After WG district, Babu to visit Ananthapur next

 

After WG district, Babu to visit Ananthapur next As a part of two-day-district-visit program, AP CM Chandrababu Naidu will visit in Ananthapur district on July 24, 25th. Previously, he visited some villages in West Godavari for two days and interacted with the people and dwakra groups there. Now, he will meet people in Dharmavaram, Putaparthi and Kadiri constituencies.

 

At the same time he will also hold meetings with district police, revenue and municipal officials and review the administrative situation. He will also conduct road shows and mini public meetings during this two-day visit. Ministers Paritala Sunitha and Palle Raghunatha Reddy are likely to accompany him during this visit. This two-day visits on every week to each district is intended to facilitate the people of the districts to directly approach him and the government officials accompanying him and to enable him study the problems of the people. He will administer the government from there itself during his visit with the help of a senior officer of his office.

కేసీఆర్ నేల విడిచి సాము.. బాబు బూచి అంటే జనం నమ్ముతారా?

బీఆర్ ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ మరోసారి నేల విడిచి సాము చేశారు.  కేసీఆర్ సుదీర్ఘ కాలం తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన పార్టీ ఓటమికి కారణాలు, ఇటీవలి కాలంలో పార్టీలో సంక్షోభ పరిస్థితులపై మాటమాత్రమేనా ప్రస్తావించకుండా.. ఏక‌కాలంలో అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ స‌ర్కారుని, పనిలో పనిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై విమర్శలు గుప్పిస్తూ వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని మోడీ సర్కార్ తెలంగాణకు శనిలా దాపురించిందని శాపనార్ధాలు పెట్టారు.   రాష్ట్రానికి అన్యాయం జ‌రుగుతుంటే.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ దద్దమలా చూస్తూ కూర్చుందంటూ దుయ్యబట్టారు. అలాగే చంద్రబాబునా యుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు. సాగునీటి ప్రాజెక్టులలో తెలంగాణ అన్యాయంపై ఆయన మాట్లాడినా, ఆయన అసలు లక్ష్యం మాత్రం చంద్రబాబును రెచ్చగొట్టి చంద్రబాబు  లేదా, తెలుగుదేశం పార్టీ నుంచి ప్రతి విమర్శలు రావాలనీ, అలా వస్తే మొత్తం పరిస్థితిని తెలంగాణ వర్సెస్ ఏపీగా మార్చి ఏకకాలంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనీ, కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్నీ ఇరుకున పెట్టాలన్నట్లుగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అంతర్గత సంక్షోభంలో కూరుకుపోయి, రాష్ట్రంలో పార్టీ ఉనికి మాత్రంగా మిగిలిన ప్రస్తుత పరిస్థితులలో తెలంగాణ సెంటిమెంట్ ను ఆసరా చేసుకుని రాష్ట్రంలో బలోపేతం కావాలన్న ఉద్దేశం వినా కేసీఆర్ మాటలలో రాష్ట్రానికి జలాల విషయంలో అన్యాయం జరుగుతోందన్న ఆవేదన కానీ, ఆందోళన కానీ కనిపించలేదని అంటున్నారు. ఒక వేళ అటువంటిదేమైనా ఉంటే.. తన కుమార్తె కవిత కాళేశ్వరం ప్రాజెక్టును దండగమారి ప్రాజెక్టు అనడంపై స్పందించి కనీసం ఆమె వ్యాఖ్యలను ఖండించి ఉండేవారని చెబుతున్నారు.  పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాప్యంపై కాంగ్రెస్ ను దుమ్మెత్తి పోసిన ఆయన.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్ ప్రభుత్వానికి ఇంత కాలం సమయం ఇచ్చామనీ, ఇక నుంచి మాత్రం ఊరుకునేది లేదనీ హెచ్చరించారు. త్వరలో బహిరంగ సభలు ఏర్పాటు చేసి మరీ రేవంత్ సర్కార్  వైఫల్యాలను ఎండగడతామని హెచ్చరించారు.  కేసీఆర్ మీడియా సమావేశం పెట్టి కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించినా, ఆయన మాటలు విన్న ఎవరికైనా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీయా అన్న అనుమానం రాకమానదు. ఎందుకంటే కేసీఆర్ ప్రెస్ మీట్ మొత్తం చంద్రబాబు జపంగా మారిపోయింది. కనీసం ఓ 50 సార్లు ఆయన చంద్రబాబు పేరు ప్రస్తావించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి కాంగ్రెస్, బీజేపీలు కాదు చంద్రబాబే కారణమని తేల్చేశారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ కు చంద్రబాబు గురువు అన్నారు. బాబును కాదనీ రేవంత్ ఏం చేయరన్నారు. అలాగే కేంద్రంలో మోడీ సర్కార్ మనుగడకు కీలకంగా ఉన్న చంద్రబాబు అభీష్ఠం మేరకే కేంద్ర ప్రభుత్వం నడుచుకుంటోందంటూ ఆరోపణలు గుప్పించారు.  కేసీఆర్ వైఖరి చూస్తుంటే.. తెలంగాణలో బీఆర్ఎస్ రాజకీయంగా బలపడాలన్నా, కనీసం ఉనికిని చాటుకోవాలన్నా చంద్రబాబు ను లాగకుండా సాధ్యం కాదని ఆయన భావిస్తున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) 2018 ఎన్నికలలో విజయం సాధించి రెండో సారి అధికారంలోకి రావడానికి కేసీఆర్ రగిల్చిన సెంటి ‘మంటే’ కారణమనడంలో సందేహం లేదు. అయితే రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న లక్ష్యంతో స్వయంగా తానే సెంటిమెంట్ ను నీరుగార్చేశారు. పార్టీ పేరులో తెలంగాణను తీసేశారు. అందుకే నీట తగాదాలు, సాగర్ వివాదం అంటూ 2023 ఎన్నికల ముందు ఎంత ప్రయత్నించినా జనం తిరస్కరించారు. కేసీఆర్ రాజకీయ అవసరాల కోసం సెంటిమెంట్ పని చేయదన్న విషయాన్ని సందేహాలకు అతీతంగా తెలంగాణం 2023 ఎన్నికలలో తీర్పు ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సెంటిమెంటు అంటూ పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రిని బూచిగా చూపాలని కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం నేల విడిచి సామేనని అంటున్నారు పరిశీలకులు.  

