చంద్రబాబు సూపర్ ఫార్ములా.. కూటమి పార్టీల నేతల్లో జోష్!
posted on Jul 26, 2024 @ 10:17AM
ఆంధ్రప్రదేశ్ లో నామినేటెడ్ పదవులపై కూటమి పార్టీల నేతలు ఆశలు పెట్టుకున్నారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల్లోని ద్వితీయ శ్రేణి నేతలు, ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన నేతలు నామినేటెడ్ పదవుల్లో తమకు అవకాశం దక్కుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే, కూటమిలో మూడు పార్టీలు ఉండటంతో నియోజకవర్గాల వారిగా నామినేటెడ్ పదవుల కేటాయింపు అంశంపై ఆ పార్టీల నేతల్లో ఇన్నాళ్లు ఆందోళన నెలకొంది. ముఖ్యంగా జనసేన, తెలుగుదేశం నేతల మధ్య పలు నియోజకవర్గాల్లో నామినేటెడ్ పదవుల విషయంలో తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలో నామినేటెడ్ పదవుల విషయంలో రెండు పార్టీల నేతల మధ్య విభేదాలు తలెత్తడం ఖాయమని, వారి మధ్య విబేధాలను తమకు అనుకూలంగా మార్చుకోవచ్చని వైసీపీ అధిష్ఠానం ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే నియోజకవర్గాల వారిగా ఏఏ నియోజకవర్గాల్లో జనసేన, తెలుగుదేశం నేతల మధ్య నామినేటెడ్ పదవుల విషయంలో భిన్నాభిప్రాయాలు తలెత్తే అవకాశం ఉందనే అంశంపై ఓ డేటా సైతం వైసీపీ పెద్దలు సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే, వారి ఆశలపై నీళ్లు చల్లే విధంగా చంద్రబాబు నాయుడు సూపర్ ఫార్ములా రూపొందించారు.
ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 50 రోజులు కావస్తోంది. అధికారంలోకి వచ్చిన రోజునుంచి సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధిపై మంత్రులు దృష్టి సారించారు. వేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దీంతో ఐదేళ్లు వైసీపీ అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కూటమిలోని పార్టీల నేతలు నామినేటెడ్ పదువులపై గంపెడాశలు పెట్టుకున్నారు. గత ప్రభుత్వంలో నియమితులైన కొందరు ఇప్పటికీ నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్నారు. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును రద్దు చేసిన ప్రభుత్వం.. తాజాగా రాష్ట్రంలో మిగిలిన నామినేటెడ్ పోస్టులు, ఆలయాలు, ట్రస్టు బోర్డు పాలకవర్గాలపై దృష్టి పెట్టింది. మరో వైపు నియోజకవర్గ, జిల్లా స్థాయిలో భర్తీ చేయాల్సిన పోస్టులపైనా ఆరా తీస్తోంది. అయితే, నామినేటెడ్ పదవుల్లో తమకు అవకాశం కల్పించాలని కూటమిలోని మూడు పార్టీల నేతలూ ఆయా పార్టీల అధిష్ఠానాలపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో నామినేటెడ్ పదువుల భర్తీ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఓ ఫార్ములాను రూపొందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఫార్ములాను అమలు చేయాలని నిర్ణయించారు. చంద్రబాబు నిర్ణయానికి కూటమిలోని బీజేపీ, జనసేన పార్టీల నేతలు సైతం ఆమోదం తెలపడంతో మూడు పార్టీల్లోని ద్వితీయ స్థాయి నేతల్లో జోష్ నెలకొంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు కూటమి పార్టీల్లోని నేతల మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలూ తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీల బలాబలాలను బేరీజు వేసుకొని ప్రభుత్వంలో అందరికీ తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ముఖ్యంగా ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడానికి మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు కీలకంగా పనిచేశారని ఇప్పటికే పలు సందర్భాల్లో చంద్రబాబు ప్రస్తావించారు. ఈ క్రమంలోనే త్వరలో భర్తీ చేయబోయే నామినేటెడ్ పదువుల్లో అన్ని పార్టీల నేతలకూ అవకాశం కల్పించేలా చంద్రబాబు ఓ ఫార్ములాను తయారు చేశారు. దీని ప్రకారం కూటమికి 164 మంది ఎమ్మెల్యేలు ఉండగా, నియోజకవర్గాన్ని ఓ యూనిట్‌గా తీసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట్ల 60 శాతం నామినేటెడ్ పదవులు టీడీపీ నేతలకు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మిగిలిన 40 శాతంలో 30శాతం జనసేన నేతలకు, బీజేపీకి 10 శాతం పదవులు కట్టబెడతారని తెలుస్తోంది. అదే విధంగా జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో 60 శాతం జనసేన పార్టీ నేతలకు, 30శాతం టీడీపీ, 10 శాతం బీజేపీ నేతలకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని నిర్ణయించారని సమాచారం. ఇదే విధంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఆ పార్టీకి 50శాతం.. మిగిలిన 50శాతం పదవుల్ని తెలుగుదేశం, జనసేన చెరో సగం పంచుకోవాలని నిర్ణయించినట్లు కూటమి నేతలు పేర్కొంటున్నారు. చంద్రబాబు తాజా నిర్ణయంతో మూడు పార్టీల నేతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వీటిల్లో తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, విజయవాడ కనకదుర్గ ఆలయాలకు పాలకవర్గాలను నియమించాల్సి వుంది. వీటిల్లో ఏ పార్టీ నేతలకు ఎక్కువ అవకాశాలు దక్కుతాయనే అంశం ఆసక్తికరంగా మారింది. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి తెలుగుదేశం పార్టీ నేత దక్కే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఏర్పాటు కాబోయే పాలక వర్గాల్లో మూడు పార్టీల్లోని నేతలకు ప్రాధాన్యత కల్పించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తరువాత నామినేటెడ్ పదవులపై చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు దృష్టిసారించనున్నారు. తొలి విడతలో 10 నుంచి 15శాతం నామినేటెడ్ పదువులను భర్తీ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారని చెబుతున్నారు. దీంతో ఈ పోస్టులు ఎవరికి దక్కుతాయనే ఉత్కంఠ మూడు పార్టీల నేతల్లో నెలకొంది. మొత్తానికి నామినేటెడ్ పదవుల పంపకాల విషయంలో చంద్రబాబు ఫార్ములా పట్ల మూడు పార్టీల నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.