మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతా.. వైరల్ అవుతున్న చంద్రబాబు పాత వీడియో
posted on May 11, 2024 @ 2:58PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం శనివారం (మే11) సాయంత్రంతో ముగుస్తుంది. సోమవారం (మే13)న ఎన్నికలు జరగనున్నాయి. కొన్ని నెలల కిందటి వరకూ రాష్ట్రంలో ఉన్న రాజకీయ వాతావరణం వేరు. ఇప్పుడు వేరు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. నాలుగైదు నెలల కిందటి వరకూ రాష్ట్రంలో మరోసారి జగన్ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు అన్న భావన గట్టిగానే వ్యక్తమయ్యేది. అయితే ఆ తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం అయితే ఏపీలో ఎన్నికల వార్ వన్ సైడేనని సామాన్య జనం కూడా అంటున్నారు. తెలుగుదేశం కూటమికి అనుకూలంగా వేవ్ ఉందని చెబుతున్నారు. నమ్ముతున్నారు.
తాజాగా పోస్టల్ బ్యాలెట్ ను ఉద్యోగులు, టీచర్లు ఉపయోగించుకున్న విధానం జగన్ సర్కార్ పై వారికి ఉన్న కసి, ఆగ్రహాన్ని ప్రస్ఫుటం చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జనబాహుల్యంలో కూడా జగన్ సర్కార్ పట్ల అదే ఆగ్రహం, అదే కసి, అదే పట్టుదల కనిపిస్తున్నాయని చెబుతున్నారు. అందుకు ఉదాహరణగా కూటమి సభలకు వెల్లువెత్తుతున్న జనసందోహాన్ని చూపుతున్నారు. మరో వైపు జగన్ సభలు వినా వైసీపీ చెప్పుకోదగ్గ ఒక్క భారీ బహిరంగ సభా నిర్వహించకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇక పార్టీ అధినేతగా జగన్ కూడా రాష్ట్రం మొత్తం చుట్టేయలేదు. అన్ని నియోజకవర్గాలనూ కవర్ చేయలేదు. ఏదో ప్రచారం నిర్వహించామన్నట్లుగానే ఆయన మనమంతా సిద్ధం సిద్ధం పర్యటనలు ఉన్నయని చెబుతున్నారు.
ఇక మరో వైపు దేశ విదేశాల నుంచి ఆంధ్రులు పెద్ద సంఖ్యలో తమ స్వస్థలాలకు తిరిగి వస్తున్నారు. ఈ సారి ఎన్నికలలో ఎలాగైనా తమ ఓటు హక్కు వినియోగించుకుని రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించాలన్న పట్లుదల వారిలో కనిపిస్తోంది. సరిగ్గా రెండు రోజుల కిందట ఉద్యోగులు ఎలాంటి పట్టుదలతో సంకల్పంతో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారో సరిగ్గా అలాంటి పట్టుదల, సంకల్పం సుదూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోర్చి స్వరాష్ట్రానికి తిరిగి వస్తున్న ఆంధ్రులలో కనిపిస్తోంది. సర్వత్రా తెలుగుదేశం విజయభేరి మోగించడం ఖాయమన్న భావన వ్యక్తమౌతున్న వేళ.. తెలుగుదేశం శ్రేణులు, అభిమానులలలో మరింత జోష్ నింపే విధంగా ఒక పాత వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది.
ఆ వీడియో 2021 నవంబర్ 21న అసెంబ్లీలో చంద్రబాబు ప్రసంగం. నాడు నిండు అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని వైసీపీ దుర్భాషలాడారు. చంద్రబాబును అవమానించారు. కనీసం మైక్ కూడా ఇవ్వకుండా వేధించారు. దాంతో ఆయన అప్పుడు నిండు అసెంబ్లీలో తాను మళ్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రిగానే అడుగుపెడతానంటూ ప్రతిజ్ణ చేశారు. ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ అని విమర్శించి తాను మళ్లీ గౌరవ సభలో అదీ ముఖ్యమంత్రిగానే అడుగుపెడతానని ప్రకటించి అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు.
నాడు చంద్రబాబు అసెంబ్లీలో చేసిన ఆవేశపూరిత ప్రసంగాన్నీ, ప్రతిజ్ణనూ అప్పడు తన మొబైల్ ఫోన్ లో వీడియో రికార్డు చేసిన ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే ఇప్పుడు సరిగ్గా ఎన్నికల వేళ సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. అంతే ఆ వీడియో వెంటనే వైరల్ అయిపోయింది. తెలుగుదేశం కేడర్ ను, మద్దతు దారులను ఉత్తేజితులను చేస్తోంది. ఎలాగైనా జగన్ ను ఓడించి, వైసీపీని గద్దెదించాలన్న వారి పట్టుదలను ద్విగుణీకృతం చేస్తోంది. 2012లో తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయ లలితను అప్పడి డీఎంకే ప్రభుత్వం నిండు సభలో అవమానించిన తరువాత ఆమె కూడా తాను మళ్లీ సీఎంగానే సభలో అడుగుపెడతానని శపథం చేశారు. అన్నట్లుగానే ఆ తరువాత జరిగిన ఎన్నికలలో అన్నాడీఎంకే ఘన విజయం సాధించింది. జయలలిత సీఎంగా సభలో అడుగు పెట్టారు. ఆ విధంగా చంద్రబాబు కూడా తన ప్రతిజ్ణ నెరవేర్చుకుంటారనీ, మే 13న జరిగే ఎన్నికలలో ఘన విజయం సాధించి సీఎంగానే ఏపీ అసెంబ్లీలో అడుగుపెడతారని తెలుగుదేశం శ్రేణలు ధీమాగా ఉన్నాయి.