జగన్ కు షర్మిల బర్త్ డే విషెస్.. ధ్యాంక్యూ షర్మిలమ్మా అంటూ జగన్ రెస్సాన్స్

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం (డిసెంబర్ 21) తన 53వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు సహా పలువురు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే విశేషమేంటంటే.. ఇటీవలే ఆయన సోదరి వైఎస్ షర్మిల కూడా తన జన్మదినాన్ని జరుపుకున్నారు. ఆ సందర్భంగా కూడా ఏపీ సీఎం చంద్రబాబాబు, మంత్రి లోకేష్ సహా రాజకీయాలకు అతీతంగా పలువురు నేతలు, ప్రముఖులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే షర్మిల సొంత అన్న జగన్ మాత్రం చెల్లెలికి శుభాకాంక్షలు తెలియజేయలేదు. ఈ అన్నా చెళ్లెళ్ల మధ్య చాలా కాలంగా విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆస్తుల పంచాయతీ నుంచి, పొలిటికల్ గా దారులు వేరవ్వడం వరకూ ఇరువురి మధ్యా అగాధం పూడ్చలేనంతగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే.    షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తరువాత నుంచీ వీరి మధ్య విభేదాలు మరింత పెచ్చరిల్లాయి.  2024 ఎన్నికలకు ముందు, తరువాత కూడా షర్మిల జగన్ పై విమర్శల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్యా జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకోవడం, రాఖీలు కట్టడం వంటివి అన్నీ నిలిచిపోయియి.  అయితే తాజాగా ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అందుకు జగన్ కూడా స్పందించారు. ధ్యాంక్యూ షర్మిలమ్మా అంటూ రిప్లై ఇచ్చారు. జగన్ కు షర్మిల పుట్టిన రోజు శుభాకాంక్షల ట్వీట్, అలాగే అందుకు జగన్ రెస్పాన్స్ రెండూ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. 

కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది : కేసీఆర్

  తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని  బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. రేవంత్ ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని గర్వంతో ఎగిరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ది చెప్పారని తెలిపారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అహంకారం ప్రదర్మించలేదన్నారు.  తనను తిట్టడం తాను చనిపోవాలని శాపాలు పెట్టడమే ఈ ప్రభుత్వ విధానం అని కేసీఆర్ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గ భేటీ తెలంగాణ భవన్‌లో ప్రారంభమైంది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గసభ్యులతో గులాబీ అధినేత భేటీ అయ్యారు.  కారు పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలైతే బీఆర్‌ఎస్‌ సత్తా తెలిసేది. బీఆర్‌ఎస్ పార్టీ విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్‌రెడ్డి ఒక్క కొత్త పాలసీ కూడా తేలేదు. తీసుకొచ్చిన పాలసీ.. రియల్‌ ఎస్టేట్‌ కోసమే. రాష్ట్రంలో ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గింది. ఒకప్పుడు యూరియా ఇంటికి, చేను వద్దకు వచ్చేది. ఇప్పుడు యూరియా కోసం ఫ్యామిలీ మొత్తం లైన్‌లో నిలబడే పరిస్థితి వచ్చింది’’ అని గులాబీ బాస్ విమర్మించారు

వైసీపీ, బీఆర్ఎస్ బంధానికి ఇంత కంటే రుజువుంటుందా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం తన పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు, ఆయన పార్టీ నేతలు, శ్రేణుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి.  అవన్నీ పక్కన పెడితే  తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన  ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది. జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని  తాడేపల్లిలోని జగన్ నివాసం అదేనండి తాడేపల్లి ప్యాలెస్ వద్ద పెద్ద ఎత్తున బ్యానర్లు, హోర్డింగ్ లు, కటౌట్ లు వెలిశాయి.  వీటిలో ఒక బ్యానర్ మాత్రం అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షిస్తోంది.  ఆ భారీ కటౌల్ లో జగన్, కేసీఆర్, కేటీఆర్ చిత్రాలు ఉండటమే అందుకు కార ణం. ఈ బ్యానర్ రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఈ బ్యానర్ బీఆర్ఎస్, వైసీపీ బంధానికి నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఇటీవల బెంగళూరులోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో జగన్ కేటీఆర్ తో భేటీ అయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు.  

బీజేపీలో చేరిన ప్రముఖ సినీ నటి

  ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు. నాంపల్లి సెంట్రల్ ఆఫీసులో రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆమెకు కాషాయ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.  అనంతరం పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఆమని మాట్లాడుతు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న ప్రగతిని చూసి గర్వపడుతున్నాని తెలిపారు. ప్రధాని చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితురాలినై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.  ఆయన సనాతన ధర్మం కోసం మోదీ ఎంతో పాటుపడుతున్నారు" అని ఆమె పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా పోరాటాలపై నెమ్మదిగా స్పందిస్తున్న బీజేపీ, ఇప్పుడు అనూహ్యంగా సినీ తారలను చేర్చుకోవడంపై దృష్టి పెట్టడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా విజయశాంతి, జయసుధ, జీవితా రాజశేఖర్ వంటి వారిని పార్టీలోకి ఆహ్వానించింది. కొందరు అగ్ర హీరోలతో బీజేపీ జాతీయ నేతలు భేటీ కావడం, దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి  

