తెలంగాణలో తెలుగుదేశం.. పునర్వైభవం దిశగా అడుగులు?
posted on Jun 19, 2024 @ 10:09AM
ఆంధ్రప్రదేశ్ లో అమోఘ విజయం సాధించిన తెలుగుదేశం ఇప్పుడు తెలంగాణలో పార్టీ బలోపేతం, పూర్వవైభవం సాధించడంపై దృష్టి సారించింది. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం నేతలు చాలా వరకూ తమ దారి తాము చూసుకున్నారు. పార్టీని వీడారు. అయితే పార్టీ క్యాడర్ మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉంది. అందుకే తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పార్టీలన్నీ తెలుగుదేశం వైపే చూస్తాయి. ఆ పార్టీ క్యాడర్ ఎటుమెగ్గు చూపితే అటే విజయం వరిస్తుందన్న నమ్మకం పార్టీలలో బలంగా ఉంది. సమయంలోతెలంగాణలో పార్టీ బలోపేతంపై టీడీపీ దృష్టిసారించింది.
ఎవరు ఔనన్నా కాదన్నా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నేతలు లేరు కానీ కార్యకర్తలు మాత్రం పార్టీ పట్ల విశ్వాసంతో, అంకిత భావంతో పని చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నారు.. ఉంటారు. ఇది గత పదేళ్ల కాలంలో పలు సందర్భాలలో సందేహాలకు అతీతంగా రుజువైంది. రాష్ట్ర విభజన అనంతర రాజకీయ పరిణామాల కారణంగా రాష్ట్రంలో తెలుగుదేశం యాక్టివ్ రాజకీయాలకు ఒకింత విరామం అయితే ఇచ్చింది కానీ ఆ పార్టీ పునాదులు రాష్ట్రంలో చెక్కు చెదరలేదు. పార్టీ అధినేత చంద్రబాబు ఒక్క పిలుపు ఇస్తే చాలు ఇక్కడ తెలంగాణ జెండా ఎగురవేయడానికి క్యాడర్ సిద్ధంగా ఉంది. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో అన్ని పార్టీలూ తెలుగుదేశం జెండా పట్టిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు రాష్ట్రంలో పార్టీపై దృష్టి సారించిన చంద్రబాబు.. ఏపీ ముఖ్యమంత్రిగా తాను ఎంత బిజీగా ఉన్నా తెలంగాణలో పార్టీ కోసం సమయం కేటాయిస్తానని విస్పష్టంగా చెప్పారు. అంతే కాదు తెలంగాణలో స్థానిక ఎన్నికలలో పార్టీ పోటీలో ఉంటుందని ప్రకటించారు. సరే తెలంగాణలో పార్టీ కోసం అంకిత భావంతో పని చేసే కార్యకర్తలు ఉన్నారు. మరి అంకిత భావంతో పని చేసే నాయకుల సంగతి ఏమిటి? రాష్ట్రంలో పార్టీని ముందుండి నడిపించే అధ్యక్షుడు ఎవరు? అంటే మాత్రం సమాధానం దొరకని పరిస్థితి ఉంది. అందుకే చంద్రబాబు ముందుగా పార్టీ అధ్యక్షుని ఎంపికపై దృష్టి పెట్టారు. పెద్దగా క్రియాశీలంగా లేని పలువురు తామంటే తామంటూ ముందుకు వస్తున్నారు. కనీసం ఏడాదికోసాని ఎన్టీఆర్ భవన్ లో కాలుపెట్టని నేతలు సైతం తాము తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పెద్దదిక్కుగా ఉన్నామనీ, అందుకే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి తమకే దక్కాలంటూ సన్నాయి నొక్కులు మొదదలెట్టేశారు. ఇలా పార్టీ పదవి కోసం అర్రులు చాస్తున్న వారిలో కార్యకర్తలలో పలుకుబడి ఉన్నవారెవరు అంటే కాగడా పెట్టి వెతకాల్సిన పరిస్థితి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఈ రాష్ట్రంలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఖాళీ అయ్యింది. అప్పటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ణానేశ్వర్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న తరువాత నుంచి తెలుగుదేశం తెలంగాణ అధ్యక్ష పదవి ఖాళీగానే ఉంది. తెలంగాణలో ఎన్నికల బరిలో తెలుగుదేశం దిగకపోవడంతో పార్టీ అధ్యక్ష పదవి భర్తీ కోసం తొందరపడాల్సిన అవసరం పార్టీ హైకమాండ్ కు లేకుండా పోయింది. అయితే ఇప్పడు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో చంద్రబాబు అడుగులు వేస్తుండటంతో ముందుగాతెలంగాణ అధ్యక్షుడి నియామకాన్ని సత్వరమే పూర్తి చేయాల్సి ఉంది.
అదలా ఉంచితే.. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్న తెలుగుదేశం గతంలో ఏవేవో కారణాలతో పార్టీ వీడి వెళ్లిన వారిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని భావిస్తోంది. ఇప్పటికే ఆ దిశగా కొన్ని అడుగులు కూడా పడినట్లు చెబుతున్నారు. ఏపీలో తెలుగుదేశం కూటమి ఘన విజయంతో తెలంగాణ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలన్న లక్ష్యంతో చంద్రబాబు ఉన్నారు. తెలంగాణలో పార్టీ కోసం సమయం కేటాయించి, రాష్ట్రంలో తెలుగుదేశంకు పునర్వేభవం తీసుకువస్తానని చంద్రబాబు స్వయంగా ప్రకటించడంతో పార్టీ క్యాడర్ లో జోష్ పెరిగింది. అంతే కాదు.. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో పార్టీని వీడి ఇతర పార్టీలలో ఇమడలేక ఉక్కపోతతో కొనసాగుతున్న నేతల చూపు ఇప్పుడు ఇటువైపు మళ్లింది. ఇప్పటికే ఇటువంటి పలువురు నేతలు తెలుగుదేశం అధిష్టానంతో టచ్ లోకి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.