తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి చంద్రబాబు మార్గదర్శకత్వమే కీలకం!
posted on Jul 8, 2024 @ 10:26AM
చంద్రబాబు మార్గదర్శకత్వం తెలుగు రాష్ట్రాల ప్రగతి, పురోగతికి ఎంతో కీలకమన్న అభిప్రాయం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో వ్యక్తం అయ్యింది. చందబాబు దార్శనికత, అనుభవం, తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి దోహదం చేస్తాయన్న భావన వ్యక్తం అయ్యింది. హైదరాబాద్ అభివృద్ధిలో ఆయన ముద్ర చెరగనిదని భేటీలో పాల్గొన్న తెలంగాణ మంత్రులు సైతం అభిప్రాయపడ్డారు. కీలక ప్రాజెక్టులపై పరస్పర సహకారం అత్యంత అవసరమని, అందుకు చంద్అరబాబు చొరవ తీసుకోవాలని కోరారు. చంద్రబాబుతో ప్రగతి భవన్ లో జరిగిన భేటీపై రేవంత్ సంతృప్తి, సంతోషం వ్యక్తం చేశారు. కీలక ప్రాజెక్టులపై కలిసి పని చేయడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఒక అవగాహనకు వచ్చాయి. ఇరు రాష్ట్రాల మధ్యా సయోధ్య, సహకారంతోనే రాష్ట్రాలుగా విడిపోయినా అభివృద్ధిలో జమిలిగా ముందుకు సాగడానికి వీలౌతుందన్న ఏకాభిప్రాయానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ వచ్చారు. సమస్యలపై తరచూ మాట్లాడుకుంటూ వీలైనంత వేగంగా ఉభయతారకంగా సమస్యలను పరిష్కరించుకోవాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ నిర్ణయం తీసుకుంది. సానుకూల దృక్ఫథం, పరస్పర సహకారంతో ముందుకు వెడితేనే విభజన సమస్యల పరిష్కారం జరుగుతుందన్న అభిప్రాయం ఆ భేటీలో వ్యక్తం అయ్యింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలు, ఇతర సమస్యల పరిష్కారంపై శనివారం( జులై 6) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మధ్య హైదరాబాద్‌లో చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన తరువాత ఏ వివాదాలూ లేకుండా రెండు రాష్ట్రాలకు సంబంధించిన అత్యంత కీలకాంశాల పరిష్కారం కోసం జరిగిన మొదటి సమావేశం ఇదేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే వివిధ జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులను పరస్పర సహకారంతో వేగంగా పూర్తిచేసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.
హైదరాబాద్- అమరావతి మధ్య ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే, బుల్లెట్ ట్రైన్, హైదరాబాద్- బెంగళూరు ఎక్స్‌ప్రెస్ వే వంటి ప్రాజెక్టులకు భూసేకరణను వేగంగా పూర్తి చేసి వీలైనంత త్వరగా ఆ ప్రాజెక్టులను ఆచరణలోకి తీసుకురావాలన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. తెలంగాణలో విమానాశ్రయాలు, విమాన సర్వీసులకు సంబంధించిన అంశాలపై పరస్పరం సహకరించుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడు ఉన్నందున ఆయన సహకారంతో తెలంగాణకు సంబంధించిన పెండింగ్ అంశాల్ని పరిష్కరించుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమైంది.
రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 42 మంది లోక్‌సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నందున రెండు రాష్ట్రాల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం వద్దకు కలిసి వెళితే బాగుంటుందని రేవంత్‌రెడ్డి సూచించారు. రెండు రాష్ట్రాల్లోనూ వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నందున రాజకీయంగా అది సాధ్యం కాదని చంద్రబాబు పేర్కొన్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో కలిసి ప్రయత్నం చేయవచ్చన్నారు. రెండు రాష్ట్రాల అధికారుల కమిటీల మధ్య వీలైనంత తరచుగా సమావేశాలు జరగాలని, అధికారులు పరస్పరం మాట్లాడుకుంటూ అన్ని అంశాల్నీ వేగంగా పరిష్కరించాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం చంద్రబాబు మార్గదర్శకత్వం రెండు తెలుగు రాష్ట్రాల పురోగతి, ప్రగతిని ఎంతగానో దోహదపడుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అయ్యింది.
ఇలా ఉండగా ఇరు రాష్ట్రాల మధ్యా పరస్పర సహకారానికి సంబంధించి తొలి అడుగు పడింది. ఇందుకు తెలంగాణ అభ్యర్థనకు సానుకూలంగా స్పందిస్తూ తొలి అడుగు చంద్రబాబు నాయుడే వేశారు. రెండు తెలుగు రాష్ట్రాలూ తనకు రెండు కళ్లు అన్న చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండో సారి అధికార బాధ్యతలు చేపట్టిన తరువాత తెలంగాణ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించడం ద్వారా తన చిత్తశుద్ధిని, తెలుగు రాష్ట్రాల ప్రగతి పట్ల తనకున్న అంకిత భావాన్నీ, తెలుగువారంతా కలిసి ఉండాలన్న తన సంకల్పాన్నీ చాటుకున్నారు.
ఏపీలో కలిపిన ఐదు గ్రామాలు తెలంగాణకు తిరిగి ఇవ్వాలన్న రేవంత్ ప్రతిపాదన పట్ల సానుకూలంగా స్పందించిన చంద్రబాబు, ఆ మేరకు కేంద్రానికి లేఖ రాయాలని రేవంత్ కు సూచించారు. తాను కూడా లేఖ రాస్తానని చంద్రబాబు రేవంత్ కు చెప్పారు. . ఏపీలో కలిపిన ఎటపాక, పురుషోత్తపట్నం, గుండాల, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు పంచాయతీలను తిరిగి ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ప్రతిపాదించారు. అలాగే కృష్ణా జలాల పంపిణీ విషయంలోనూ వివాదాలు లేకుండా కేంద్రంతో మాట్లాడి ఇరు రాష్ట్రాలకూ ఆమోదయోగ్యమయ్యే విధంగా పరిష్కరించుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. తెలంగాణ అభివృద్ధికి తన వంతు సహకారం అందించనున్నట్లు చంద్రబాబు ఆ సందర్భంగా చెప్పారు.