మీరసలు హిందువులేనా, మీకసలు దేశ భక్తి ఉందా?.. విజయసాయి

వైసీపీ మాజీ నాయకుడు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి హిందుత్వ అనుకూల వ్యాఖ్యలు చేశారు. రాజకీయ సన్యాసం తీసుకుని వ్యవసాయమే వ్యాపకమంటూ ప్రకటించిన ఆయన అడపాదడపా రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తున్న విషయం తెలిసిందే.  అన్నిటికీ మించి ఆయన ఇటీవలి కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు ఆయన కమలం గూటికి చేరువ అవుతున్నారన్న సంకేతాలు ఇస్తున్నాయి. విజయసాయి కాషాయ మంత్రం జగన్ కు కషాయం కావడం తథ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల ఒక సందర్భంగా ఆయన హిందూమతంపై కుట్రలు జరుగుతున్నాయంటూ తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు ఆశ చూపి మతమార్పిడులకు పాల్పడుతున్న వారికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అక్కడితో ఆగకుండా గత రెండు దశాబ్దాలుగా జరిగిన మతమార్పిడులపై ఓ కమిటీ వేసి మరీ విచారణ జరపాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. దీంతో ఆయన జగన్ అండ్ వైసీపీ టార్గెట్ గా రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారంటూ పరిశీలకులు విశ్లేషించారు. ఇప్పుడు తాజాగా  బంగ్లాదేశ్ లో ఆందోళనలు హింసాకాండపై ఎక్స్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి.. బంగ్లాదేశ్ లో హిందువులు లక్ష్యంగా దాడులు జరుగుతున్నా యన్నారు. ఈ దాడులను ఆయన నరమేధంగా అభివర్ణించారు. ఈ దాడులను ఖండించని వారు అసలు హిందువులే కారనీ, వారికసలు దేశ భక్తే లేదంటూ విమర్శలు గుప్పించారు.  బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అమానుష దాడులను ఖండించకుండా మౌనంగా ఉన్న రాజకీయ పార్టీలకు, నాయకులకు ఈ దేశంలో కొనసాగే నైతిక హక్కు లేదని పేర్కొన్నారు.   భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై  స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు. దీంతో ఆయన తన రాజకీయ పున: ప్రవేశానికి కమలదళం గొంతుకను సిద్ధం చేసుకుంటున్నారని పరిశీలకులు అంటు న్నారు.  

పీపీపీపై న్యాయపోరాటం ఎలా? వైసీపీ మల్లగుల్లాలు!

పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల వ్యవహారాన్ని రాజకీయం చేయడానికి అష్ఠకష్టాలు పడిన వైసీపీ.. కోటి సంతకాలంటూ చేసిన హడావుడి ముగిసింది. గవర్నర్ కు వినతిపత్రంలో ఆ ప్రహసనం దాదాపు ముగిసిపోయినట్లే. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల పట్ల ప్రజల వ్యతిరేకత పెద్దగా కనిపించలేదని స్పష్టమైంది. దీంతో ఇప్పుడు కోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది. ఈ విషయంలో కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయడానికి సన్నాహాలు చేస్తున్నది. అయితే ఇక్కడే ఆ పార్టీకి పెద్ద ఇబ్బంది వచ్చి పడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పీపీపీ విధానం వద్దు అంటూ కోర్టును ఆశ్రయిస్టే ఆ పిటిషన్ అడ్మిషన్ స్థాయిలోనే తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందంటున్నారు న్యాయ నిపుణులు. ఎందుకంటే పీపీపీ విధానం అన్ని పరీక్షలకూ తట్టుకుని నిలబడిన అంశం. కేంద్రం నుంచి పలు రాష్ట్రాలలో ఇన్ ఫ్రాస్టక్చర్ డెవలప్ మెంట్ అన్నది ఈ పీపీపీ విధానంలోనే జరుగుతోంది. సరే అది కాదని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది.  దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు. అది పక్కన పెడితే తాము సేకరించిన కోటి సంతకాలనూ కోర్టు ముందు ఉంచుతామన్న వాదనను వైసీపీ తెరపైకి తీసుకువస్తున్నది. అయితే అదీ అంత తేలిక కాదు. నిజంగా వైసీపీ కోటి సంతకాలు సేకరించి, వాటిని కోర్టుకు సమర్పించాలంటే, ఆ కోటి సంతకాలు చేసిన వారి గుర్తింపును కూడా కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. వాస్తవానికి సంతకాల సేకరణ కార్యక్రమం ఎలా జరుగుతుందన్నది అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో సంతకాలు చేసిన కోటి మంది ఐడెంటిటీని కోర్టు ముందు ఉంచడం అంటే అయ్యే పని కాదని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. ఈ నేపథ్యంలో పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రైవేటు కాలేజీలకు వ్యతిరేకంగా న్యాయపోరాటానికి ఎలా ముందుకు వెడుతుందన్నది ఆసక్తిగా మారింది. 

