తిరుమల కొండపై మార్పు మొదలైంది!
posted on Jul 27, 2024 @ 11:18AM
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సర్కార్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో తిరుమల పవిత్రతకు భగం వాటిల్లింది. తిరుమలేశుని దర్శనానికి వచ్చే భక్తులకు జగన్ పాలనలో కనీస సౌకర్యాలు కూడా కరవయ్యాయి. అంతే కాకుండా తిరుమలేశుని దర్శనాన్ని కూడా క్లిష్టతరం చేసేలా నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో కూడా రాజకీయాలు జొప్పించి తిరుమల పవిత్రతను మంటగలిపేలా కొండపై నానా రకాల అరాచకాలకూ పాల్పడ్డారు.
దీంతో దేశ విదేశాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులు నానా ఇబ్బందులూ పడ్డారు. అన్న ప్రసాదం నాణ్యత నుంచి, కొండపై పరిశుభ్రత వరకూ ప్రతి విషయంలోనూ ప్రమాణాలకు తిలోదకాలిచ్చేశారు. తిరుమలకు భక్తులు రావద్దు అనే వరకూ జగన్ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం తెగించేసింది. భక్తుల రద్దీ అధికంగా ఉంది, సౌకర్యాలు కల్పించలేం. రద్దీ తగ్గే వరకూ భక్తులు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవడం మేలు అని ప్రకటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక కొండపై అన్యమత ప్రచారం, అన్యమతస్థులకు టీటీడీలో కొలువులు ఇలా అన్ని రకాలుగానూ నింబంధనలకు తిలోదకాలిచ్చేశారు. ఒకరిద్దరి కనుసన్నలలోనే తిరుమలలో అంతా జరిగేది. చివరాఖరికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా కూడా తిరుమలేశుడిని నల్లరాతితో పోల్చిన వ్యక్తినే నియమించారు.
తిరుమలేశునికి భక్తులు సమర్పించిన కానుకల సొమ్మును కూడా తమ రాజకీయ అవసరాలకు వినియోగించుకోవడానికి వీలుగా నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల ప్రక్షాళనపై ఫోకస్ పెట్టారు. ఏళ్ల తరబడి అక్కడే ఉంటూ కొండపై అరాచకాలన్నిటికీ ఊతం ఇచ్చిన ఈవో ధర్మారెడ్డికి ఉద్వాసన పలికారు. అలాగే ఆయనకు వంత పాడి అక్రమాలు, అన్యాయాలకు పాల్పడిన అధికారులనూ బదిలీ చేశారు. ధర్మారెడ్డి స్థానంలో వచ్చిన ఈవో శ్యామలరావు.. తిరుమల ప్రక్షాళనపై దృష్టి సారించారు.
తిరుమల లడ్డూ నాణ్యత తగ్గిపోవడానికి కారణమేమిటి? క్యూలైన్లో భక్తులకు అందించే అన్న ప్రసాదాన్ని ఆపివేయడానికి కారణమేంటి? అలాగే వృద్ధులకు, తల్లులకు వెయిటింగ్ కంపార్టుమెంట్ లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలు సరఫరా చేసే విధానానికి కూడా తిలోదకాలిచ్చేశారు. ఇలా గతంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు గతంలో ఉన్న సౌకర్యాలన్నిటినీ ఆపివేశారు.
కొత్తగా వచ్చిన ఈవో వీటిపై దృష్టి పెట్టారు. ముందుగా శుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చారు. నిత్యం ఆకస్మిక తనిఖీలు, రివ్యూలు, హెచ్చరికలతో పరిస్థితిని గాడిలోకి తీసుకువచ్చారు. …. ఫలితంగా టీటీడీలో మార్పు మొదలైంది. గతంలో ఉన్న సౌకర్యాలు తిరిగి మొదలయ్యాయి. లడ్డూ దగ్గర నుండి తిరుమల కొండపై అధిక రేటుకు అమ్మే వాటర్ బాటిల్స్ వరకు అన్నింటిపై కొత్త ఈవో ఫోకస్ చేశారు. వ్యాపారులను పిలిచి నిబంధనలు ఏంటో… అవి పాటించకుంటే పర్యవసనాలేంటో విశదీకరించారు. అవినీతి అధికారులపై వేటు పడటం మొదలైంది. నాణ్యతపై ఫోకస్ పెరిగింది. అంతేందుకు తిరుమల శ్రీవారి ప్రసాదాలకు సప్లై చేసే వస్తువుల నాణ్యత కూడా పెరిగింది. ఈవో భక్తులతో నేరుగా మాట్లాడుతున్నారు. సౌకర్యాల గురించి ఆరా తీస్తున్నారు. ఫలితంగా ఒక్కొక్కొటిగా మార్పులు కనిపి స్తున్నాయి. త్వరలో రాబోయే పాలకమండలిలో కూడా నిబద్ధతతో పనిచేసే వారే ఉంటారంటున్నారు.
తిరుమలకు వచ్చే భక్తులకు సరసమైన ధరలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన ఆహారాన్ని అందించడమే టీటీడీ లక్ష్యమని ఈవో జె. శ్యామలరావు చెబుతున్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఫుడ్ సేఫ్టీ విభాగం, అన్నప్రసాదం సిబ్బందికి, పెద్ద మరియు జనతా క్యాంటీన్‌ల నిర్వాహకులకు త్వరలో శిక్షణ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.