Read more!

చంద్రబాబు రామతీర్థం అందుకే వెళ్లారా ? ఏపీలో అసలేం జరుగుతోంది ?  

తొమ్మిది నెలలుగా సైలెంట్ గా ఉన్న చంద్రబాబుకు అంత దూకుడెందుకు? కరోనా  భయపెడుతున్నా కదనరంగంలోకి ఎందుకు దూకారు ? ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశంగా మారింది.  కరోనా  కారణంగా  జనంలోకి రావడానికి జంకిన చంద్రబాబు.. ఇప్పుడు కొత్త కరోనా భయపెడుతున్నా వందలాది మంది కార్యకర్తలతో కలిసి ఆందోళన చేయడం అందరిని  అశ్చర్యపరుస్తోంది. 
వైద్యుల సూచనలు పక్కనపెట్టి మరీ చంద్రబాబు ప్రజల్లోకి రావడంపై  రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీని ఖతం చేసేందుకు జరుగుతున్న కుట్రలను చేధించేందుకే  ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా చంద్రబాబు కార్యరంగంలోకి దిగారంటున్నారు. 

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరోనా వైరస్ ఎంట్రీ తర్వాత జనంలోకి వెళ్లలేదు. ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. చంద్రబాబు వయసు ప్రస్తుతం 76 ఏండ్లు. అందుకే కరోనా వైరస్ భారీన పడకుండా ఉండేందుకు ఆయన్ను బయట  తిరగవద్దని వైద్యులు చెప్పారని తెలుస్తోంది. అందుకే పార్టీ కార్యక్రమాలు కూడా దాదాపుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే నిర్వహిస్తున్నారు. గత మార్చి తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాల్లో నేరుగా పాల్గొన్నవి రెండు. మూడే. మహానాడు సందర్భంగా కొందరు నేతలతో సమావేశమయ్యారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ సమయంలో గుంటూరు హాస్పిటల్ కు వెళ్లి ఆయన్ను పరామర్శించారు. అప్పుడు కూడా ఆయన పూర్తి స్థాయిలో కోవిడ్ జాగ్రత్తలు తీసుకున్నారు. తొమ్మిది నెలలుగా జనంలోకి రాని చంద్రబాబు... ఇప్పుడు మాత్రం ఒక్కసారిగా స్పీడ్ పెంచారు. విజయనగరం జిల్లా  రామతీర్థంలో  విగ్రహం ధ్వంసమైన ప్రదేశాన్ని పరిశీలించారు. అక్కడే ఆయన ఆందోళన నిర్వహించారు. 

ఏపీలో కొన్ని రోజులుగా హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. పలు ఆలయాల్లో దేవుళ్ల విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. తాజాగా విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం ధ్వంసం చేశారు. ఇన్నేళ్ల ఏపీ చరిత్రలో ఇలా హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరిగిన దాఖలాలు ఎప్పుడూ లేవు. దీంతో దీనివెనుక రాజకీయ కోణం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హిందుత్వ నినాదంతో బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో బలపడాలని చూస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఆలయాలపై దాడులు జరుగుతుండటంతో హిందువుల్లో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇదే అదనుగా  హిందుత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీ.. హిందువుల తరఫున స్వరం వినిపిస్తూ.. హిందువులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోందనే చర్చ  జరుగుతోంది. ఏపీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తోన్న రాజకీయ విశ్లేషకులు కూడా  మతాలుగా ఓట్లను చీల్చి, వాటిని రెండు పార్టీలు పంచుకొని  ఏపీలో టీడీపీని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతుందని అంటున్నారు.

 తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో మత రాజకీయాలే రాజ్యమేలాయి. బీజేపీ, ఎంఐఎం పార్టీలు హిందూ, ముస్లిం అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ వేడి పుట్టించాయి. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ముస్లిం మతానికి గానీ, పాతబస్తీ ప్రాంతానికి గానీ ఏమాత్రం సంబంధం లేని ఎన్టీఆర్, పీవీ ఘాట్ లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయనలా మాట్లాడిన నిమిషాల్లోనే పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. ఇలా మత పరమైన విమర్శలతో గ్రేటర్ ఎన్నికల్లో రెండు పార్టీలు లబ్దిపొందాయి. ఎప్పటిలానే మెజారిటీ ముస్లిం ఓట్లు ఎంఐఎంకు పడగా.. గతంలో గ్రేటర్ లో 10-12 శాతం ఓట్లు సాధించిన బీజేపీ ఈసారి 35 శాతానికి పైగా ఓట్లు సాధించింది. మత పరమైన వ్యాఖ్యలతో ఇతర పార్టీలకు వెళ్లాల్సిన హిందూ ఓట్లను రాబట్టడంలో బీజేపీ సక్సెస్ అయింది. అదే సమయంలో గ్రేటర్ లో గతంలో బలంగా ఉన్న కాంగ్రెస్, టీడీపీ లు పూర్తిగా వెనకబడి పోయాయి. ఓటర్లు మత పరంగా చీలడం వల్లే కాంగ్రెస్, టీడీపీకి భారీగా నష్టం జరిగిందని ఫలితాల తర్వాత తేలింది. 
 

