దౌర్జన్య రాజ్యం.. మండలి చైర్మన్ ను బెదిరించిన వైసీపీ నేతలు!!
posted on Jan 23, 2020 @ 1:52PM
తెలుగుదేశం ఎమ్మెల్సీలు అసాధారణంగా పోరాడి రాష్ట్ర భవిష్యత్తును కాపాడారని తెలుగు దేశం అధినేత చంద్రబాబు ప్రశంసించారు. ధ్వజస్థంభాల్లా నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడారని.. వారి స్ఫూర్తి చరిత్రలో నిలిచిపోతుందన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్య నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు చంద్రబాబు. అయితే మండలి చైర్మన్ ఫరూక్, ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా పోరాడారన్నారు.
లోకేష్ పై ముగ్గురు మంత్రులు దౌర్జన్యం చేశారన్నారు. ఉన్మాదం పై పోరాడటానికి సర్వశక్తులు పెట్టాలని ధైర్యం నూరి పోశారు. అనుభవజ్ఞుడి అండ ఎంత అవసరమో యనమల రామకృష్ణుడు నిరూపించారన్నారు చంద్రబాబు. అసెంబ్లీ లో ఎమ్మెల్యేలు రింగు దాటితే బయటపడేయాలంటూ మార్షల్స్ ను ఆదేశించిన సీఎం జగన్ మండలి లో చైర్మన్ పోడియం ఎక్కి పేపర్లు చించేసిన వైకాపా ఎమ్మెల్సీలను ఏం చేయాలో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 25 మంది మంత్రుల మండలిలో తిష్ఠవేసి వీరంగం సృష్టించారని చైర్మన్ షరీఫ్ పై దాడి చేసినంత పని చేశారని మండిపడ్డారు. చైర్మెన్ కు పిల్లలూ.. మనువళ్లు ఉన్నారనే విషయం గుర్తుంచుకోవాలంటూ వైసీపీ నేతలు బెదిరింపులకు దిగారని చంద్రబాబు ఆరోపించారు.