వైసీపీలోకి చలమలశెట్టి సునీల్.. అధికారం దూరమవుతుందన్న ఆందోళనలో వైసీపీ శ్రేణులు!
posted on Aug 10, 2020 @ 12:24PM
టీడీపీకి మరో నాయకుడు గుడ్‌బై చెప్పబోతున్నారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పటికే పలువురు నాయకులు టీడీపీని వీడగా.. తాజాగా ఆ లిస్టులో మరో నాయకుడు చేరారు. టీడీపీ నేత చలమలశెట్టి సునీల్ సోమవారం సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
ఇదివరకు వైసీపీలో చాలాకాలం పాటు కొనసాగిన చలమలశెట్టి సునీల్.. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆ ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి తోట నర్సింహం చేతిలో ఓడిపోయారు. అనంతరం టీడీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు.
సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాకినాడ ఎంపీ అభ్యర్దిగా టీడీపీ తరఫున పోటీ చేసిన ఆయన.. వైసీపీ అభ్యర్థి వంగా గీత చేతిలో ఓటమి చవి చూశారు. ఓటమి తర్వాత టీడీపీకి దూరంగా ఉంటున్నారు. తాజాగా మళ్లీ ఆయన సొంతగూటిలో చేరడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. 2022లో రాజ్యసభకు ఖాళీ అవుతున్న ఓ ఎంపీ స్థానంలో సునీల్ కు అవకాశం కల్పించడానికి అధికార పార్టీతో ఇటీవల మంతనాలు జరిగినట్టు తెలుస్తోంది. వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువాను కప్పుకోనున్నారని సమాచారం.
అయితే సునీల్ వైసీపీ గూటికి చేరుతున్నారన్న వార్తతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. దానికి సునీల్ ఎన్నికల ట్రాక్ రికార్డే కారణం. ఇప్పటి వరకూ కాకినాడ లోకసభ స్థానం నుంచి సునీల్ మూడుసార్లు పోటీచేయగా.. ముడుసార్లూ ఆయనకు పరాజయం ఎదురయ్యింది. అంతేకాదు ఆయన ఏ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసినా, ఆ పార్టీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసింది.
తొలిసారి 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున పోటీచేసిన సునీల్.. కాంగ్రెస్ అభ్యర్థి పళ్లంరాజు చేతిలో ఓటమి చవిచూశారు. ఆ ఎన్నికల్లో కేవలం 18 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న ప్రజారాజ్యం.. తర్వాత కాంగ్రెస్ లో విలీనమైంది. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేయగా.. ఆయనకు ఓటమి ఎదురైంది, వైసీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయగా.. ముచ్చటగా మూడోసారి ఆయన ఓడిపోవడమే కాకుండా.. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ఘోర పరాజయంపాలై ప్రతిపక్షానికి వచ్చేసింది.
ఇలా చలమలశెట్టి సునీల్ ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ ఓడిపోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇదే ఇప్పుడు వైసీపీ శ్రేణులకు ఆందోళన కలిగిస్తోంది. ఆయన ప్రజారాజ్యంలో చేరితే ఆ పార్టీనే కనుమరుగైంది. వైసీపీలో ఉంటే ప్రతిపక్షానికి పరిమితం కావాల్సి వచ్చింది. టీడీపీలో చేరితే ఆ పార్టీకి అధికారం దూరమైంది. మళ్ళీ ఇప్పుడు సునీల్.. వైసీపీ గూటికి వస్తుండటంతో.. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ మళ్ళీ ప్రతిపక్షానికి పరిమితమవ్వక తప్పదా అని వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.