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వ్యూహాన్నే ఏపీలో వైసీపీతో కలిసి బీజేపీ అమలు చేస్తుందని అంటున్నారు. గ్రేటర్ లో ఎలాగైతే మెజారిటీ ముస్లిం ఓటర్లు ఎంఐఎం వైపు ఉంటారో.. అలాగే ఏపీలో మెజారిటీ క్రిస్టియన్, ముస్లిం ఓటర్లు వైసీపీ వైపు ఉంటారు. ఇక్కడ కూడా బీజేపీ బలపడాలంటే హిందూ ఓట్లను తన వైపు తిప్పుకోవాలి. ఆ ప్రయత్నమే ఇప్పుడు ఏపీలో జరుగుతుందని అంటున్నారు. 
కొంతకాలంగా హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్న బీజేపీ.. జగన్ ను క్రిస్టియన్ సీఎం అంటూ విమర్శిస్తోంది. వైసీపీ నేతలేమో బీజేపీ హిందుత్వ పార్టీ అంటున్నారు. ఈ రకంగా హిందువులు అంటే బీజేపీకి ఓటెయ్యాలనే అభిప్రాయాన్ని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. క్రిస్టియన్, ముస్లిం ఓటర్లు ఎలాగూ ఎక్కువశాతం వైసీపీ వైపు ఉంటారు. ఇక మెజారిటీ హిందూ ఓట్లను రాబట్టి బీజేపీ బలపడాలని చూస్తోంది. అదే జరిగితే ఏపీలో టీడీపీ భవిష్యత్ ప్రశ్నార్థం అయ్యే పరిస్థితి ఉంది.  

ఏపీలో వైసీపీ, బీజేపీ కుట్రలను గ్రహించడం వల్లే చంద్రబాబు కరోనాను కూడా లెక్క చేయకుండా జూలు విదిల్చారని చెబుతున్నారు. బీజేపీ, వైసీపీ పార్టీల కుట్రలో భాగంగానే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీని బలహీనం చేస్తే ఏపీలో తమకు అధికారం ఖాయమనే ఆలోచనలో బీజేపీ ఉందని చెబుతున్నారు. జగన్ కూడా తన ప్రధాన శత్రువు చంద్రబాబు కాబట్టి.. ముందు టీడీపీని పినిష్ చేయాలనే కుట్రతో కమలంతో కలిసి  ఈ స్కెచ్ వేశారనే చర్చ జరుగుతోంది. టీడీపీని బలహీనం  చేసిన తర్వాత బీజేపీ బలపడినా తనకు పెద్దగా నష్టం ఉండదనే భావనలో జగన్ ఉన్నారంటున్నారు. ఈ రెండు పార్టీల కుట్రలను గమనించడం వల్లే ఆరోగ్యం సహకరించకున్నా, కరోనా ఇంకా భయపెడుతున్నా.. టీడీపీని నిలబెట్టుకునేందుకు చంద్రబాబు రంగంలోకి దిగారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అందుకే ఓట్ల కోసం బీజేపీ, వైసీపీలు నీచానికి దిగజారి మత రాజకీయాలు చేస్తున్నాయనే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఏపీ తమ్ముళ్లు చెబుతున్నారు. 

 ఏపీలో జరుగుతున్న పరిణామాలపై జనాలు కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఓట్ల కోసం మత రాజకీయాలు , ఆలయాలపై దాడులు జరుగుతున్నాయన్న ప్రచారంతో వారంతా ఆందోళనకు గురవుతన్నారు. స్వార్ధ రాజకీయాల కోసం ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ను రావణాకాష్టంలా మారుస్తున్నారని జనాలు మండిపడుతున్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం ఎంతో సేఫ్ గా ఉండేదని, జగన్ రెడ్డి పాలనతో రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ, వైసీపీ కుట్రలను తిప్పికొట్టేందుకు టీడీపీకి మద్దతు ఇవ్వాలనే ఆలోచన కూడా ఏపీ జనాల్లో వ్యక్తమవుతోందని రాజకీయ అనలిస్టులు చెబుతున్నారు.