బాబు మారారు.. ఇదే నిదర్శనం!
posted on Jan 11, 2025 @ 10:30AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కఠిన నిర్ణయాలు తీసుకోరు అన్న అపప్రధ ఉంది. ఆయన సుదీర్ఘ సమీక్షలు, విచారణలూ అంటూ నిర్ణయాలు తీసుకునే విషయంలో జాప్యం చేస్తారన్న వాదనా ఉంది. అయితే చంద్రబాబు ఇటీవలి కాలంలో పలు మార్లు స్పష్టంగా చెప్పారు. తాను మారాననీ, తప్పు చేస్తే ఇసుమంతైనా ఉపేక్షించబోననీ, తనలో 1995 నాటి చంద్రబాబును చూస్తారని చంద్రబాబు చెప్పిన మాటలను ఎవరూ పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. కానీ చంద్రబాబులో మునుపటి మెతకతనం లేదనీ తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఆయన స్పందించిన విధానం స్పష్టం చేస్తున్నది.
పాలనలో ఇక 1995 నాటి సిఎం ను చూస్తారని చంద్రబాబు ప్రకటించిన సంగతి విదితమే. తిరుపతి తొక్కిసలాటలో పలువురు భక్తులు మృతి చెందడం, మరి కొందరు తీవ్రంగా గాయపడిన ఘటనపై ఆయన వేగంగా చర్యలకు ఉపక్రమించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తిరుపతి ఎస్పీ, టీటీడీ జేఈవో గౌతమిలపై బదలీ వేటు వేశారు. ఇక్కడ గమనించాల్సినవిషయమేంటంటే తిరుపతి ఎస్పీని చంద్రబాబు ఏరికోరి తెచ్చుకున్నారు. అయినా ఆ ఎస్పీ విధినిర్వహణలో ఒకింత ఉదాశీనంగా వ్యవహరించారని తెలియగానే క్షణం ఆలోచించకుండా బదలీ వేటు వేశారు. ఈ చర్యే చెబుతుంది.. పని విషయంలో చంద్రబాబు ఇసుమంతైనా రాజీపడేందుకు సిద్ధంగా లేరని. ఇక అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన తిరుపతి డీఎస్పీపై సస్పెన్షన్ వేటు వేశారు.
అంతే కాదు.. త్వరలో టీటీడీ ఈవోపై కూడా బదలీ వేటు పడే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇక టీటీడీలో సమన్వయ లోపం.. అధికారుల వైఫల్యాలపై ఆయన మీడియా ఎదుటే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం, ఏం తమాషాగా ఉందా అంటూ గట్టిగా మందలించారు. వీటన్నిటినీ ఉటంకిస్తూ పరిశీలకులు చంద్రబాబు మారారనీ, ఆయనలో 1995 నాటి స్పీడ్ ను మళ్లీ చూస్తున్నామనీ విశ్లేషిస్తున్నారు.