సానుకూల దృక్ఫథంతో సవాళ్లను అధిగమించా.. విద్యార్థులతో నారా లోకేష్

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయకత్వ పటిమ విషయంలో కానీ, సమస్యలను దీటుగా ఎదుర్కొని పరిష్కరించగలిగిన పరిణితి విషయంలో కానీ, పార్టీకి అన్నీ తానై దిశా నిర్దేశం చేయగలిగిన సమర్థత విషయంలో కానీ ఇప్పుడు ఎవరికీ ఎటువంటి అనుమానాలూ లేవు.   సొంత పార్టీయే కాదు, ప్రత్యర్థి పార్టీలు సైతం ఇప్పుడు నారా లోకేష్ పరిణితి చెందిన నాయకుడనీ, ప్రజాభిమానం చూరగొన్న ప్రజా నాయకుడని అంగీకరిస్తున్నాయి. అయితే నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత తేలిగ్గా రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి. పొలిటికల్ గా నారా లోకేష్ తొలి పలుకులు కూడా బయటకు రాకూడదన్న కుట్రలు జరిగాయి. పప్పు అంటూ బాడీ షేమింగ్,  హేళనలు ఇలా ఎన్నో ఎదుర్కొన్నారు. టార్గెట్ చేసి మరీ క్యారెక్టర్ అసాసినేషన్ కు ప్రయత్నాలు జరిగాయి. సోషల్ మీడియాలో ట్రోలింగ్ , మీమ్స్ తో లోకేష్ రాజకీయ ఎదుగుదనలను ఆరంభంలోనే అణచివేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఈ విషయాలన్నిటినీ మంత్రి నారా లోకేష్ రాజమహేంద్ర వరంలో శుక్రవారం (డిసెంబర్ 19) విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమంలో గుర్తు చేసుకున్నారు. వాటన్నిటినీ అధిగమించడానికి తాను ఏం చేశారో పంచుకున్నారు.   తన శక్తిని అటువంటి ట్రోలింగ్స్, మీమ్లను ఖండించడానికీ, బుదలు ఇవ్వడానికీ వృధా చేయ కూడదని అందుకు బదులుగా  రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగడంపైనే దృష్టి సారించాననీ వివరించారు. తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో  పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.  తనకు ఎదురైన ప్రతి సవాలును సానుకూల దృక్ఫ థంతో ఎదుర్కొన్నానని చెప్పారు.  ఒక అడుగు వెనక్కి వేస్తే సరిదిద్దుకోవడానికి సంవత్సరాలు పట్టవచ్చని ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు చెప్పారు.   

రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే సవాల్ కు మంత్రి లోకేష్ సై

ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అభివృద్ధి విషయంలో తనతోనే పోటీ పడతానంటూ సవాల్ చేసిన పార్టీ ఎమ్మెల్యేను అభినందించారు. మనస్ఫూర్తిగా ఆ సవాల్ ను స్వీకరిస్తున్నానని సభా ముఖంగా ప్రకటించారు. ఇంతకీ విషయమేంటంటే.. రాజమహేంద్రవరంలో శుక్రవారం (డిసెంబర్ 19) పర్యటించిన నారా లోకేష్ అక్కడ  నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతల సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు.. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గాన్ని మంగళగిరికి దీటుగా అభివృద్ధి చేస్తానన్నారు. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో తాను నారా లోకేష్ తో పోటీ పడతానని అన్నారు. దీనికి నారా లోకేష్ చాలా చాలా సానుకూలంగా స్పందించారు. సిటీ  ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సవాల్ ను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలతో మమేకమౌతూ ముందుకు సాగాలన్న లోకేష్.. ఆదిరెడ్డి వాసు కుటుంబం కష్ట సమయంలో తమకు అండగా ఉందని చెప్పారు.  జగన్ హయాంలో చంద్రబాబును అక్రమంగా రాజమహేంద్రవరం జైల్లో నిర్బంధించిన సమయంలో ఆదిరెడ్డి కుటుంబం తమకు అండగా నిలిచిందని చెప్పారు. ఆయనను తాను తన కుటుంబ సభ్యుడిగా భావిస్తానన్నారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై విమర్శలు గుప్పించారు. జగన్ ను సైకోగా అభివర్ణించారు. సైకో ఇంకా అరెస్టులు చేస్తానంటూ చేస్తున్న బెదరింపులను ఖండించారు.  అధికారంలో ఉండగా వైనాట్ 175 అంటూ గప్పాలు కొట్టిన వారు, గత ఎన్నికలలో టీమ్ 11 కు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. కూటమి పార్టీల మధ్య చిచ్చుపెట్టే కుట్రలు జరుగుతున్నాయన్న ఆయన ఆ విషయంలో అప్రమత్తంగా ఉండాలని లోకేష్ సూచించారు. వచ్చే 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వమే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందన్నారు. 

వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి.. కేటీఆర్ కు ముళ్ల కిరీటమేనా?

క‌మ్యూనిస్టుల‌కు  ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అనే ప‌ద‌వి ఎంత  ప‌వ‌ర్ ఫుల్లో.. బీఆర్ఎస్ వంటి పార్టీల‌కు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి అంటే అంత వేల్యుబుల్.  అయితే బీఆర్ఎస్ లో సమస్య ఏమిటంటే.. పార్టీ అధినేత కేసీఆర్ త‌ర్వాత అంత‌టి వాడిగా.. ఆయన పొలిటిక్ వారసుడిగా కేటీఆర్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన ఏ ఎన్నికలోనూ పార్టీ విజయాన్ని నమోదు చేసింది లేదు. నల్లేరు మీద బండినడక అనదగ్గ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇదే విషయాన్ని ఎత్తి చూపుతూ కేటీఆర్ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.  వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పరాజయాలను ఎదుర్కొంటూనే ఉంటుందన్నారు.  వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఎంపికైన నాటి  నుంచి ఇప్ప‌టి  వ‌ర‌కూ   గ్రేట‌ర్, కార్పొరేషన్, ఆ తరువాత 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 సార్వత్రిక ఎన్నికలు, ఇవి రెండూ పూర్తయిన తరువాత  రెండు ఉప ఎన్నికలు, తాజాగా పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అయితే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఈ అన్ని ఎన్నికలలోనూ ఆయన ప్రచార బాధ్యతను భుజాన వేసుకుని పని చేశారు. అయితే వేటిలోనూ పార్టీని విజయం దిశగా నడిపించలేకపోయారు.  దుబ్బాక నుంచి మొద‌లు పెడితే నిన్న మొన్న‌టి  జూబ్లీహిల్స్ బై పోల్ వ‌ర‌కూ ప్ర‌తి ఎన్నికలోనూ పార్టీని పరాజయమే వరించింది.  ఇటీవ‌లి స్థానిక ఎన్నిక‌ల‌లోనూ కేటీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ఓటమినే మూటగట్టుకుంది.   రేవంత్  విమర్శలను పక్కన పెడితే..  కేటీఆర్ కి కానీ,  బీఆర్ఎస్ కి కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అచ్చిరాలేదన్న ప్రచారం బీఆర్ఎస్ శ్రేణుల్లోనే జోరుగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం తరువాత తొమ్మిదేళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కేటీఆర్ సమర్ధ నాయకుడిగా గుర్తింపు పొందడం వెనుక తండ్రి ఇమేజ్ ఉంది. సీఎం కుమారుడిగా, మంత్రిగా ఆయన మాటే వేదంగా అప్పట్లో ప్రభుత్వ, పార్టీ వ్యవహారాలు సాగాయి. అయితే ఆ ఘనత అంతా కేసీఆర్ దేనని అంటారు విమర్శకులు. ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయిన తరువాత.. ముందుండి పార్టీని నడిపించడంలో కేటీఆర్ వైఫల్యాలు ప్రస్ఫుటంగా కనిపిస్తుండటంతో సొంత పార్టీలోనే కేటీఆర్ నాయకత్వంపై సందేహాలు, అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు.  ఎన్నికలలో వరుస పరాజయాలతో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన కొనసాగింపుపైనా బీఆర్ఎస్ లో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి.  అయినా బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలలో కూడా కార్యనిర్వాహక అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న వారు ఉన్నారు. కానీ వారి విషయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై ఈ స్థాయి చర్చ జరగడం లేదు. ఒక్క కేటీఆర్ విషయంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన సామర్థ్యం, అర్హతపై రాజకీయ ప్రత్యర్థలు నుంచే కాదు, బీఆర్ఎస్ శ్రేణులు, నేతల నుంచి కూడా ప్రశ్నలు ఎదురౌతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..  కేటీఆర్  పార్టీకి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్  గా  ఉన్నన్ని రోజులూ బీఆర్ఎస్ గెలుపు అన్న మాటను మరచిపోవడం మంచిదన్న సూచన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతే కాదు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావే సోషల్ మీడియాలో పదె్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.  చూడాలి మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ముందు ముందు ఎలా నెట్టుకుని, నెగ్గుకుని వస్తారో?