జగన్ బ్యాచ్ అధికారులకు బాబు క్లాస్!
posted on Sep 2, 2024 @ 6:28PM
విజయవాడ వరద ముంపు బాధితులను ఆదుకోవడానికి ఏడుపదుల వయసు దాటిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగి పనిచేస్తుంటే, జగన్ బ్యాచ్ అధికారులు మాత్రం తూతూమంత్రంగా సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. విపత్తు సమయంలో కూడా రాజకీయాలను ప్రదర్శిస్తున్నారు. అలాంటి అధికారులకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షించారు. సహాయక చర్యల్లో కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంలో వ్యవహరించినిన తరహా అలసత్వం వదిలించుకోకపోతే సహించేది లేదు అంటూ ఆయన జగన్ బ్యాచ్ అధికారులను హెచ్చరించారు. సహాయక చర్యల కోసం స్వయంగా తానే రంగంలోకి దిగినా అధికారులు మొద్దునిద్ర వీడకపోతే ఎలా అంటూ ఆగ్రహించారు. కావలసిన స్థాయిలో ఆహార పదార్థాలు తెప్పించగలిగినా పంపిణీ విషయంలో జాప్యంపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. బుడమేరు ముంపు ప్రాంతాల్లో కొందరు ఉన్నతాధికారుల కారణంగా ఆహారం పంపిణీలో జాప్యం జరిగిందని ఓ మంత్రి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. జగన్ బ్యాచ్ అధికారులు విధులు నిర్వహించిన ప్రాంతాల్లో ఈ పరిస్థితి వుందని ఆయన చెప్పారు. ఆహార పంపిణీ సక్రమంగా, వేగంగా జరగకుండా ఆ అధికారులు కావాలనే వ్యవహరిస్తున్నట్టు గుర్తించానని సదరు మంత్రి ముఖ్యమంత్రికి చెప్పారు. మంత్రి చెప్పిన అంశాన్ని తీవ్రంగా పరిణించిన చంద్రబాబు ఆయా అధికారులు డ్యూటీలో ఉన్న ప్రాంతంలో జాప్యంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పని చేయడం ఇష్టం లేకపోతే ఉద్యోగాలు వదిలేసి ఇంటికి వెళ్లాలని.. ప్రజలు బాధల్లో ఉన్న సమయంలో ఇలాంటి పోకడలను సహించేది లేదని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పారు.