Read more!

చంద్రబాబు కోటరీ కొంప ముంచుతుందా?

 

 

 

చంద్రబాబు నాయుడు చుట్టూ వున్న కోటరీ ఈసారీ ఆయన కొంప ముంచేలా వుందన్న ఆందోళన తెలుగుదేశం పార్టీలో వ్యక్తమవుతోంది. చంద్రబాబు తన చుట్టూ వుండే వారి విషయంలో గత రెండు ఎన్నికల సందర్భంలో ఎలాంటి పొరపాట్లు చేశారో, ఈ ఎన్నికల సమయంలో కూడా అలాంటి పొరపాట్లే చేస్తున్నారని వారు అంటున్నారు.

 

ప్రస్తుతం చంద్రబాబు చుట్టూ వున్నవారు చంద్రబాబుకి సరైన గైడెన్స్ ఇవ్వడం లేదన్న ఆరోపణలు వున్నాయి. అలాగే వారు చంద్రబాబుని తప్పుదారిలో నడిపిస్తున్నారన్న ఆవేదన కూడా పార్టీ కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం  చంద్రబాబుకు రైట్ హ్యాండ్‌గా వున్న ఒక నాయకుడి విషయంలో పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పార్టీని నమ్ముకుని, పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి, ఎన్నో త్యాగాలు చేసిన వారు పార్టీకి దూరమవ్వడానికి ఆ వ్యక్తి కారణమవుతున్నారని అంటున్నారు.



గతంలో తెలంగాణలో టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుంటే టీడీపీకి మేలు జరుగుతుందని చంద్రబాబుకు బ్రెయిన్ వాష్ చేసి ఒప్పించిన సదరు వ్యక్తి ఆ నిర్ణయం ద్వారా తెలుగుదేశం పార్టీకి చాలా నష్టం కలిగించారు. ఇప్పుడు అదే వ్యక్తి చంద్రబాబు వెంటే వుంటూ ఆయన్ని తప్పుదోవలో నడిపిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సీమాంధ్రలోని చాలా స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అంతగా బలం లేని అభ్యర్థులను నిలబెట్టడానికి ఆ వ్యక్తే కారణమని కార్యకర్తలు విమర్శిస్తున్నారు. సదరు వ్యక్తితోపాటు చంద్రబాబు చుట్టూ వున్న మరికొందరు వ్యక్తులు కూడా ఆయనకి రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నారని అంటున్నారు. ఈ కోటరీ ఈసారి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కొంప ముంచేస్తుందేమోనన్న భయాందోళలను కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు.