విద్యారంగంలోనే అతిపెద్ద డీల్... శ్రీచైతన్య విద్యాసంస్థకు 8వేల కోట్ల ఆఫర్
posted on Oct 22, 2019 @ 1:03PM
తెలుగు రాష్ట్రాల్లోని అతిపెద్ద విద్యాసంస్థ చేతులు మారనున్నట్లు తెలుస్తోంది. 1986లో విజయవాడ కేంద్రంగా ఏర్పాటైన శ్రీచైతన్య విద్యాసంస్థను అమ్మకానికి పెట్టినట్లు సమాచారం అందుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల్లో 700 బ్రాంచ్ లు పైగా కలిగివున్న శ్రీచైతన్య విద్యాసంస్థల నుంచి ప్రమోటర్స్ అండ్ ఇన్వెస్టర్స్ వైదొలగాలని నిర్ణయించుకోవడంతో వ్యవస్థాపకులు ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. శ్రీచైతన్య విద్యాసంస్థల్లో 27శాతం వాటా కలిగివున్న పీఈ గ్రూప్... 2011లో 25 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసింది. అయితే, పెట్టుబడి పెట్టి ఎనిమిదేళ్లు దాటడంతో లాభాలతో వైదొలగాలని పీఈ గ్రూప్ నిర్ణయించుకుంది. అదే సమయంలో శ్రీచైతన్య గ్రూప్ ప్రమోటర్స్ కూడా సంస్థ నుంచి బయటికి రావాలని డిసైడయ్యారట. దాంతో శ్రీచైతన్య విద్యాసంస్థను అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది.
అయితే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల్లో 700కి పైగా బ్రాంచ్ లు కలిగివున్న శ్రీచైతన్య విద్యాసంస్థపై బ్రూక్ ఫీల్డ్ అండ్ కల్పథి ఇన్వెస్ట్ మెంట్స్ ఆసక్తి చూపిస్తున్నాయి. ఐటీ ఎడ్యుకేషన్ బిజినెస్ లో సక్సెస్సైన కల్పథి ఇన్వెస్ట్ మెంట్ గ్రూప్ ఈ డీల్ పై ఇంట్రస్ట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. కేజీ నుంచి ఇంటర్ వరకు పలు రాష్ట్రాల్లో స్కూల్స్, కాలేజీలు కలిగివున్న శ్రీచైతన్య విద్యాసంస్థ కొనుగోలుకు దాదాపు 8వేల కోట్ల రూపాయలను ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 1.1 బిలియన్ డాలర్లకు ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ బ్రూక్ ఫీల్డ్ అండ్ కల్పథి ఇన్వెస్ట్ మెంట్స్ సంస్థలు ప్రపోజల్ పెట్టినట్లు చెబుతున్నారు.
1986లో డాక్టర్ దంపతులైన బోపన్న సత్యనారాయణరావు, ఝాన్సీ లక్ష్మీబాయి కలిసి శ్రీచైతన్య విద్యాసంస్థను ప్రారంభించారు. మొదట విజయవాడలో బాలికల కాలేజీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా పెద్దఎత్తున బ్రాంచ్ లను నెలకొల్పారు. కేజీ టు ఇంటర్ సెగ్మెంట్ లో 700కి పైగా స్కూల్స్ అండ్ కాలేజీలను ఏర్పాటు చేశారు. అలాగే, బోర్డు ఎగ్జామ్స్ లోనూ, ఎంట్రన్స్ పరీక్షల్లోనూ... ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దేశవ్యాప్తంగా అనేక సంచలన విజయాలను శ్రీచైతన్య విద్యాసంస్థ నమోదు చేసింది. అలాంటి పేరున్న విద్యాసంస్థ చేతులు మారనుందనే వార్తలు సంచలన రేపుతున్నాయి. అంతేకాదు విద్యారంగంలో అతిపెద్ద డీల్ గా ఇది భావిస్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలే ప్రధాన కేంద్రంగా నడుస్తోన్న శ్రీచైతన్య విద్యాసంస్థ కొనుగోలుకు 8వేల కోట్ల రూపాయలు ఆఫర్ రావడమంటే నిజంగానే ఇది చిన్న విషయం కాదు మరి.