చంద్రబాబు, పవన్ సరికొత్త వ్యూహం.. వైసీపీ మైండ్ బ్లాక్!
posted on Mar 7, 2024 8:42AM
ఏపీలో మరి కొద్ది రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించడమే లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన కూటమి అడుగులు వేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ పార్టీ విజయం సాధించకూడదనీ, ఇందు కోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వననీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎప్పుడో ప్రకటించారు. అందుకోసం తెలుగుదేశంతో కలిసి ముందుకు సాగడమే మార్గమని నిర్ణయించి ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. అంతే కాకుండా సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విమర్శల డోస్ ను తీవ్రతరం చేశారు. జగన్ కు సరైన మొగుడ్నినేనే.. పాతాళాకి తొక్కేస్తానంటూ పవన్ హెచ్చరికలు సైతం జారీ చేశారు.
ఇప్పటికే తెలుగుదేశం అధినేత చంద్రబాబు, లోకేశ్ ల దూకుడుతో బెంబేలెత్తిపోతున్న వైసీపీ శ్రేణులు పవన్ కల్యాణ్ కూడా తోడుకావడంతో తమ పార్టీ ఓటమి పక్కా అనే నిర్ణయానికి వచ్చేశారు. మరోవైపు చంద్రబాబు, పవన్ ను ఎదుర్కొనేందుకు జగన్, వైసీపీ పెద్దలు అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి ఎలాంటి ఫలితాలను ఇవ్వకపోవటం వైసీపీ శ్రేణులను మరింత కలవరానికి గురిచేస్తోంది. దీంతో చాలా మంది నేతలు వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. పవన్ కల్యాణ్ ను ఓ భయం వెంటాడుతోంది. గత ఎన్నికల్లో రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కల్యాణ్ ఈసారి ఎలాగైనా చట్టసభల్లో అడుగు పెట్టాలనే పట్టుదలతో ఉన్నారు. అయితే, తెలుగుదేశం బలం తోడుకావడంతో పవన్ కల్యాణ్ చట్టసభలో అడుగు పెట్టడం ఖాయమని జనసైనికులు పేర్కొంటున్నారు. ఇదంతా ఒకలెక్కైతే.. తాజాగా పవన్ కల్యాణ్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తారనీ, అందులో ఒకటి లోక్ సభ స్థానం అయితే మరొకటి అసెంబ్లీ స్థానం అంటూ వస్తున్న సమాచారం వైసీపీ శ్రేణులను కలవరానికి గురి చేయడమే కాకుండా మైండ్ బ్లాక్ అయ్యేలా చేసిందని అంటున్నారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ రెండు చోట్లా పరాజయం పాలయ్యారు. జనసేన పార్టీ కేవలం ఒక్క నియోజకవర్గంలో మాత్రమే విజయం సాధించింది. ఆ ఎమ్మెల్యే సైతం కొద్దిరోజులకే వైసీపీకి మద్దతు ప్రకటించారు. ఈసారి ఎలాగైనా జనసేన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెట్టాలని పవన్ పట్టుదలతో ఉన్నారు. దీంతో తెలుగుదేశంతో కలిసి ఎన్నికలో బరిలోకి దిగుతున్నారు. వీరికి బీజేపీకూడా తోడయ్యే అవకాశాలు ఉన్నాయి. జనసేన పార్టీ తరపున 24 మంది అభ్యర్థులు అసెంబ్లీ , ముగ్గురు పార్లమెంట్ బరిలో దిగనున్నారు. అయితే, పవన్ కల్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారన్న అంశం ఆసక్తికరంగా మారింది. తొలుత కాకినాడ నియోజకవర్గం నుంచి పవన్ అసెంబ్లీ బరిలో నిలుస్తారని, ఆ తరువాత అనంతరం లేదా భీమవరంలో పోటీ చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. తాజాగా పిఠాపురం నుంచి పవన్ బరిలోకి దిగడం ఖాయమని, అక్కడ ఇల్లు కొనుగోలు చేసేందుకూ ప్రయత్నాలు చేస్తున్నారని జనసైనికులు పేర్కొంటున్నారు. దీనికితోడు పలు దఫాలుగా పవన్ పిఠాపురం నియోజకవర్గంలో విజయావకాశాలపై సర్వేలుసైతం నిర్వహించారని తెలుస్తోంది. తాజాగా పవన్ కల్యాణ్ రెండు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం.
పవన్ కల్యాణ్ అసెంబ్లీ స్థానంతోపాటు.. లోక్ సభ స్థానానికి పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది. ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేయబోతున్నారనే విషయం తెలిసి వైసీపీ నేతలు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి పోటీ చేయడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తుండగా.. ఎంపీ అభ్యర్థిగా అనకాపల్లి నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో పవన్ ఉన్నారని సమాచారం. ఇప్పటివరకు పవన్ సోదరుడు నాగబాబు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని అందరూ భావించారు. కానీ, నాగబాబు అచ్యుతాపురంలో ఇంటినికూడా ఖాళీ చేయడంతో ఆయన అనకాపల్లి ఎంపీ నియోజకవర్గం నుంచి తప్పుకున్నారని, ఆ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారని ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతున్నది. పవన్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక చంద్రబాబు, పవన్ కల్యాణ్ వ్యూహం ఉందని అంటున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ లోక్ సభ బరిలో దిగే విషయమై పవన్ టీడీపీ అదినేత చంద్రబాబు, బీజేపీ పెద్దలతో సైతం చర్చించినట్లు తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ అసెంబ్లీ నియోజకవర్గంతోపాటు పార్లమెంట్ నియోజకవర్గం నుంచికూడా పోటీ చేయాలని నిర్ణయించుకోవటం వెనుక పెద్ద ప్లానే ఉందని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లగా పవన్ కల్యాణ్ ఆ కూటమికి బయట నుంచి సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. అయితే, విభజన హామీల విషయంలో బీజేపీ, టీడీపీ మధ్య విబేధాలు తలెత్తాయి. అప్పట్లో పవన్ కల్యాణ్ కూడా కేంద్రం పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని విమర్శించారు. అప్పట్లో ఏర్పడిన సమన్వయలోపం పునరావృతం కాకుండా ఉండాలంటే తెలుగుదేశం, జనసేన కూటమి నుంచి బలమైన నాయకుడిగా పవన్ కల్యాణ్ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు, పవన్ బీజేపీ పెద్దలతో చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. రాష్ట్రంలో తెలుగుదేశం , జనసేన కూటమి అధికారం ఖరారైపోయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమాన్ని తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వాధినేతగా చంద్రబాబు చూసుకుంటారని, కేంద్రం నుంచి అందాల్సిన సహాయ సహకారాల విషయంలో పవన్ అన్ని అంశాలను చక్కదిద్దే బాధ్యతను భుజానికెత్తుకుంటారని తెలుస్తోంది. దీంతో అటు కేంద్రంలో పవన్ కల్యాణ్, ఇటు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు పక్కా ప్లాన్ తో బీజేపీతో కలిసి ముందుకెళ్తున్నారని ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. పవన్ లోక్ సభ బరిలోకి దిగడం అంటే బీజేపీ తెలుగుదేశం, జనసేన కూటమితో కలవడం ఖాయమని అంటున్నారు. అంటే బీజేపీ దూరంగా ఉంటుందన్న జగన్ చివరి ఆశ కూడా ఆవిరైపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ కు ఇటీవల కాలంలో ఎంతగా ప్రయత్నిస్తున్నా మోడీ అప్పాయింట్ మెంట్ దొరకకపోవడానికి ఇదే కారణమై ఉంటుందని చెబుతున్నారు.