లేని అధికారాల వినియోగం.. మునుగోడు అర్వోపై ఈసీ వేటు
posted on Oct 21, 2022 @ 9:45AM
నిబంధనలను తుంగలో తొక్కి అధికార పార్టీతో అంటకాగితే అధికారులపై చర్యలు తప్పవని కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి రుజువు చేసింది. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కేంద్ర ఎన్నికల సంఘం విధుల నుంచి తొలగించింది. మునుగోడు ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న భూసేకరణ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ జగన్నాథరావును మునుగోడు రిటర్నింగ్ అధికారి బాధ్యతల నుంచి తొలగించింది. ఇంతకీ ఆయనేం చేశారంటే.. ఒక అభ్యర్థికి ఎన్నికల గుర్తు కేటాయింపు జరిగిన తరువాత దానిని మార్చారు. ఈ విషయంలో ఆయన లేని అధికారాన్ని వినియోగించారని సీఈసీ తప్పుపట్టింది.
ఒక అభ్యర్థికి కేటాయించిన ఎన్నికల గుర్తును మార్చడం ద్వారా ఆయన.. లేని అధికారాన్ని వినియోగించారని తప్పుపట్టింది. రద్దు చేసిన రోడ్డు రోలర్ గుర్తు.. తిరిగి అదే అభ్యర్థికి కొనసాగుతుందని స్పష్టం చేసింది. గంటల వ్యవధిలోనే మిర్యాలగూడ ఆర్డీవో బి.రోహిత్‌సింగ్‌ను నూతన ఆర్వోగా నియమించింది. మామూలుగా గుర్తింపు పొందని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఈసీ వద్ద ఉన్న గుర్తుల జాబితా నుంచి ఒక్కొక్కరు మూడింటిని ప్రాధాన్యక్రమంలో ఎంచుకోవాలి. వాటి నుంచి లాటరీ ద్వారా గుర్తులు కేటాయిస్తారు. యుగతులసి పార్టీ నుంచి పోటీ చేస్తున్న కె.శివకుమార్ తొలి ప్రాధాన్యంగా రోడ్డు రోలర్ గుర్తును ఎంచుకున్నారు.
లాటరీలో అదే గుర్తు రావడంతో దాన్ని కేటాయిస్తున్నట్లు ఈ నెల 17వ సీఈసీ ప్రకటించింది. అయితే ఆ తరువాత అభ్యర్థి శివకుమార్ కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఆయనకు కేటాయించిన గుర్తు రోడ్ రోలర్ గుర్తును మార్చి బేబీ వాకర్ గుర్తును కేటాయించారు. దీంతో శివకుమార్ ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం శివకుమార్ కు మళ్లీ ఎన్నికల గుర్తునే కేటాయించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం రాత్రి శివకుమార్ కు రోడ్ రోలర్ గుర్తునే కేటాయిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా, లేని అధికారాలను వినియోగించిన మునుగోడు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని విధుల నుంచి తొలగించింది. కా
గా తెలంగాణలో ఇలా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన కారణంగా అధికారిని విధుల నుంచి తొలగించడం ఇదే మొదటి సారి కాదు. గతంలో అంటే హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో అధికార తెరాసకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై అప్పటి సూర్యాపేట ఎస్పీ వెంకటేశ్వర్లును ఈసీ ఆ ఉప ఎన్నికల విధుల నుంచి తొలగించింది.