ప్రత్యర్థులపై కక్ష సాధించడం ఫ్యాక్షనిస్టుల స్వభావం.. ఇప్పుడు జగన్ చేస్తున్నది ఇదే
posted on Jun 13, 2020 @ 10:00AM
టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు.
"ఒక అవినీతిపరుడు, ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న నేర స్వభావి చేతికి అధికారం వస్తే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో అవన్నీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నాయి. ప్రత్యర్థులపై కక్ష సాధించడం అన్నది ఫ్యాక్షనిస్టుల స్వభావం. ఇప్పుడు ఈ వైఎస్ జగన్ చేస్తున్నది ఇదే." అంటూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
"నిన్న బీసీ నేత అచ్చెన్నాయుడు ఇంటి గోడలుదూకి మరీ వెళ్ళిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేసారు. ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను అరెస్టు చేసారు. ప్రలోభాలకు లొంగని తెలుగుదేశం నేతలను ఇలా అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులతో బెదిరిస్తున్నారు." అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
"ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. పరిపాలనలో ఘోరంగా విఫలమై ప్రజల దృష్టిని మరల్చడానికి పాలకులు చేస్తున్న అరాచకాలను అందరూ అడ్డుకోవాలి. లేదంటే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం." అని చంద్రబాబు పేర్కొన్నారు.