీ వైపు మొగ్గుచూపగా.. పల్లెల్లో విద్యావంతులు, పట్టణ ప్రాంతాల ఓటర్లు అధికంగా తెలుగుదేశం కూటమికి మద్దతుగా నిలిచారు.
- నిరుద్యోగులు సైతం కూటమి వైపు మొగ్గుచూపారు. దీనికి కారణం.. ప్రతీయేటా జాబ్ క్యాలెండర్ ఇస్తామంటూ గత ఎన్నికల్లో ఇచ్చిన మాట అమలు కాలేదని నిరుద్యోగులు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. ఇదేసమయంలో కూటమి అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి వస్తుందని బలంగా నమ్ముతున్నారు. దీంతో 90శాతం మంది నిరుద్యోగులు కూటమివైపే మొగ్గుచూపారు. కూటమి అధికారంలోకి వస్తే ఉపాధి దొరుకుతుందని నిరుద్యోగులు నమ్ముతున్నారు.
- తెలుగుదేశం సూపర్ సిక్స్ మేనిఫెస్టోకు క్షేత్ర స్థాయిలో మంచి ఫలితమే వచ్చింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, ప్రతి మహిళకు నెలకు రూ. 1500 ఇస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలో తెలుగుదేశం నేతలు విజయవంతం అయ్యారు.
- వైసీపీ ప్రభుత్వం ఓటమికి మరో ప్రధాన కారణం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దీనికితోడు పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫొటోలు ఉండటాన్ని వైసీపీ నేతలు కూడా తప్పుబట్టారు. ఈ అంశంపై ప్రజలు బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. మా భూమిపై మీ హక్కు ఏమిటని నిలదీశారు. దీనికితోడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు నేనుకూడా బాధితుడినే అంటూ కొందరు ప్రముఖలు బహిరంగంగా చెప్పడంతో ప్రజల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై భయాందోళనలు నెలకొన్నాయి.
- పట్టాదారు పాసు పుస్తకంపై జగన్ ఫొటో ఉండటం ఏమిటని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. నంద్యాల సభలో పాసు పుస్తకాన్ని చింపేశారు. ఇది ఓటర్లను, ముఖ్యంగా రైతులను బాగా ఆకర్షించింది. అధికారంలోకిరాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైనే రెండో సంతకం అని చంద్రబాబు చెప్పడంతో రైతులు అధికశాతం మంది కూటమివైపు మొగ్గుచూపారు.
- కొత్తగా ఓటుహక్కు పొందిన యువతుల్లో 70శాతం మంది తెలుగుదేశం కూటమికే అనుకూలంగా ఓటు వేశారు. యువకుల్లో 60శాతం మంది కూటమికి అనుకూలంగా ఓటు వేశారు.
- ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, వ్యాపారులు ఈ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించారు. వీరిలో అధికశాతం మంది ఓటర్లు కూటమివైపు మొగ్గుచూపారు. ఈసారి 4.30లక్షలకుపైగా పోస్టల్ ఓట్లు పోలయ్యాయి. మెజార్టీ శాతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తెలుగుదేశం కూటమికే పడినట్లు చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్ తేల్చింది.