ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్.. రిపేర్లు మొదలుపెట్టిన పాక్
జమ్మూ కశ్మీర్ పహల్గామ్ లో ఈ ఏడాది ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఆపరేషన్‌లో భాగంగా పాక్, పీఓకేలోక చొచ్చుకెళ్లి ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది. ఆ సందర్భంగా భారత్ దాడుల్లో మురిద్ ఎయిర్‌బేస్‌లోని కీలక భవనం ధ్వంసమైందనీ, ప్రస్తుతం పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయని శాటిలైట్ ఫోటోలు వెల్లడించాయి. పాక్ డ్రోన్ కార్యకలాపాలకు కేంద్రమైన ఈ భవనంపై జరిగిన దాడి తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఆపరేషన్ సిందూర్ కారణంగా పాకిస్థాన్ లో దెబ్బతిన్న ఇతర ఎయిర్‌బేస్‌లలోనూ మరమ్మతులు జరుగుతున్నా యి. 26 మంది అమాయకులను బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. దీంతో ఇరు దేశాల మధ్య సైనిక ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో పాక్ వైమానిక, సైనిక స్థావరాలపై భారత వైమానిక దళం బాంబులు వర్షం కురిపించింది. పాకిస్థాన్‌కు చెందిన మురిద్ ఎయిర్‌బేస్‌లోని కీలక కమాండ్ అండ్ కంట్రోల్ భవనంపై కూడా దాడిచేసింది. ఆ దాడిలో ధ్వంసమైన భవనానికి పాక్ పునర్నిర్మాణ పనులు చేపట్టినట్టు తాజాగా హై-రిజల్యూషన్ శాటిలైట్ ఫోటోలు బయటపెట్టాయి. భారత్ దాడిలో భవనం పైకప్పు కూలిపోయి, నిర్మాణానికి తీవ్ర నష్టం వాటిల్లిందని భావిస్తున్నారు.
డిసెంబర్ 16 నాటి వంటోర్ ఫోటోలు పాకిస్థాన్ డ్రోన్‌లను ఆపరేట్ చేసే ఒక పెద్ద కాంప్లెక్స్ పక్కనే ఉన్న భవనాన్ని ఎర్రటి టార్పాలిన్‌తో కప్పి ఉంచడాన్ని చూపిస్తున్నాయి. ఈ టార్పాలిన్‌ను రిపేర్లు లేదా జరిగిన నష్టాన్ని శాటిలైట్ నిఘా కంటబడకుండా ఉండేందుకు సైన్యాలు సాధారణంగా ఉపయోగిస్తాయి. జూన్ నెలలో తీసిన ఫోటోల్లో భవనంపై చిన్న ఆకుపచ్చ టార్పాలిన్ కనిపించింది. ఇప్పుడు మొత్తం భవనం పెద్ద టార్పాలిన్ కింద మరమ్మతు లేదా పునర్నిర్మాణంలో ఉంది. దీనిపై దాడికి రూఫ్-పెనెట్రేటింగ్ వార్‌హెడ్‌లు కలిగిన క్షిపణులను ఉపయోగించి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ క్షిపణులు భవనం పైకప్పును చీల్చుకుని లోపల పేలి, ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. పంజాబ్‌లోని చక్వాల్ జిల్లాలో ఉన్న మురిద్ ఎయిర్‌బేస్ పాకిస్థాన్ వైమానిక దళానికి ముఖ్యమైన స్థావరం. ఇక్కడ నుంచే షాహ్‌పర్ సిరీస్, బుర్రాక్, బేరక్టార్ టిబి2/ అకిన్సీ, వింగ్ లూంగ్ II వంటి డ్రోన్‌లను ఆపరేట్ చేస్తారు. మే 10న పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మేజర్ జనరల్ కషిఫ్ అబ్దుల్లా కాల్పుల విరమణ కోసం భారత్ డీజీఎంఓకి కాల్ చేయడానికి కొన్ని గంటల ముందు ఆ దేశ ఎయిర్‌బేస్‌లపై భారత వైమానిక దళం దాడులను తీవ్రతరం చేసింది.
దీనికి ముందు 26కు పైగా ప్రదేశాలలో పాక్ డ్రోన్ దాడులకు తెగబడటంతో ప్రతిగా భారత వాయు సేన ఈ దాడులు చేసింది. ఈ సమయంలో ఐఏఎఫ్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ నోడ్స్, ఎయిర్‌బేస్‌లు, ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థపై పాక్ దాడులు చేసింది. ఉధంపూర్, పఠాన్‌కోట్, అదంపుర్, భుజ్‌లలోని ఐఏఎఫ్ స్థావరాలకు, సిబ్బందికి స్వల్ప నష్టం జరిగింది. మే 10న మురిద్‌పై భారత్ రెండో దాడి చేయగా.. అక్కడ భూగర్భ సదుపాయానికి 30 మీటర్ల దూరంలో మూడు మీటర్ల వెడల్పుతో పెద్ద గొయ్యి ఏర్పడినట్టు శాటిలైట్ ఫోటోలు వెల్లడించాయి. నిపుణుల అంచనా ప్రకారం.. ఈ భూగర్భ స్థావరం ప్రత్యేక పరికరాల నిల్వకు లేదా భారీ బాంబు దాడులను తట్టుకోగలిగేందుకు ఉద్దేశించినదట.
దాడులకు గురైన తన ఎయిర్‌బేస్‌లలో పునర్నిర్మాణ పనులు దాయాది దేశం ప్రారంభించింది. సర్దార్‌లోని ముషఫ్ ఎయిర్‌బేస్, దక్షిణ పంజాబ్‌లోని రహీమ్ యార్ ఖాన్‌లోని దెబ్బతిన్న రన్‌వేలను మరమ్మతు చేసుకుంది. జాకబ్‌బాద్, భోలారి, సుక్కూర్‌లలోని హ్యాంగర్‌లు ధ్వంసమయ్యాయి. జాకబ్‌బాద్‌లో పలుఎ ఫ్-16 ఫైటర్ విమానాలు ధ్వంసమైనట్టు నివేదికలు వచ్చాయి. భోలారిలోని హ్యాంగర్‌పై దాడిలో ఒక ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్ ధ్వంసమైంది. సుక్కూర్‌లో హ్యాంగర్‌ను నేలమట్టం చేసింది. ఇస్లామాబాద్ సమీపంలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌పై భారత వైమానిక దళం జరిపిన దాడులలో ధ్వంసమైన కాంప్లెక్స్ స్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టింది.