వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లదు: స్పష్టం చేసిన సీఈసీ
posted on Sep 21, 2022 @ 10:06PM
ఏపీ సీఎంకు కేంద్ర ఎన్నికల సంఘం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎంపిక చెల్లదని విస్పష్టంగా తేల్చేసింది.ఒక్క వైసీపీ అనే కాదు ఏ రాజకీయ పార్టీలోనూ శాశ్వత పదవులు అనేవి ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొంది. పార్టీ శాశ్వత ఎన్నిక నియమాల ఉల్లంఘనేనని పేర్కొంది.
ఈ మేరకు వైసీపీ జనరల్ సెక్రటరీకి సీఈసీ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లుబాటు కాదని ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా ఇటీవల జరిగిన ఆ పార్టీ ప్లీనరీలో జగన్మోహన్‌రెడ్డిని ఎన్నుకున్న సంగతి విదితమే.
జగన్ ను శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు ప్లీనరీలో పార్టీ రాజ్యాంగాన్ని కూడా సవరించిన సంగతి విదితమే సీఈసీ గైడ్ లైన్స్ మేరకు గుర్తింపు పొందిన ప్రతి రాజకీయ పార్టీ రెండేళ్లకోసారి పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించి అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలి. అంతే తప్ప పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా నియామకాలు వీలు కాదు. నిబంధనలు విస్పష్టంగా ఉన్నప్పటికీ ఖాతరు చేయకుండా జగన్‌ను శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
ప్రజాప్రతినిథ్య చట్టం ప్రకారం రాజకీయ పార్టీ నిర్దుష్ట కాలపరిమితిలో ఎన్నికల ద్వారా అధ్యక్షుడిని, ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవాలి. అందుకే వైసీపీకి జగన్ శాశ్వత అధ్యక్షుడంటూ ఆ పార్టీ చేసిన తీర్మానం, ఎన్నిక చెల్లదని సీఈసీ స్పష్టం చేసింది.